ఆకాశంలో మబ్బులు దట్టంగా వ్యాపించాయి. వాతావరణం చలిచలిగా ఉంది. అప్పుడప్పుడు చిరుజల్లులు పడి ఆగిపోతున్నాయి. రోడ్లు బురదగా ఉన్నాయి. రోడ్లు గుంతలు పడ్డం మూలంగా వాన నీళ్ళు కొన్ని గుంతల్లో నిలిచిఉన్నాయి.మురళి చాలా జాగ్రత్తగా అడుగు లేసుకుంటూ నడుస్తున్నాడు పుష్కరాలకుముస్తాబైన కర్నూలు పట్టణంలో...ఇంతలో...సర్రున ఓ ఖరీదైన కారు అతని ప్రక్కనుండి దూసుకుపోయింది. ఆ కారు టైరు ఓ బురద గుంతలో దిగపడినట్లుంది. బురద నీళ్ళు ఫౌంటెన్‌లాగా మురళీ మీదకు చిమ్మబడ్డాయి.మురళికి కూడా కోపం వచ్చింది. వంగి రోడ్డు మీద వున్న ఓ గులకరాయిని తీసుకుని బలంగా పోతున్న కారుకేసి విసిరాడు. అతని దురదృష్టం, కారు ముందు ట్రాఫిక్‌ వచ్చి ఆగినట్లుంది - రాయి కారు వెనక అద్దానికి తగిలింది. బళ్ళున అద్దం పగిలిపోయింది.డ్రైవర్‌ కారు తలుపు తీసుకుని వెనక్కి తిరిగి యితని వైపు వేగంగా రాసాగాడు.మురళి మెదడు మొద్దుబారింది. ఇంతలో అతను వచ్చేశాడు.‘‘ఇడియట్‌! కారు అద్దాన్ని పగలగొడతావా? ఎన్ని గుండెలు?’’ డ్రైవర్‌ కోపంగా హుంకరించాడు.‘‘నా మీద బురద జల్లడానికి నీకెన్ని గుండెలు?’’ మురళి బింకంగా అన్నాడు.‘‘కావాలని జల్లానా! రోడ్డు మీద చూసుకుని నడవాలి! అప్పటికీ హారన్‌ కొడుతూనే ఉన్నాను - ప్రక్కకి తప్పుకోవాలి!’’‘‘తప్పుకునేలోపు - నువ్వు ఓవర్‌ స్పీడ్‌ మీద కారు తోలావు!’’‘‘అవన్నీ ఎందుకు! ఇప్పుడు కారు అద్దం ఖరీదు కట్టు-’’‘‘కట్టకపోతే-’’‘‘నిన్ను పోలీసులకు పట్టివ్వాల్సి వస్తుంది!’’‘‘ఐసీ! నా దగ్గర డబ్బు లేదు - ఏం చేసుకుంటావో చేసుకో పో!’’ నిర్లక్ష్యంగా అన్నాడు మురళి.

అప్పటికే పోలీసు కానిస్టేబుల్‌ ఆకారు దగ్గర చేరి విజిలేస్తూ ఉన్నాడు - ట్రాఫిక్‌ ఆగిపోయింది. ఆ కారు ముందు డోరులోంచి ఓ మెరుపుతీగ కిందకు దిగింది. ఒయ్యారంగా నడుచుకుంటూ గొడవ జరుగుతున్న ప్రదేశానికి వచ్చింది.‘‘వాట్‌! జానీ! వాట్‌ ఈజ్‌ రాంగ్‌!’’ చలువ కళ్ళద్దాలలోంచి అటుయిటూ చూస్తూ అడిగింది.‘‘ఇతగాడు డబ్బుల్లేవు - ఏం చేసుకుంటావో చేసుకోమంటున్నాడు’’ డ్రైవర్‌‘‘అది కాదు మేడం! మీ డ్రైవర్‌ది తప్పుంది. చూడండి - నా డ్రస్సంతా ఎలా పాడై పోయిందో!’’ మురళి చెప్పాడు.ఆ కుందనపు బొమ్మ నిర్లక్ష్యంగా అతన్ని ఆపాదమస్తకం ఓ సెకనులో చూసింది. తల ఎగిరేసింది. కను బొమ్మలు ఎగరేసింది.ఇంతలో పోలీసు కూడా వచ్చాడు.‘‘పదండి పోలీసు స్టేషన్‌కు - ముందు కారును సైడులో పెట్టు-’’ గద్దించాడు.‘‘చూడు పోలీసు - నా డ్రస్సు పాడు చేసాడు. ఇతనిపైన న్యూసెన్సు కేసు బుక్‌ చెయ్యి -’’ మురళి పోలీసుతో అన్నాడు.‘‘నో - ఇతను నా కారు అద్దం పగులగొట్టాడు - క్రిమినల్‌ కేసు బుక్‌ చెయ్యాలి -’’ డ్రైవర్‌ వాదించాడు.