‘‘ప్రోటోకాల్‌ అంటే ఏంటి డాడీ?’’సీరియస్‌గా పిల్లల పరీక్ష పేపర్లు దిద్దుతున్న సూరిబాబు ఉలిక్కిపడ్డాడు. ఆ పదం రెండు రోజుల క్రితం ఎవరి దగ్గరో విన్నాడు. అంతేకాదు కొన్ని సంవత్సరాలుగా ఆ పదం తనని వెంటాడుతోంది.‘‘డిక్షనరీలో చూడు’’ అన్నాడు పేపర్లోంచి తలెత్తకుండానే.‘‘చూసాను నాన్నా...సిస్టమ్‌ ఆఫ్‌ రూల్‌; గవర్నింగ్‌ ఫార్మల్‌ అకేషన్స్‌ అని రాసారు’’ అన్నాడు కొడుకు.‘‘అంటే మర్యాద పాటించడం, రాజ ప్రతినిధులు, రాయబారులకు ప్రభుత్వం అందించే గౌరవ సత్కారం’’ అన్నాడు సూరిబాబు.ఇంకా కొడుకు ప్రశ్నార్థకంగా చూసాడు.‘‘అలాగే పెద్ద హోదా ఉన్న అధికారుల పట్ల కింది స్థాయి ఉద్యోగులు చూపే వినయ విధేయతలు ప్రోటోకాల్‌ క్రిందికి వస్తాయి’’అన్నాడు.‘‘అంటే మా స్కూల్‌ ప్రిన్సిపాల్‌ గారు కనపడగానే మా టీచర్లంతా సార్‌...సార్‌...సార్‌ అంటూ తలలు వంచుకుని వెళతారు అంతే కదా!!’’ అన్నాడు కొడుకు.‘‘ఔను. అదీ ప్రోటోకాల్‌ క్రిందే లెక్క’’ అన్నాడు సూరిబాబు నవ్వుతూ.‘‘అంతేకాదు. తాతయ్యగారు నించుంటే మీ నానమ్మ కూర్చోదు...అదీ ప్రోటోకాల్‌ క్రిందే లెక్క’’ అంది వంటింట్లోంచి సూరిబాబు భార్య.సూరిబాబు చిన్నగా నవ్వుకున్నాడు.

‘‘అర్థమైంది నాన్నా’’ అంటూ కొడుకు వెళ్ళిపోయాడు.సూరిబాబుకి మాత్రం ఆ పదం గురించి ఎప్పుడూ కన్‌ఫ్యూజన్‌.ఇంతకీ ఆ పదం ఎవరి దగ్గర విన్నాడు ఇంతకు ముందు?!. ఆలోచనలో పడ్డాడు. ప్రోటోకాల్‌ అనే పదం తనకి కొత్తకాదు. ఆ పదం వింటే ఒంట్లో ఒక గగుర్పాటు. పరీక్ష పేపర్లు మరి దిద్దలేకపోయాడు. అతనికి రాంపండు గుర్తొచ్చాడు. ఔను. రాంపండు తన క్లాస్‌మేట్‌, ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకూ. వాడు రెండు రోజుల క్రితం ఫోన్‌ చేసాడు.‘‘ఒరేయ్‌ సూరిబాబూ. మా పని శ్లేష్మంలో పడ్డ ఈగలాగా అయిపోయింది’’ అన్నాడు.‘‘అసలేం జరిగింది’’ అన్నాడు తను.‘‘నీకు తెలుసు కదా లక్ష్మీపతి. మన సహచరుడు పదో తరగతి వరకూ, వాడు మా బాస్‌ అయిపోయాడు’’ అన్నాడు.‘‘అదెలా?’’ అన్నాడు తను ఆశ్చర్యంలోంచి తేరుకోకుండానే.‘‘ఇరవై యేళ్ళ క్రితం నేను మా కంపెనీలో గుమస్తాగా జాయినయ్యి ఇప్పటికి ఆఫీసరు కాగలిగాను. ఆ వ్యక్తి డైరెక్ట్‌ రిక్రూట్‌ అధికారిగా చేరి ఉత్తర భారతదేశంలోనూ, మా ఆఫీసులున్న యుకెలోనూ వివిధ హోదాలలో పనిచేసి ఇక్కడి మా జోనల్‌ ఆఫీసుకు జోనల్‌ మేనేజరుగా వచ్చేసాడు. కె.ఎల్‌.పతి అంటే ఎవరో అనుకున్నాను. వాడు మన కందుల లక్ష్మీపతి. ఇరగదీస్తున్నాడు. రూల్స్‌ దాటితే ఒప్పుకోడు’’ అన్నాడు రాంపండు బాధగా.