‘నిరీక్షణ కూడా ఎంత మధురం!’ అన్నారెవరో?నిజంగా నిరీక్షణ మధురమేనా? ఎంతకాలం నిరీక్షించగలం..అటునుంచి స్పందన ఉండదని అనుకున్నాక కూడా నిరీక్షిస్తూ ఉండగలమా? స్పందన ఉండకపోతే నిరీక్షించి ఫలితమేమి?అయితే నా నిరీక్షణ నిష్ప్రయోజనమా? కాదు.. అవును.. అవును.. కాదు..!ఔనా? కాదా?ఎందుకు నిరీక్షిస్తున్నాను?ఎవరి కోసం నిరీక్షిస్తున్నాను?ఎంతకాలంగా నిరీక్షిస్తున్నాను?సతీష్‌.. అతని పేరు తలవగానే హృదయం ఉప్పొంగుతోంది. శరీరం మీది రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి.. అతని కోసం శరీరమంతా కళ్లై ఎదురు చూస్తోంది. కానీ అతను?తమ మధ్య పరిచయమే తమాషాగా జరిగింది.సతీష్‌ నేను పదో తరగతిలో క్లాస్‌మేట్స్‌మి. నేను అల్లరి ఎక్కువ. అబ్బాయిలకు నిక్‌నేమ్‌లు పెట్టేదాన్ని. చాలామంది అబ్బాయిలు నాతో మాట్లాడ్డానికే భయపడేవారు. అలాంటివారిలో సతీష్‌ కూడా ఒకడు. అలాంటి బుద్దావతారాలను నేను అస్సలు పట్టించుకునేదాన్ని కాదు.‘చిల్డ్రన్స్‌ డే’ ఇక వారం రోజులు ఉందనగా స్కూలు పిల్లలందరికీ ఆటల పోటీలు పెట్టారు. నేను వాగుడు కాయనే కానీ, ఆటల జోలికి పోయేదాన్ని కాదు. కిందపడి దెబ్బలు తగులుతాయని భయం. అయితే వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలు, పాటల పోటీల్లో ముందుండేదాన్ని. ఆ ఏడాది జరిగిన పోటీల్లో ఆటల్లో చాలా వాటిల్లో సతీష్‌కు బహుమతులు వచ్చాయి. పాటల పోటీలో కూడా సతీష్‌కు ఫస్ట్‌ ప్రైజ్‌ వచ్చింది. నాకు సెకండ్‌ ప్రైజ్‌.నాకు సంగీతం బాగా వచ్చని నమ్మకం ఎక్కువ. ఎక్కడ పాటల పోటీలు జరిగినా నేను పాల్గొనేదాన్ని. ఖచ్చితంగా నాకు ప్రథమ బహుమతి రావాల్సిందే. అయితే ఇప్పుడు ఈ బుద్దావతారం సతీష్‌కు రావడంతో నాకు ఆశ్చర్యం, బాధ, అసూయ కలిగాయి. 

దగ్గరకెళ్లి ‘‘కంగ్రాట్స్‌ సతీష్‌’’ అన్నాను.తను సిగ్గుపడుతూ ‘‘థ్యాంక్స్‌’’ అన్నాడు.‘‘ఇంత బాగా పాడేవాడివి మాటలు రానట్టు మౌనంగా ఉంటావే’’ అన్నాను.‘‘నువ్వు మాట్లాడుతున్నావుగా’’ అన్నాడు తలొంచుకునే.అమ్మో.. వీడు సామాన్యుడు కాదు అనుకున్నాను. ‘ఒరే సత్తిగా.. నీ పని తర్వాత చెప్తా’ అనుకుని ‘‘ప్రతి సంవత్సరం నాకే ఫస్ట్‌ ప్రైజ్‌ వచ్చేది’’ అన్నాను బుంగమూతి పెట్టి.‘‘కావాలంటే తీసేసుకో’’ అన్నాడు మెల్లగా తలెత్తి నవ్వుతూ.‘‘నాకేం నీ దయ అఖ్ఖర్లేదు. ఈసారి పోటీలో తప్పకుండా నాకే ఫస్ట్‌ ప్రైజ్‌ వస్తుంది’’ అన్నాను.‘‘అలాగే.. నేను నీకే రావాలని ఆ భగవంతుని కోరుకుంటాను’’ అన్నాడు సతీష్‌.అప్పటినుంచీ మా మధ్య మాటలు పెరిగాయి. ఇద్దరికీ పాటల పిచ్చి. ఇద్దరం కలసి ఆదివారాలు, సాయంత్రాలు మ్యూజిక్‌ క్లాసులకు వెళ్లే వాళ్లం. పార్కుల్లో కూర్చుని సంగీత సాధన చేసే వాళ్లం. చదువులోనూ ఎప్పుడూ ముందుండే వాళ్లం.రోజులు గడుస్తున్నాయి. మా మధ్య చనువు బాగా పెరిగింది. ఒకరంటే ఒకరికి ఇష్టమూ పెరిగింది. ఎంతలా అంటే ఒక్కరోజు ఒక్కరిని చూడకపోయినా ఇంకొకరు ఉండలేకపోయేంతగా!