‘‘ఏరా! గుర్తుందిగా! రేపు మధుమతి వస్తోంది. పొద్దున్నే స్టేషన్‌కి వెళ్ళి తీసుకురావాలి.’’అమ్మ ఈ కమాండ్‌ని గత వారంగా, కనీసం వందసార్లు చెప్పి ఉంటుంది. పదేళ్ళకు పైగా కంప్యూటర్‌ ప్రోగ్రామరుగా పనిచేస్తున్నాను.కొన్ని వేల కమాండ్స్‌ వ్రాసి ఉంటాను. ఈ చిన్నది గుర్తుండదా? ఉంటుందని ఆమెకూ తెలుసు. కానీ నేను ఆ పని చెయ్యనేమో అని అనుమానం. ఓ అభద్రతా భావం...అలా ఆమె అనుకోవడానికి కారణం ఉంది. నా ప్రవర్తన.దాదాపు గత మూడు నెలలుగా ఒక్కసారి కూడా నేను నా భార్య మధుమతితో మాట్లాడలేదు.

కొన్నేళ్ళ మా పరిచయంలో మొట్టమొదటిసారి ఇలా మాట్లాకపోవడం... మరి అమ్మ అలా భయపడక ఏమిచేస్తుంది.‘‘ఏంట్రా ఆ మౌనం... సర్లే ముందు చమన్‌లాల్‌ షాపుకెళ్ళి ఆ గొలుసు తీసుకురా. పిల్లకి బార సాల రోజే పెట్టాల్సింది. అతను ఆ రోజుకి చేసి ఇవ్వకపోవడంతో కుదరలేదు. కనీసం రేపన్నా పెట్టాలి. లేకపోతే బాగుండదు.’’అవును రెండు నెలల క్రితం బాలసారె రోజు, మా అత్తగారు అమ్మతో ‘‘ఏంటండీ వదినగారు. కేవలం బట్టలే తీసుకొచ్చారు. రెండో పిల్లనీ అందునా మరల ఆడపిల్లనా ఈ చిన్నచూపు’’ అని అడిగేసింది కూడా.‘‘చా..చా అలాంటి ఆలోచన ఏమీలేదు. నిజంగానే అన్న టైముకి చమన్‌లాల్‌ ఇవ్వలేదు. 

పనివాళ్ళు ఏదో సమ్మె చేస్తున్నారట. బయట షాపులో రెడీమేడ్‌ కొందామంటే చమన్‌లాల్‌ నమ్మకస్తుడు. తరుగు, మేకింగ్‌ చార్జీలు చాలా తక్కువ తీసు కుంటాడు. కాస్త ఆలస్యమైనా పరవాలేదులే. కోడలు పిల్లనెత్తుకుని మా ఇంటికి వచ్చినప్పుడు పెడదామని ఊరుకున్నాను’’అన్న అమ్మ మాటలకు ఆవిడ ఓ అనుమానపు చూపు సమాధానంగా ఇచ్చింది.‘‘అమ్మా... ఆ తూకాలు అవన్నీ నాకు తెలీదు. నువ్వే వెళ్ళి తీసుకురావచ్చుగా’’‘‘వెళ్ళొచ్చు. కానీ నాకు పని తెమలడం లేదు. నాలుగైదేళ్ళ తరువాత మరల పసిపిల్ల మనింట్లో పారాడబోతోంది. ఎలా సర్దుకోవాలో, ఏమి ఏర్పాట్లు చేయాలో తెలియటం లేదు. కాస్త కంగారుగా, తికమకగా ఉంది. అందుకని నువ్వే వెళ్ళి పట్టుకురా. అతను బిల్‌ వేసి ఇస్తాడులే. నిదానంగా చూసుకొని తేడా వస్తే మాట్లాడతా’’ అంది అమ్మ ఇల్లంతా కలియదిరిగేస్తూ.