గ్రీష్మం! తీక్షణం అయిన ఎండకి భయపడి మా పల్లెలో మా యింటి ముందు వేపచెట్టు క్రింద పేపరుచదువుతుండగా పోస్ట్‌మాన్‌ వచ్చి ఒక ఉత్తరాన్ని యిచ్చి వెళ్లిపోయాడు. ఆత్రంగా అది ఎక్కడి నుంచి వచ్చిందో చూశాను. అది రవి నాకు రాసిన ఉత్తరం! తను ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న ఉత్తరం!ప్రియమైన అన్నయ్యకు,రవి నమస్కరించి వ్రాయునది. నువ్వు పంపిన డబ్బు మొన్ననే అందింది. నా చివరి సంవత్సరం పరీక్షలు నిన్నటితో పూర్తయ్యాయి. ఇంక నా చదువు అయిపోయినట్లే; నా చదువుపూర్తైన తరువాతే నీ దగ్గరకు రమ్మనీ యిదివరకు నువ్వు వ్రాయడం వల్ల యిన్నాళ్లూ మన ఊరు రాలేక పోయాను. నిజానికి నిన్ను చూడాలనీ, నీతో చాలా విషయాలు మాట్లాడాలనీ ఉన్నా నీ మాట కాదనలేక యిన్నాళ్లు ఆగాను. నా పరీక్షలు అయిపోయాయి కాబట్టి నేను రేపే బయలుదేరి మన ఊరు వస్తున్నాను. త్వరగా వచ్చి నీతో ఎన్నో మాట్లాడాలని ఉంది. ఎల్లుండి నువ్వు స్టేషన్‌కి రావలెను.తమ్ముడు ‘రవి’ఆ ఉత్తరం చదివిన నా హృదయం మూగబోయింది. ఈరోజు చాలా శుభదినం. రెండు సంవత్స రాల నుంచీ ఈరోజు కోసం చకోరపక్షిలా ఎదురు చూస్తున్నాను. రవి చదువు త్వరగా పూర్తవ్వాలనీ, ఈ రెండేళ్లు నేను మొక్కని దేవుడు లేడు.ఎందుకో ఈ ఉత్తరం చదవగానే నాకు మిత్రా గుర్తుకు వచ్చాడు. అమానుషంగా అతన్ని లాకప్‌లో మా వాళ్లు పెట్టిన చిత్రహింసలు గుర్తుకొచ్చాయి. 

మృత్యువుతో పోరాడి అతను హాస్పిటల్‌లో చనిపోయిన దృశ్యం మనసులో కదలాడింది. చివరగా అతను చనిపోయే ముందు నేను అతనికి యిచ్చిన మాట గుర్తుకొచ్చింది.నిజానికి నేను మిత్రాకు చాలా అన్యాయం చేశాను. దానికి నేను ఎవరికీ జవాబుదారీ కాక పోవచ్చు కానీ నా మనస్సాక్షికి నేను జవాబుదారీ.నాకు రెండేళ్ల క్రితం జరిగిన గతం గుర్తుకు రాసాగింది.్‌్‌్‌రెండేళ్ల క్రితం నేను చింతపల్లిలో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తుండేవాడిని. అప్పట్లో ఆ ప్రాంతంలో నక్సల్స్‌ ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. వాళ్లపై ప్రభుత్వం నిషేధం విధించడం వల్ల వాళ్ల కదలికల్ని మేము నిరంతరం గమనించవలసి వచ్చేది. ప్రభుత్వ యంత్రాంగం లోపాలవల్ల నైతేనేమీ, కొందరు అవి నీతిపరులైన ఉద్యోగుల వల్లనైతేనేమీ పేద గిరిజనులకు ప్రభుత్వ సాయం అందేది కాదు. దళారీలు వాళ్లను మోసం చేస్తుండే వారు. అందుకోసం అమాయకులైన గిరిజనులు నక్సల్స్‌ సహాయం తీసుకోవడం జరుగుతుండేది. కానీ అది చట్ట వ్యతిరేకం కాబట్టి గిరిజనులకీ, నక్సల్స్‌కీ మధ్య మా పోలీసు యంత్రాంగం నలిగిపోతుండేది.