దూరంగా,ఏడు తలల మహాసర్పం కొండలు కొండలుగా చుట్టలు చుట్టుకోని నిద్దరపోతా వుండాది. నెత్తిన చుక్కల కిరీటాన్ని పెట్టుకునింది.చుక్కలు మిలమిలా మెరస్తా వుండాయి.ఆరంజ్యోతి చుక్క ఎద్దుపేగుల్ని దండెంమీద ఆరేస్తా వుంటే, తలకోన మూలన బాపనోడు మిణుకు మిణుకుమంటా ఆరంజోతిని తొంగితొంగి చూస్తా వుండాడు.‘‘ఎద్దుపేగులు ఆరేసుకునే ఆరంజోతిమింద ఈ బాపనోడికి ఎందుకు మనసైనట్టో?’’ అని అడిగింది పొరుగింటి దీపం.‘‘ఎందుకంటే ఏం చెప్పేది? పువ్వు మింద తుమ్మెదెందుకు వాలుతుంది? ఇదీ అంతే! నేనేమో అంటరానిదాన్ని. నువ్వేమో జంధెమేసుకున్న బాపనోడివి. నీకు నాకు మనువెట్టా కుదురుతుంది? అంటా ఎద్దుపేగుల్ని దండెం మీద ఆరేసుకుంటా వుండాది చూడు ఆరంజోతి’’ అని చూపించింది ఇరుగింటి దీపం.

దీపాలు తలెత్తి ఆకాశంలోకి చూసినాయి.‘‘దానికి బాపనోడు ఏమన్నాడో తెలుసునా? నువ్వు ఆరేసేది ఎద్దు పేగుల్ని కాదు. నేను వొంటిమింద ఏసుకునే జంధెం పోగుల్ని అని అంటా మిణుకు మిణుకుమంటా వుండాడు’’ అని చెప్పింది ఇరుగింటి దీపం.ఆ మాటకి దీపాలన్నీ పకపకా నవ్వినాయి.‘‘బాపనాయన పొయ్యి ఆరంజోతిని పెళ్ళి చేసుకోవడమేమిటి? ఇచ్చిత్తరం కాకపోతే’’ అనింది గడ్డం మింద చేతిని పెట్టుకోని ఎగవింటి దీపం.‘‘లోకానికి ఇచ్చిత్తరం కాబట్టే పెళ్ళిలో పిల్లాపిలగోడికి ఆరంజోతిని చూపించేది. వాళ్ళిద్దరి మాదిరి అన్నోన్నెంగా బతకమని అయివోరు చెప్పేది’’ అనింది ఇరుగింటి దీపం.‘‘ఆరంజోతిని చూసినంత మాత్తరాన ఆలూ మొగులూ కీసులాడుకోకండా, గీసులాడుకోకండా వుంటారా? యాడన్నా’’ అనింది పొరుగింటి దీపం.‘‘ఆలూమొగుల కొట్లాట ఎంతసేపు? ఆరికకూడు వుడికినంతసేపే గదా! ఆలూమొగులు అనగానే నాకు ‘పూలరతంలో వచ్చిన పార్వతీ పరమేశ్వరుల కత’ గుర్తుకొస్తా వుండాది’’ అనింది ఇరుగింటి దీపం.‘‘ఎట్టెట్టా? పార్వతీపరమేశ్వరులు పూలరతమేసుకుని వచ్చేవాళ్ళా? ఎవరా ఆలూమొగులూ? ఏమా కత?’’ అని అడిగింది పొరుగింటి దీపం.‘‘ఇది గంజి కరువులో జరిగిన కత’’ అని కత చెప్పడం మొదలెట్టింది ఇరుగింటి దీపం.్‌ ్‌ ్‌వాళ్ళది సంతోపుకాడ వుండే మేళ్ళోళ్ళపల్లె.మొగుని పేరు మేళ్ళ సిద్దయ్య.పెళ్ళాం పేరు గోపిని నడిపక్క.వాళ్ళు ఎంత అన్నోన్నెంగా వుండేవాళ్ళంటే! ఆనోటా ఈనోటా కైలాసంలో వుండే పార్వతీపరమేశ్వరులకి గూడా వాళ్ళ గురించి తెలిసిపోయింది.