మాటమంతి లేకుండా పడున్న పెనిమిటిని చూస్తుంటే జానకికి దుఃఖం ఆగడం లేదు. ముప్పైఏళ్ళ బట్టి ఎంతో అన్యోన్యంగా సహజీవనం చేసిన భర్త ఏ క్షణాన తనను విడిచి వెళ్ళిపోతాడోనన్న బెదురు ఆమె కళ్ళల్లో కానొస్తోంది.గుండెనొప్పితో బాధపడుతున్న భానుప్రకాష్‌ని హాస్పటల్‌లో చేర్పించి పదిరోజులవుతోంది. చికిత్స చేస్తున్న డాక్టర్లు అతడికి ఆపరేషన్‌ చెయ్యాలన్నారు. అందుకు ఐదు లక్షలవుతుందట. డబ్బు కడితేతప్ప ఆపరేషను జరగదు. ఇంతవరకు టెస్టులకి, మందులకి లక్ష రూపాయలదాకా ఖర్చయింది.తండ్రి హాస్పటల్‌లో ఉన్నాడని ఫోన్‌ చేస్తే బెంగుళూరు నుంచి కొడుకు, కోడలు వచ్చారు.‘‘నాన్నకెలా ఉందమ్మా’’ అడిగాడు శ్రీధర్‌ వచ్చీరాగానే.అతడి కంఠంలో కంగారు ధ్వనిస్తోంది.‘‘డాక్టర్లు ఏమన్నారత్తయ్యా’’ అడిగింది మాధవి.ఆమె గొంతులోను అదే కంగారు.‘‘చూస్తున్నారు కదా, ఎలా ఉలుకు పలుకు లేకుండా పడున్నారో ఆపరేషను చేస్తే తప్ప బతకడం కష్టమంటున్నారు డాక్టర్లు. అందుకు ఐదు లక్షలు అవుతుందట. నాకేం చెయ్యాలో పాలుపోవడం లేదు’’ దుఃఖాన్ని ఆపుకోలేక నోట్లో చీరకొంగు కుక్కుకుంది జానకి.‘‘నువ్వేం దిగులుపడకమ్మా నాన్నకి ఏం కాదు. డబ్బు నేను పట్టుకొస్తాను’’ తల్లికి ధైర్యం నూరి పోసాడు శ్రీధర్‌.ఆ మాట చెప్పివెళ్ళిన కొడుకు ఇంతవరకు పికర్లేదు. ఫోన్‌ చేస్తే ‘‘ఆయన ఆ ప్రయత్నంలోనే ఉన్నారత్తయ్యా’’ అంది మాధవి.జానకి మస్తిష్కంలో ఎన్నో ఆలోచనలు మరెన్నో అనుమనాలు.

ఉన్న పళంగా ఐదు లక్షలు తేవాలంటే మాటలా?... బ్యాంకులో అంత సొమ్ము రడీగా ఉండొద్దూ!.... డబ్బు కోసం వెర్రినాగన్న ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో? ఎన్ని అవస్థలు పడుతున్నాడో?... అందుకు కోడలు సహకరిస్తే పరవాలేదు లేకపోతే? ఇటువంటి పరిస్థితే తన అత్తయ్య మహాలక్ష్మమ్మకు ఎదురైనప్పుడు తను పోషించిన పాత్ర గుర్తుకొచ్చింది. గుండె దడదడ లాడింది. భయంతో గజగజ వణికిపోయింది. అనుకోకుండా ఆమె ఆలోచనలు గతంలోకి మళ్ళాయి.్‌్‌్‌సీతారామయ్య, మహలక్ష్మమ్మ దంపతుల నోముల పంట భానుప్రకాష్‌. తను చేసేది బట్టల కొట్లో సేల్స్‌మెన్‌ అయినా కొడుకు భవిష్యత్తు మాత్రం ఉజ్వలంగా ఉండాలనుకున్నాడు. అందుకే వాడిని ఇంగ్లీషు మీడియం స్కూల్లో వేసాడు. కడుపు కట్టుకుని వాడికి ఫీజులు కట్టాడు. పుస్తకాలు కొన్నాడు.భానుప్రకాష్‌ ఇంటర్‌లో ఫస్టు క్లాసొచ్చింది. ఉన్నత చదువు చెప్పించే స్తోమత తనకు లేదని తెలిసినా వాడిని డిగ్రీ కాలేజీలో చేర్పించాడు. బిడ్డ చదువుకోసం దొరికిన చోట్లల్లా అప్పులు చేసాడు. బి.ఇడి. అవుతూనే వాడికి టీచరుగా ఉద్యోగమైంది.సీతారామయ్య దంపతుల ఆనందానికి అవధుల్లేవు. పాయసం వండుకుని పండగ చేసుకున్నారారోజు.మొదటి నెల జీతం అందగానే డబ్బు పట్టుకొచ్చి తండ్రి చేతిలో పెట్టాడు భానుప్రకాష్‌.‘‘జీవితమంతా నాకిచ్చేస్తావేంట్రా నీ ఖర్చులకు కొంత ఉంచుకో’’ ఆప్యాయంగా బిడ్డ తల నిమురుతూ అన్నాడు సీతారామయ్య.