మీరు అయిదు రూపాయలు ఆయనకిచ్చేయండి. సరిపోతుంది’’ అని కండక్టర్‌ ఆమెతో అన్నపడు చైతన్య చూశాడామెను.పాతికేళ్ళుంటాయి. అందమైన ముఖం. కానీ ఏదో ఉదాసీనత... అప్పటికే ఆమె బస్సు దిగేసింది. తనూ వెనకాలే దిగాడు.ఆమె చైతన్య వంక తిరిగి ‘‘తొంభయి అయిదివ్వండి..’’ అంది వంద నోటు ఇవ్వబోతూ.‘‘చిల్లర లేదండి’’ అన్నాడు తటపటాయిస్తూ.‘‘మరెలా? విడి అయిదు రూపాయలు నా దగ్గరా లేవే?’’ అందామె.‘‘పోనివ్వండి..’’ అన్నాడు చైతన్య.‘‘మరి మీ అయిదు రూపాయలు...?’’‘‘పోనివ్వండి...’’‘‘ఎలా పోనివ్వమంటారు? అయిదు రూపాయలు వదులుకునే ఉదార మనస్తత్వం మీకున్నా మీ డబ్బులు తీసుకునే ఉద్దేశం నాకు లేదు’’ అందామె.‘‘నా అడ్రసిస్తాను. మనీ ఆర్డర్‌ చెయ్యండి’’ అన్నాడు.‘‘మరి ఎం.ఓ. చేరకపోతే?’’ అడిగింది.‘‘ఏవండి.. మీ పేరేంటో తెలీదుగానీ...’’‘‘సంధ్య..’’‘‘సంధ్యగారూ... ఇంత చిన్న విషయానికి అంత టెన్షన్‌పడటమెందుకు? మీరేమీ అనుకోకుండా నేను చెప్పిన ఓ పని చేస్తే మీరు నా అప తీర్చేసినట్టే...’’ అన్నాడు చైతన్య. ఏమిటన్నట్టు చూసిందామె.‘‘ఉదాసీనత మీ ముఖానికి నప్పదు. అలాగని చిరునవ్వు నవ్వమని అడగను. ప్రశాంతంగా వుండటానికి ప్రయత్నించండి’’ అనేసి వడివడిగా అడుగులు వేస్తూ వెళ్లిపోయిన చైతన్య వైపు చూస్తూ ఉండిపోయింది సంధ్య. ‘‘ఏం చెయ్యాలనుకుంటున్నావ్‌? ఐ మీన్‌ ఏదయినా జాబ్‌?’’ సంధ్య తల్లి చేతిలోంచి కాఫీ కపనందుకుంటూ సంధ్య నడిగింది స్నేహితురాలు అరుణ. కాసేపు ముగ్గురి మధ్య నిశ్శబ్దం...

‘‘కొన్నాళ్లు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. నాకు మనశ్శాంతి కావాలి...’’ అంది సంధ్య. రాత్రి రెండు గంటలగ్గానీ నిద్ర పట్టలేదామెకి. మానసిక స్థితికి ముఖం అద్దం పడుతుంది. నిన్న సాయంత్రం అతనెవరోగానీ నిజమే చెప్పాడు. తనకు ప్రశాంతత కావాలి. తన ముఖానికి ఉదాసీనత నప్పదా? మరి తనకు మిగిలింది అదేకదా!‘‘అమ్మాయికి ఇలా జరుగుతుందని అనుకోలేదు’’ సంధ్య తల్లికి ఏడుపాగడం లేదు. కన్నీళ్ళు ఉబుకుతుండగా అరుణ వైపు నుంచి తల పక్కకు తిపకుంది సంధ్య. ఆమె కళ్ళల్లో ఎరుపు జీరలు. ఉద్వేగం పట్టలేక ముక్కుపుటాలదురుతున్నాయి.స్నేహితురాలి బేలతనాన్ని భరించలేక చపన లేచి చెమ్మగిల్లిన కళ్లతో సంధ్యని ఓదార్చ ప్రయత్నించింది అరుణ.‘‘తను చాలా సెన్సిటివ్‌ ఆంటీ... దేనికీ తట్టుకోలేదు. మీరే ధైర్యం చెప్పాలి’’ అంది అరుణ. సంధ్య తల్లికి ఇంకా చాలా చెప్పాలనుకుంది అరుణ. ముక్కూ మొఖం తెలియని ఆ అమెరికా సంబంధమెందుకు చేశారు? అబ్బాయి డాక్టరయి డాలర్లు సంపాదిస్తే సరిపోతుందా? అసలతనెలాంటి వ్యక్తో పరస్పర అభిరుచులు, అభిప్రాయాలు సరిపోతాయో లేదో తెలుసుకోనక్కర్లేదా? ఇలా...కానీ సంధ్య మాజీ భర్త డాక్టర్‌ శ్రీధర్‌ గురించి సమాజానికి కొంతవరకే తెలుసు.. అది అతను ప్రతిరోజూ సంధ్యని ఒళ్లు హూనమయ్యేలా కొడతాడని, మాటల్తో హింసిస్తాడని. శారీరక రుగ్మతలకు చికిత్స చెయ్యడంలో అక్కడి సమాజంలో ఎంతో పేరున్న అతనికి మానసిక చికిత్స చెయ్యవలసిన అవసరముందని ఎంతమందికి తెలుసు, సంధ్యకు తప్ప! భర్త అనబడే ఆ మృగం బారినుండి ఆమె ప్రాణాలతో బతికి బయటపడ్డమే ఓ అద్భుతం!