‘‘పిల్ల నలుపేగాని, బంగారంరా. నువ్వు ఏడేడు పద్నాలుగు లోకాలు తిరిగినా అంతచక్కటి అమ్మాయి దొరకదు. నా మాటవిని ఆ పిల్లను చేసుకోరా పుర్రూ...!’’ అంది బామ్మ.‘‘ఛీ.. ఛీ... పుర్రూ ఏంటే పుర్రూ..? వింటూంటేనే వాంతయ్యేలా ఉంది. కోరి కోరి పురూరవ్‌ అని పేరు పెట్టుకున్నావ్‌ కదా, కనీసం ఆ పేరు పెట్టినందుకైనా పురూరవ్‌ అని పిలవకుండా, పుర్రూ పుర్రూ ఏంటే బామ్మా అసహ్యంగా!’’ చిరాగ్గా అన్నాడు మనవడు.‘‘ఇంకా నయం, అది మీ తాతగారి పేరు. ఆ పేరుతో పిలిస్తే ఇంకేమన్నా ఉందా? రౌరవాది నరకాలకు పోనూ?’’ చెంపలు వేసుకుంటూ ‘‘అయినా నేను మాట్లాడుతున్న విషయమేంటి? నువ్వు వాగుతున్న వాగుడేంటి? మాట మార్చకు మంగతాయారు మాణిక్యంరా నాన్నా’’ అంది నచ్చజెబుతున్నట్టు.‘‘అవునవును. మసిపూసిన మాణిక్యం’’ వ్యంగ్యంగా అన్నాడు పురూరవ్‌.‘‘కాదురా... మట్టిలో మాణిక్యం. నీకు అనుకూలంగా సాన పెట్టుకున్నావనుకో అది మన ఇంటికే వెలుగుతెస్తుంది. నువ్వు సుఖపడతావు. నేనూ సుఖపడతాను. పైగా నువ్వంటే దానికి చచ్చేంత ఇష్టం. నీకోసం పడి చస్తుంది. నా మాట వినరా నాన్నా’’ బుజ్జగిస్తున్నట్టుగా అంది బామ్మ.‘‘ఇది మరీ బాగుందే బామ్మా. తనకు ఇష్టమైందని నన్ను కట్టబెట్టేస్తావా? నాకు ఇష్టం ఉండొద్దూ. ఆ నల్లపిల్లను చేసుకోనుగాక చేసుకోను. ఇందుకోసమేనా హైదరాబాదు నుంచి అర్జంట్‌పని అని పిలిపించావు’’ అన్నాడు పురూరవ్‌.‘‘అది కాదురా పుర్రూ... చిన్నప్పట్నుంచి తెలిసినపిల్ల. పిల్ల కాస్త నలుపైనా.. ఆ మాటకు వస్తే నువ్వు మాత్రం పెద్ద ఏం రంగనీ, ఏదో పట్నంలో ఉన్నావు కాబట్టి కాస్త నునుపెక్కావు అంతే. ఇద్దరికీ ఈడూజోడూ బాగుంటుంది. మంచి కుటుంబంలోపిల్ల. నిజంగానే నువ్వు సుఖపడతావురా. నాక్కూడా నీ పెళ్ళి కళ్ళారా చూసేసి మీ తాతగారి దగ్గరకు వెళ్ళిపోవాలని ఉందిరా. బాబ్బాబు... నా మాట కాదనకు నాన్నా..’’ బ్రతిమాలుతున్నట్టు అంది బామ్మ.‘‘నువ్వలాంటి ఆశలు పెట్టుకోకే బామ్మ.

 నాకు కాబోయే భార్యను నేనే చూసుకుని నీ ఆశీర్వాదంకోసం తీసుకువస్తాను. అప్పుడు మా పెళ్ళి చేసేసి మునిమనవడో, మునిమనవరాలితోనో ముచ్చట్లాడుకుని హాయిగా తాతయ్య దగ్గరకు వెళ్ళిపోదువుగానీలే. మరినేవస్తా. ఆఫీ్‌సలో ఆడిట్‌ ఉంది. అర్జంట్‌ అన్నావనీ ఆఘమేఘాలమీద వచ్చేశా’’ ప్రయాణానికి సిద్ధపడుతూ అన్నాడు పురూరవ్‌.‘‘అదికాదురా పుర్రూ...’’ ఏదో చెప్పబోయింది బామ్మ.‘‘బామ్మా..’’ గావుకేక పెట్టాడు పురూరవ్‌.‘‘ఆ పుర్రూ అన్నమాట అనకే. వినలేక చస్తున్నా. అస్తమానం పుర్రూ... పుర్రూ అంటున్నావనే నేను రావడం కూడా తగ్గించేశా. బామ్మా... ప్లీజ్‌! ఆ పిలుపు మానెయ్యవే. వింటుంటే ఏదో గుర్తుకువచ్చి కంపరంగా ఉంటోంది’’ దండంపెడుతూ అన్నాడు పురూరవ్‌.