మామిడి పిందేలించక్కున్నాయో...బాబోయ్‌ పద్ధేనిమిది మూళ్ల పొడుగున్నట్లుంది....మా అమ్మ ఇలాంటిది ఒక్కటీ పెట్టలేకపోయింది....ఎన్నాళ్ల నుంచో మనసుపడుతున్నా నీ రంగు కోసం, పాపం, చెప్పినట్టు తెచ్చిపెట్టారు.’్‌్‌్‌యాజులు నెల్లూరి జిల్లా కోర్టులో గుమాస్తాగా ఉండినప్పటి సంగతి.ఇక నెలా పదిహేనురోజులుందనగా, సంకురాత్రి పండుక్కి రాధమ్మని పుట్టింటివారు తీసుకెళ్లరని తేలిపోయింది.అప్పటికామె పద్ధెనిమిదేళ్ల పిల్ల. పండుగులనీ, పబ్బాలనీ, అచ్చట్లనీ, ముచ్చట్లనీ కిందా మీదా పడిపోతూ ఉండే వయస్సు.దగ్గిరగా ఉన్నంత కాలమూ పుట్టింటివారామెకి లాంఛనాలన్నీ బాగానే తీర్చేవారు. కానీ నెల్లూరికి, పిఠాపురానికీ రానూ పోనూ కూతురికీ, అల్లుడికీ కావలసిన రైలు ఖర్చుల మొత్తం తెలిసేటప్పటికి వారికి గుండెలాగిపోయాయి.ఇది ఆలోచించి చివరికి రాధమ్మ కూడా సరిపెట్టుకుంది.మొదట మాత్రం తండ్రి రాసిన ఉత్తరం చూసుకొని ఆమె నిర్ఘాంతపడిపోయింది.ఇది యాజులు గుర్తించాడు. అతని హృదయం దడదడ కొట్టుకుంది. కాని ఒక్క క్షణంలో తేరుకుని, ఆమె కళ్లల్లోకి జాలిగా చూసి, తన వెచ్చని పెదవులతో తాకి ఆమె పెదవులకు చలనం కలిగించుకున్నాడు.తరువాత ‘మడి కట్టుకోండి’ అంటూ ఆమె వంటింట్లోకి వెళ్లిపోయింది.అతను తాపితా కట్టుకున్నాడు.

 కుచ్చెళ్లు పోసుకునేటప్పుడు ‘‘రెండేళ్ల కిందట విజయదశమినాడు నీ అత్తవారిచ్చారు నీకిది. ఇంత గొప్పవి కాకపోయినా, ప్రతీ సంవత్సరమూ నువ్వు నీ అత్తవారి బహుమతులు కట్టుకుంటూనే ఉన్నావు. కానీ పుట్టింటి వారిస్తూనే ఉన్నారు గదా, లోటు లేదు గదా అనుకుంటున్నావే కాని రాధకి నువ్వొక్క చీర అయినా కొనిపెట్టావా పాపం? చిలక వంటి పెళ్లానికి మొగుడు చూపించవలసిన మురిపెం ఇదేనా? చివరకి వొక్క రైక అయినా కుట్టించావా? నీకిది బాగుందనిపించిందా?’’ అని ఎవరో నిలవతీసి అడిగినట్టనిపించింది.దీంతో వల్లమాలిన సిగ్గు వచ్చి ఊదర గొట్టేసింది.దాని మీది ‘ఇప్పుడైనా రాధకొక మంచి చీర కొనిఇవ్వాల’నుకున్నాడు. ‘ఇచ్చి తీరాలి. పండుక్కి కొత్త చీర లేని లోటు కలగనివ్వకూడదు’ అని దృఢపరుచుకున్నాడు.కానీ, డబ్బేది?ఏనెల జీతం ఆనెలకే చాలీచాలనట్టుంది. అక్కడికీ నెల్లూరిలో ఇంటి అద్దెలు చౌక కనుక సరిపోయింది. కాని లేకపోతే ఎన్ని చేబదుళ్లు చేస్తూ ఎన్ని వొడిదుడుకులు పడవలసి వచ్చేదో?రాధమ్మ కూడా పొదుపయిన మనిషి కనక ఆటసాగుతోంది. కానీ కాకపోతే, ఆ చేబదుళ్లకు సాయం ఎన్ని అరువులు పెరిగిపోయి ఉందునో?ఏమైనా చీర కొనితీరాలని శపథం పట్టుకున్నాడు.ఖర్చులు తగ్గించుకోడం తప్ప మార్గాంతరం కనపడలేదు. ఆ ఖర్చులలో నేనా సంసారం కోసం రాధమ్మ చేసేవాటిలో తగ్గించడానికి వీలు కనపడదు.దీని మీద ‘నా ఖర్చులు తగ్గించుకుంటా’నని అతను నిశ్చయించుకున్నాడు.అది మొదలు, అతను నాటకాలకి వెళ్లడం కట్టిపెట్టేశాడు. పుస్తకాలు కొనడం మానేసి భాండాగారానికి వెళ్లసాగాడు. ఒకటి రెండు వినోదయాత్రలు చాలించుకున్నాడు. కోర్టుకి వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడూ బండెక్కడం తగ్గించుకున్నాడు. మధ్యాహ్నం కోర్టు దగ్గర ఫలహారం ఒక్కటే కాదు, కాఫీ కూడా మానుకొన్నాడు.