కారు పెళ్లిపందిరి ముందు ఆగింది. పందిరంతా కళకళలాడుతోంది. బంధు జనంతో కిటకిటలాడుతోంది. నాలో అనిర్వచనీయమైన ఉద్వేగం. ఉత్సాహం. అరక్షణంలో కారులోంచి దిగేను.చురుక్‌మనిపిస్తోంది ఎండ. ఉదయం పది గంటలకే అదరగొట్టేస్తోంది ఎండ.పందిట్లో, అంతమందిలోను, నాన్నని క్షణంలో గుర్తు పట్టేయగలిగేను. నా పెదాలపై నవ్వు పువ్వులా విచ్చుకుంది. ఉవ్వెత్తున ఆనందం ఎగిసి పడగా, ఉద్వేగంతో ‘నాన్నా’ అని పిలిచేను. ముప్పయ్యేళ్ల దాన్ని మూడేళ్ల దాన్నయిపోయేను.నాన్న నన్ను చూడలేదు.మరోసారి పిలిచేను గట్టిగా.అంతా నావైపే చూస్తున్నారు. నాన్న మాత్రం నావైపు చూడటం లేదు. ఎటో చూస్తున్నాడు!సరిగ్గా ఆ సమయంలోనే ‘అక్కా’ అంటూ పరుగున వస్తున్నాడు గోపి... పెళ్లికొడుకు.వస్తున్నవాడు హఠాత్తుగా ఆగిపోయి బొమ్మలా వుండిపోయేడు. ‘ఆగు’ అనే ఒక పెనుకేక, కసక్కుమని వెన్నులో దిగిపోయిన కత్తిలా అతణ్ణి ఆపేసింది.పందిట్లోకి అడుగు పెట్టనీయకుండా నన్నూ ఆపేసింది అమ్మ పెనుకేక. నాపై విరుచుకుపడి, ఒకప్పటి సినిమా సూర్యకాంతంలా గొంతు చించుకు అరుస్తోంది అమ్మ.ఎన్నాళ్లకు అమ్మగొంతు విన్నాను.

ఇంటిలోపల... ఎక్కడనుంచో కాకుండా... అదేదో ఎదురుగా వచ్చి తిడితే... నా బంగారు అమ్మను కళ్లలో తడిమి తడిమి తనివితీరా చూసుకుందును కదా.పందిట్లో నాన్న అచ్చం సూర్యకాంతం సినీ మొగుడు రమణారెడ్డి ఫక్కీలో ఊపిరాడనట్టు బిక్కచచ్చిపోయి, ఇంకా ఎటోచూస్తూ, నేల దిగేసిన రాటలా నించుండిపోయేడు. నాన్న నన్ను ‘ఫో’ అనలేడు. లోనకి ‘రా’ అనలేడు. అమ్మను ఏమీ అనలేడు. అవును అమ్మ ముందు నాన్న డూడూ బసవన్న.పెళ్లికొడుకు పరిస్థితీ అంతే. అమ్మకు వ్యతిరేకంగా నోరు మెదపలేడు. నా దగ్గరకు రాలేడు.నేను ఎండలో అలా నించుండిపోయేను. ఇంటి గుమ్మంలోకి కాదు, పందిరి నీడలోకి కూడా అడుగెట్టలేని నిస్సహాయ స్థితిలో వున్నాను.అక్కడున్న మా బంధు జన పరివారమంతా నన్నొక శాపగ్రస్తలా చూస్తూ వుండి పోయేరు. ఏ ఒక్కరూ కలుగజేసుకునే సాహసం చేయలేక పోయేరు.

ఎండ దెబ్బ, అంతకుమించి అక్కడ వాతావరణం నన్ను నిలువునా కృంగ దీసేయి. నీరసం ఆవహించింది. స్పృహతప్పి కిందపడిపోతే... ఏ ఒక్కరైనా పరుగున వచ్చి లేవనెత్తుతారా?నెమ్మదిగా కారుని ఆశ్రయించేను. బహుశా నేను కదిలేవరకూ పందిట్లో గాలి ఆడి వుండదు.అమెరికా నుంచి ఆరేళ్ల తర్వాత వచ్చేను. ఊరు మారింది. మనుషులు మారలేదు.్‌్‌్‌ఒక గంట తర్వాత -పెళ్లికొడుకు గోపి పరుగున వచ్చేడు. వచ్చి నా చేతులు పట్టుకున్నాడు. ఉదయం పందిట్లో నాకు జరిగిన అవమానానికి సిగ్గుపడి, బాధపడి ఏడ్చేడు.‘‘నోర్ముయ్యిరా, నన్నెవరు తిట్టారు. అమ్మే కదా. దానికి సిద్ధపడే వచ్చేను’’ - నవ్వుతూ తమ్ముణ్ణి సముదాయించేను.అమెరికా నుంచి వచ్చిన నన్ను... ఉదయం నాలుగ్గంటలకే రిసీవ్‌ చేసుకుని... ఇదిగో ఈ స్టార్‌ హోటల్లో బంధించేసాడు గోపి.