దెయ్యం పట్టినట్టు కొమ్మల్ని ఇరబోసుకోని గాలికి ఊగిపోతా వుండాది యాపచెట్టు.చిలకముక్కు దీపం ప్రేమకత నెత్తుకునింది.‘‘ఆపాపు! ఏమే... దేశంమింద ఇన్ని సమస్యలుండగా నీకు ప్రేమకతే కావాల్సి వచ్చిందా?’’ అని కసురుకునింది గుడిసింటి దీపం.‘‘ఏమమ్మా! రైతులంటే ఎపడూ ఏడుపులు, పెడబొబ్బలేనా? వాళ్ళకు ప్రేమలుండవా? అపిమానాలుండవా?’’ అని మూతి తిప్పింది చిలకముక్కు దీపం.‘‘ఎందుకుండవు? వుంటాయి. పారే నీళ్ళల్లో శంఖాన్ని ముంచితే తీర్థమైతింది. ముడ్డి కడుక్కుంటే మైలపడితింది. మనసుని కదిలిస్తే దేన్నయినా కవిగట్టి కత చెయ్యొచ్చు. కాకపోతే పారే నీళ్ళల్లో శంఖాన్ని ముంచినట్టుండాలి’’ అని చెప్పింది పెద్దింటి దీపం.ఆ మాటతో నోరు మూసుకునింది గుడిసింటి దీపం.‘‘ఎగవింటిది పీలేరు తల్లి కత చెప్పింది గదా! ఆఏటి ఒడ్డున జరిగిన ప్రేమకత చెప్తాను మీకు’’ అని కతనెత్తుకునింది చిలకముక్కు దీపం.

కల్లేణమ్మ కాలేజీ పిలకాయలకి అన్నం వండిపెట్టేది.మగపిలకాయలతోపాటూ ఇద్దురు ముగ్గురు ఆడపిలకాయలు గూడా వచ్చి బోంచేసి పోతా వున్నేరు. వాళ్ళల్లో శ్యామలారెడ్డి గూడా వున్నింది.పెదబ్బతోపాటే కాలేజీలో సదవతా వున్నింది ఆయమ్మి.నన్నెలుపు, పెదపెద్ద చేపకళ్ళు, తలమింద నుంచి పిరుదుల మీదికి జలపాతం దూకినట్టు ఒత్తుగా, నల్లగా మోహన్ని కలిగించే కురులు సితార సినిమాలో బానుప్రియ మాదిరి వుండేది.దొంగచూపులు చూస్తా పక్కకి నవ్విందంటే పగపట్టిన నాగుపాము కసిగా కాటేసినట్టు వుండేది.శ్యామలారెడ్డి అంటే పెదబ్బకి చాలా ఇష్టంగా వున్నింది.ఆడపిలకాయలు వస్తే పెదబ్బే దగ్గరుండి వడ్డించేవాడు. ఆమాట ఈమాట చెప్తా భలే కుశాలగా నవ్వించేవాడు.శ్యామలారెడ్డికైతే ఇంకా ఇష్టంగా, భలే ఇదిగా కొసరికొసరి వడ్డించేవాడు.ఆయమ్మి గూడా వద్దు వద్దంటానే, ముసిముసిగా నవ్వతానే, చూపులతో పెదబ్బని కొంచెంకొంచెం కొరుక్కుతింటానే, కోడి గెలికినట్టు గెలకతానే బోంచేసేది.చూపులు చూపులు కలిసినాయి.పెదబ్బమింద ఇష్టమున్నెట్టు తెలిసిపోతానే వుండాది.‘‘ఇపడెట్టా మనసు విప్పి మాట్లాడుకునేది? ఏం చెయ్యల్ల?’’ అని లైబ్రరీ మెట్ల మింద కూర్చోని తెగ ఆలోచించేవాడు.చలం రచనల్లోని ప్రేమతో కూడిన వాక్యాలు వుంటాయిగదా! దేవరకొండ బాలగంధారతిలక్‌ ‘అమృతం కురిసిన రాత్రి’ కవితా సంపుటిలో అందమైన కవితా పాదాలుంటాయి గదా! వాటిని దొంగిలించేసి పేపర్‌మింద అందంగా పేర్చి లెటర్‌ రాసినాడు.