ఆధ్యాత్మిక సుగంధ పరిమళాలు ఆహ్లాదాన్ని కలిగిస్తూ, ఆ గిరి శిఖరాగ్రానికి చేరుకుంటున్న భక్తులందరినీ సేదతీరేలా చేస్తుండడమే కాకుండా అలౌకికమైన ఆనందానుభూతి కలిగేలా చేస్తోంది. స్వామి నామస్మరణతో ఆ పర్వత శ్రేణి పులకితమవుతోంది.

మదినిండా పొంగి పొరలుతున్న భక్తిభావంతో చేతులు జోడించి సాగుతున్న భక్తులు విచ్చుకున్న గొంతులతో దైవస్మరణ చేస్తూ తమ మదిలో కొలువైన స్వామిని కనులారా దర్శించు కునేందుకు తహతహలాడుతూ ముందుకు నడుస్తున్నారు.మెట్ల మార్గం ద్వారా నడుచుకుంటూ వస్తున్న భక్తులకు దూరాన్నుంచి మెరిసిపోతున్న గోపుర శిఖరం కనపడగానే వారిలో అలసట మాయ మయింది. కొత్త శక్తి పుట్టుకొచ్చింది. ఎంత త్వరగా వీలయితే అంత వేగంగా స్వామిని సేవించుకుని పునీతులమవ్వాలనే కోరికతో దర్శనం క్యూలలో చేరుతున్నారు. కొద్ది నిమిషాలు వెనకబడినా చాలాసేపు నిరీక్షించాలనే ఆదుర్దాతో పరు గులు తీస్తూ కంపార్టుమెంట్లలోకి చేరుకుంటున్నారు.రెండేళ్ళ క్రితం సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగంలో చేరిన సామంతు ఇన్నాళ్ళూ గెస్ట్‌ హౌస్‌ దగ్గర డ్యూటీ చెయ్యగా, వారం క్రితం నుంచి ఆల యంలో డ్యూటీకి మార్చారు. తన మనసులో ముద్రవేసిన స్వామి సన్నిధిలో పని అతనికి సంతృప్తి కలిగిస్తోంది.ఎక్కడో కొండకోనల్లో బతికే తనకు చివరికి ఈ స్వామి కొండమీద పనిచేసే అవకాశం రావడం, ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకునేందుకు ఉద్యుక్తుడయిన తనకు ఇలా బతికే అవకాశం కలగడం తన అదృష్టమనిపిస్తోంది. గతంలో ఎదురైన ఆటుపోటులూ, ఒడిదుడుకులూ కనులముందు కనిపించాయి.ఫఫఫ‘‘దండాలు దొరా’’ తండా దగ్గరకి వస్తున్న నారాయణమూర్తి మాస్టారుగారిని చూసి చేతులు జోడించాడు కోదులు.‘‘ఏం కోదులూ... బావున్నావా?’’ గుడిసెల్లోంచి బయటికొచ్చిన జనాలను చూసి నవ్వారు మాస్టారు.

విజయనగరానికి ఉత్తరంగా సుమారు డెబ్భై కిలోమీటర్ల దూరాన ఉన్న మక్కువ గ్రామాన్ని దాటుకుని దుగ్గేరు చేరుకున్నాక కనిపించే గిరిశ్రేణుల మీద పన్నెండు కిలోమీటర్లు కాలినడకన ప్రయాణిస్తే తొలుత కనిపించే జాతాపు తండా అది. అరవై మంది వరకూ జనాలున్న ఆ తండాకి నాయకుడు కోదులు.జాతాపు తెగల ఆచార వ్యవహారాలు, భాష, జీవన విధానాలను అధ్యయనం చేసే నిమిత్తం అప్పుడప్పుడూ వచ్చే నారాయణమూర్తి మాస్టారంటే వాళ్లందరికీ గౌరవమే. ఆయన వచ్చినప్పుడల్లా డాక్టర్‌ శ్రీరామమూర్తి గారి దగ్గర్నుంచి మందులూ, మాత్రలూ తెచ్చి ఇవ్వడం, తమ బాగోగుల కోసం తపించడం వారికి ఆయన్ను మరింత దగ్గర చేశాయి.‘‘దొరా... మీరొకపక్క మా గురించి, మా బాస గురించి మంచిగా రాత్తావుంటే ఇక్కడ ఒక్కక్కలూ కొండ దాటి ఊర్లోకు పోతున్నారు. రెండేళ్ళక్రితం వందమందికి పైగా ఉండేవోళ్ళం...’’తమ తెగకి ఉన్న ప్రత్యేక సంస్కృతి అంతర్థాన మయిపోతున్నదన్న బాధ కోదులు మాటల్లో వ్యక్తమవుతోంది. అందరూ తెలుగు పదాలే నేర్చుకుని మాట్లాడుతూండడంతో తమ కువ్వి భాష క్షీణించిపోతున్నదని అతను చింతిస్తున్నాడు.