హైదరాబాద్‌లో న్యూసైన్సు కాలేజీలో రెండవ యేడాది బి.యస్సీలో చేరాను. ఆ రోజు కాలేజీకి మొదటిసారిగా బయలుదేరుతూ వుంటే, ‘న్యూసెన్సు కాలేజీలో చేరావటగా’ అంటూ పలకరించింది ఎదుటి వాటా వాళ్ల అమ్మాయి శేషు.మేం వుంటున్న లోగిట్లో ఇంటి వాళ్లతో కలిపి నాలుగు వాటాలున్నాయి. అన్నీ బ్రాహ్మణ కుటుంబాలే ఆ వాటాల్లో. బ్రాహ్మణులు కాని వాళ్లకు అద్దెకిచ్చేవారు కాదు.శేషు ఇంటర్మీడియెట్‌ రెండవ యేడాది చదువుతోంది. ఆ అమ్మాయి వేళాకోళానికి వళ్లు మండిపోయింది. వెంటనే ఘాటుగా జవాబిద్దామని నోరు తెరవబోయాను.‘ఆల్‌ద బెస్ట్‌’ అంటూ నవ్వింది.నన్ను నేను సంభాళించుకున్నాను. సిటీ వాళ్ళ హాస్యాలు ఇలా వుంటాయన్నమాట! పుట్టినప్పటినుంచీ కాకినాడ టౌన్‌లో పెరిగాను. అక్కకి ఈ వూళ్లో ఉద్యోగం రావడంతో బతకడం కోసం కుటుంబంతో సహా హైదరాబాద్‌ వచ్చాం. ఇంకా ఈ సిటీ వాతావరణానికి అలవాటు పడాలి అని నిశ్చయించుకున్నాను.‘థాంక్స్‌’ చెప్పి ముందుకు సాగాను.కాలేజీకి వెళ్లే కొత్తలో నన్ను ఎక్కువమంది అడిగిన ప్రశ్న ‘మీ నాయన ఏం జేస్తడు?’ అనినాకు వళ్ళు మండిపోయేది ఆ ప్రశ్న వింటే.ఒకరోజు కాలేజీ ఆఫీసు గుమాస్తా అదే ప్రశ్న అడిగాడు.

‘అలా గౌరవం లేకుండా అడుగుతారేమిటీ?‘మీ నాన్నగారు’ అని అనాలి. అయినా ఆయన ఎవర్నీ ఏమీ చెయ్యరు’ అని కోపంగా జవాబిచ్చాను.‘ఈ సిటీలో మేం గిట్లనే మాట్టాడతాం’ అన్నాడు ఆ గుమాస్తా.మాట్టాడకుండా వెళ్లిపోయాను అక్కడనుంచీ.అదే రోజు మా క్లాస్‌మేట్‌ యాదగిరి అడిగాడు.‘ఏంది భాయ్‌! మీ నాయన ఏం జేస్తడు?’మీద పడి కరిచినంత పనిచేశాను.‘మా నాన్నగారు నీకేమన్నా మేనమామా, అంత గౌరవం లేకుండా మాట్లాడుతున్నావు? సరిగా మర్యాదగా మాట్లాడరాదూ? బుద్ది లేదూ?’ అని తూర్పు గోదావరి జిల్లా భాషలో తిట్టాను.‘గట్లంటవేంది భాయ్‌! వూర్కే పరేషాన్‌ అవతవెందుకు? ఈ వూళ్లో బాస గిట్లనే వుంటది గద! నీ ఆంధ్ర బాస నాకు తెల్వదు బే!’ అన్నాడు.అక్కడే కాస్పేపుంటే ఏ రాయో తీసుకుని వాడి మొహం బద్దలు కొడతానని భయం వేసి, అక్కడ నుంచీ వెళ్ళిపోయాను.నా అసలు బాధ వీళ్ల భాష కాదు.