‘‘ప్రణీత నుంచి ఆ రోజు వచ్చిన అరవయ్యో కాల్‌’’ అది. స్వాప్నిక్‌లో అసహనం లక్ష రెట్లు పెరిగింది. సెల్‌ఫోన్‌లో కాల్‌ ట్యూన్‌ ఆగకుండా మోగుతూనే ఉంది.ప్రణీత నుంచొస్తున్న ఈ ఫోన్‌ డిస్ట్రబెన్స్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టడమెలా?.... ఒక్క క్షణం కళ్లు మూసుకొని ఆలోచించాడు.స్వాప్నిక్‌ ఓ ప్రముఖ రచయిత.ప్రణీత ‘సాహితీ సురభి’ సమావేశాల్లో హాజరయ్యే ఓ సాహిత్యాభిమాని. నెలకొకసారి జరిగే సమావేశాల్లో స్వాప్నిక్‌ని ఆమె చూడడం, ఆమెని స్వాప్నిక్‌ చూడడం తప్పితే అంతకు మించిన పరిచయం వాళ్లిద్దరి మధ్యన లేనే లేదు. కనీసం ఎదురెదురుగా నించొని ఒక నిమిషం పాటు మాట్లాడుకొన్న సందర్భాలు కూడా లేవు.ఏ పరిచయమూ లేకుండానే....ఏ అవసరమూ రాకుండానే ఆమెనుంచి ఫోన్‌ కాల్స్‌ వెల్లువెత్తడం, అదీ రోజుకు దాదాపుగా వందసార్లు, అలా ప్రతీరోజూ! దాంతో స్వాప్నిక్‌ కూడా ఇబ్బందవుతోంది. ఆఫీసులో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఫ్రెండ్స్‌తో పిల్లలతో ఉన్నా....భార్యతో ఉన్నా...మరే పనిలో ఉన్నా... ఈ ఫోన్‌కాల్స్‌ దాడి ఆగడం లేదు.స్వాప్నిక్‌ మస్తిష్కంలో తళుక్కున ఓ ఆలోచన మెరిసింది. ఇక ఆలస్యం చేయకుండా ఎల్‌ బటన్‌ ప్రెస్‌ చేసి, ‘‘హలో....’’ అన్నాడు.‘‘అబ్బా..ఎంత సేపండి బాబూ, ఫోన్‌ ఎత్తడాన్కి....’’ ప్రణీత మాట్లాడుతోంది.ఆ గొంతు వినగానే స్వాప్నిక్‌ కి చిరాకు మరింత పెరిగింది. అయినా తమాయించుకొని, ‘‘ఇప్పుడే కదా! ప్రణీత మాట్లాడావు. 

మాట్లాడి పది నిమిషాలు కూఆ గడవనే లేదు. ఇక మేం పనులు చేసుకోవడం పూర్తిగా మానేయాలా? మీ ఫోన్‌లు రిసీవ్‌ చేసుకోవడం మాత్రమే మా డ్యూటీ అంటారా?’’ కొంచెం ధైర్యం చేసుకొనే అడిగాడు.‘‘గొప్ప రైటర్‌ అని గర్వపడిపోతున్నారా? కొంచెం సేపు మాట్లాడడానికే అంత ఫోజా?’’స్వాప్నిక్‌లో అసహనం పెల్లుబికింది. అయినా బలవంతంగా అణచేసుకొని, ‘‘అదేం కాదు. నిన్నొక విషయం డైరెక్ట్‌గా అడగొచ్చా...’’ నెమ్మదిగా అడిగాడు.‘‘ఎందుకా డౌటు? నిక్షేపంగా అడగొచ్చు...’’‘‘నేను మాటల మనిషిని కాదు. చేతల మనిషిని....’’‘‘అయితే..’’‘‘నేనడిగిన దానికేం ఫీలవ్వవు కదా?’’‘‘నువ్వడిగితే కానే కాను...’’‘‘నీతో ఒక రాత్రి గడపాలనుంది....’’‘‘క్లియర్‌గా చెప్పు....’’స్వాప్నిక్‌కి భయమేసింది. అయినా ధైర్యం తెచ్చుకొని ‘‘నువ్వు నాతో ఎంజాయ్‌ చెయ్యాలి....’’ చెప్పేశాడు.‘‘నువ్వేనా మాట్లాడుతున్నది స్వాప్నిక్‌?’’‘‘..................’’ఫోన్‌ కట్‌ అయింది....‘‘ఈ దెబ్బతో ఇంకెప్పుడూ ఫోన్‌ చెయ్యదు. పీడ విరగడయ్యింది.’’ మనసులో సంతోషించాడు స్వాప్నిక్‌. పగలు పన్నెండు గంటల్లో సగభాగం ఫోన్లు అటెండవ్వడానికే సరిపోతుంది. ఆ ఆరుగంటల్లో ఐదు గంటలు ప్రణీత ఫోన్లతోనే గడిచిపోతుంది. ఈ పని చేసినందుకే కంపెనీ తనకి వేలాది రూపాయల జీతమిస్తోందా?స్వాప్నిక్‌ అంతరంగంలో మెదిలిన సందేహం!నిజాయితీగా పన్జేసే తనకిలాంటి సమస్య రానే రాకూడదు. పెర్‌ఫెక్ట్‌గా ప్లాన్‌ చేస్కోని వస్తే..ప్లాన్‌ చేసిన పనులన్నీ పోస్ట్‌పోన్‌ అయిపోవడం, ఇన్‌ కంప్లీట్‌గా మిగిలిపోవడం స్వాప్నిక్‌ సర్వీస్‌లో ఈ మధ్య రిపీట్‌గా జరుగుతోంది. ‘బాస్‌’ ఉద్దేశం ఎలా ఉన్నా...స్వాప్నిక్‌కి మాత్రం సంతృప్తిగా లేనే లేదు. ఉద్యోగంలోనే కాదు, సద్యోగమైనా రచనా ప్రక్రియలోనూ ఇది రెగ్యులర్‌ ప్రాక్టీస్‌ అయ్యింది. ప్రణీతను ఒక్కరాత్రి డేటింగ్‌కి డేరింగ్‌గా ప్రపోజ్‌ చేసేసినా..స్వాప్నిక్‌లో ఏమూలో కొంచెం భయం మాత్రం లేకపోలేదు. తొంగి చూస్తూనే ఉంది...