నేను ఇంట్లోకి అడుగు పెట్టానా .... అప్పటికేనిర్ణయాలన్నీ జరిగిపోయినట్టున్నాయని నాకనిపించింది - అంతకుముందు అక్కడేదో యుద్ధం జరిగిందనిమా బావమరిది కూడా అక్కడే ఉన్నాడు. (నా అనుమానమే అది) అతడి మొహంలో ఏదో సాధించిన తృప్తి. మా సుధ మాత్రం ఆందోళనగా ఉంది. నా చిన్నకూతురు శృతి రాజులకు చిక్కిన సైనికుడిలా ఉంది. గోడను ఆనుకుని భయం భయంగా ముడుచుకుని కూర్చుంది.నన్ను చూసి వాతావరణం మరింత గంభీరంగా మారింది. ఏంజరిగిందని నేను అడగలేదు. ముగ్గురు నా వైపు విచిత్రంగా చూసారు. నాకు అడగాలనిపించలేదు. మౌనంగా ఇంట్లోకినడిచాను. మొదట్లో ఎవరి మొహంలో ఆందోళన కనిపించినా గాబరా పడేవాన్ని. ఏమిటని అడిగేవాన్ని. వారు చెప్పింది నాకుసమస్యలా అనిపించేదే కాదు.‘ఇంతేనా...;’ అనేవాన్ని.‘లోకం పోకడ తెలియదు’ అనే వారు.‘ఆగం గాకుండా ఆలోచించాలి’ అనే వాన్ని.‘బాధ్యత లేని మనిషి’ అనేవారు. మాట పడలేక గాబరా పడ్డట్టుగా నటించే వాన్ని.‘మాటలు... మాటలు కాదు. చేతలు కావాలి’ అనేవారు. అలా స్పందించడమే మానేసాను. ఇప్పుడు ‘ఏనుగు మీది వాన’ అంటున్నారు.నా మౌనం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థమైనట్టుంది. శృతి తల దించుకుంది. మా బావ మరిది కోపంగా తల ఎగరేసాడు. సుధ మాత్రం తన బాధను నాతో పంచుకోవాలని ‘బయటకు వెళ్తే తలకొట్టేసినట్టుంది. 

ఎవరికి ఏమని చెప్పను’ అన్నది బాధగా.నేను ఎప్పుడూ వినే మాటలే! ఈ మధ్య ఎక్కువగా వింటున్నాను.మొన్న ‘ఫ్లాట్‌ మోడల్‌ టీవీ బాగుంది. పాతది మార్చేద్దాం’ అంది.‘ఫరవాలేదు నడుస్తుందిగా’ అన్నాను. కోపంతో ఈ మాట అనేసింది. సాయంత్రం గోడకు టీవిని మా బావమరిది ఇనాగ్రేట్‌ చేసాడు. ప్రిజ్‌, సోఫా విషయంలో ఇలాగే జరిగింది.నేను మౌనంగా వారిని దాటుకుంటూ గదిలోకి వెళ్లాను. డ్రెస్‌ విప్పి లుంగీ కట్టుకున్నాను. మా బావమరిది కోపంగా ఒకసారి నా వైపు చూసి ‘అక్కా... నేను వెళ్తున్నాను. ఏ విషయం నాకు కాల్‌ చేసి చెప్పు. ఒకటి మాత్రం గుర్తుంచుకో... చెయ్యి దాటిపోయాక బాధపడితే లాభం లేదు. కొన్ని నిర్ణయాలు నువ్వు మాత్రమే తీసుకోవాలి’ ఒత్తి పలుకుతూ వెళ్లిపోయాడు.ఆ నిర్ణయమేదో తెలియకపోయినా ఏదో కొంపమీదికి తెచ్చాడని మాత్రం గ్రహించాను. నా జీవితం మీద నాకంటే వాడికే అధికారం ఎక్కువ. ఈ విషయం నాకు తెలియడానికి చాలా రోజులే పట్టింది. అప్పటికి నేను ఎదురు చెప్పలేని స్థితికి వచ్చాను.ఏడాది కింద వీడు సరిగ్గా నన్ను ఇలాగే చూసాడు. సుధతో ఇలాగే అన్నాడు.‘వీడి మొహం... నన్నుకాదని తీసుకునే నిర్ణయాలేంటే’ అనుకున్నాను. కానీ నిజంగానే జరిగి పోయాయి. మా మకాం సిరిసిల్లకు మారిపోయింది. శృతి ప్రైవేట్‌ స్కూల్లో చేరిపోయింది. పెద్దది కార్పొరేట్‌ కాలేజి. క్యాట్‌ కార్డ్‌ నా చేతికి వచ్చింది. ఏడు కిలోమీటర్ల ప్రయాణం డెబ్బయి కిలోమీటర్లయింది.