‘రేపటినుంచి నాకూ అతనికీ ఎలాంటి సంబంధమూ ఉండదు’ అనుకుంది స్వాతి. అలా ఆ రోజు అనుకోవడం ఏ వెయ్యోసారో!పెద్ద పెద్ద కళ్లు. కొనదేలిన ముక్కు. ముక్కుచివర మెరుస్తున్న బంగారం ముక్కెర. మన్మధుడి చేతి విల్లులా వంపు తిరిగిన పెదాలు. గులాబీ రంగు పెదాలకు లిప్‌బామ్‌ పూసినట్టుంది. సూర్య కిరణాలు పడి తళతళలాడుతున్నాయి. శరీరం బంగారం రంగులో ఉంది. ఎక్కడికక్కడ వంపుసొంపులన్నీ తీర్చిదిద్దినట్టున్నాయి. గొప్ప శిల్పి చేతిలో ప్రాణం పోసుకున్నట్టు ఉంది స్వాతి. అందానికి తగినట్టుగా నీలిరంగు పైన ఎంబ్రాయిడరీ వర్క్‌ చేసిన చుడీదార్‌ వేసుకుంది. స్వాతి చెట్టు మొదలుకు ఆనుకుని కూర్చుని ఉంది. ఆమె ముంగురులు గాలికి కదులుతున్నాయి.చుట్టూ పచ్చదనం. పక్షుల కిచకిచలు వినిపిస్తున్నాయి. దూరంగా దుముకుతున్న జలపాతం చప్పుడు, గాలివాటుకు అప్పడప్పుడూ వినిపిస్తోంది. చల్లటిగాలి వాతావరణాన్ని ఆహ్లాద పరుస్తోంది.అది సిద్ధేశ్వరుడు కొలువున్న తలకోన అడవి. ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఓ చెట్టుకింద కూర్చుని ఉంది స్వాతి. సాయంత్రం నాలుగు గంటలు కావస్తోంది. నీరెండ చెట్ల ఆకుల మధ్యలోంచి ఆమె మీద పడుతోంది.ఆహ్లాదకరమైన వాతావరణంలో సైతం అందమైన ఆమె ముఖం కళ తప్పి వెలవెల పోతోంది.

దుష్యంతుడి కోసం నిరీక్షించే శకుంతలలా ఉన్న ఆమెను మరో పొదరింటి చాటునుంచి రెండు కళ్లు తీక్షణంగా చూస్తున్నాయి.నీరు లేక వాడిపోయిన గులాబీ పూవులా ఉంది స్వాతి ముఖం. ఆమెలో ఏనాటివో జ్ఞాపకాల శకలాలు కదులుతున్నాయి. ఆవి ఆమె ముఖంలో ప్రతిఫలిస్తున్నాయి.సరిగ్గా ఐదేళ్లయింది. అవును. ఐదేళ్ల క్రితం ఇదే రోజు.. ఇదే చెట్టు కింద తను, అతను ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఆ రోజు ఆదివారం. తను స్నేహితురాళ్లతో కలసి వచ్చింది. తమలాగే శిరి కూడా స్నేహితులతో తలకోనకు వచ్చాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ తలకోన అడవి అందాలను జుర్రుకున్నారు. పచ్చదనం వొడిలో పిట్టల్లా ఎగిరారు. జలపాతం వద్ద పిల్లల్లా కేరింతలు కొట్టారు. సాయం సంధ్యవెలుగు తొలగుతున్న వేళ, ఇదే చెట్టుకింద కూర్చున్నారు. తన కెదురుగా ఉన్న శిరి ‘ఐ లవ్‌యు’ అన్నాడు. అన్నానని అనుకున్నాడు. కానీ అనలేదు. స్వాతి కూడా అదే స్థితిలో ఉంది.