‘‘ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకి దొడ్లో గున్నమామిడిచెట్టుమీద ఉడతల జంటలు సరసాలాడుకుంటూ తరుముకుంటూ, స్వేచ్ఛలో మాకెవరూ రారు సరిసాటి అని పాడుకుంటూ చెర్లాటలాడుతున్నవేళ - గృహిణిలు ఆడజన్మెత్తిన పాపానికి ఆదివారమైనా వంటిళ్ళల్లో మగ్గేవేళ, మొగ పుట్టుక పుట్టిన పుణ్యానికి మొగానుభావులు తీరుబడిగా షేవింగ్‌ చేసుకుంటూ రెండోసారి కాఫీకోసం అరచేవేళ వంటింట్లో జగదాంబ - ‘‘అమ్మాయ్‌ అర్చనా! నీకోసం నస సుందరంగారు వచ్చేవేళయిందనుకుంటాను. ఆదివారాలు పొద్దుటే పనివేళా వచ్చి గంటల తరబడి తనసోదెతో నీ బుర్ర తినెయ్యడానికి ఆ పెద్దమనిషికి సిగ్గెయ్యదు కాబోలు! ఆయన నస ఎలా భరిస్తున్నావో నాకు అర్థం కావట్లేదమ్మాయ్‌!’’ అంది.అర్చన నవ్వింది. ‘‘పోనివ్వండి అత్తయ్యా, పెద్దాయన! ఆయన చెప్పే విషయాలు ఓపిగ్గా ఊ కొడుతూ వినడానికి ఆయనకి మనుషులు కావాలి. ఆయన సొద భరించలేక ఆయన స్నేహితులు సైతం ఆయన కనిపించగానే అర్జంటు పని వున్నట్లు నటిస్తూ తప్పించుకుపోతారు.

 ఆదివారాలు ఇంట్లో దొరికిపోయే నాకు తప్పించుకోడానికి అవకాశం లేదుగా. ఏదైనా ఇష్టం లేనిది భరించక తప్పనపుడు దాన్ని అసహనంతో భరించడం కన్నా ఇష్టంగా భరిస్తే దానివల్ల కలిగే తీవ్రత కొంతయినా తగ్గుతుంది’’ అంది.నస సుందర్రావ్‌! రిటైర్డ్‌ ఇంజనీర్‌! అరవయ్యేళ్ళొచ్చినా కురుక్షేత్ర యుద్ధం పూర్తయ్యాక ధృతరాష్ర్టుడు ముందుకు కృష్ణుడు తోసిన రాతిభీముడలా దృఢంగా వుంటాడు. ఆరోగ్యానికి పకపకా విరగబడి నవ్వడం చాలా మంచిదని చెప్పే నగరంలోని లాఫింగ్‌ క్లబ్‌ (నవ్వుల సధీ - నస)కి గౌరవ అధ్యక్షుడు! ఓ స్వచ్ఛంద సంస్థలో అనాధ బాలల పునరావాసం కోసం పనిచేసే తనకి ఇటీవల ఓ సందర్భంలో పరిచయమైన ఆయన అనాధలకి సేవ చెయ్యడం కన్నా గొప్ప మానవసేవ మరొకటి లేదంటూ తనని తెగ మెచ్చుకున్నాడు.

అప్పటినుండీ మొదలు ఆయన ఆదివారాలు పొద్దుటే వచ్చి వాలిపోవడం! వస పోసిన పిట్టలా ఎదుటివాళ్ళేమనుకుంటారో అనే కామన్‌ సెన్సూ, టైమ్‌ సెన్సూ లేకుండా అనేక విషయాల గురించి సందర్భశుద్ధి లేకుండా గంటల తరబడి తెగ మాట్లాడతాడు. తను బాగా చదువుకున్నవాడ్ని సుమా అని తెలియజేయడం కోసం అన్నట్టు ఆంగ్లసాహిత్యపు కొటేషన్లూ, రామాయణ, భారత, భాగవత పురాణాలు, ఉపనిషత్తులు, భగవద్గీతల్లోంచి శ్లోకాలు, పిట్టకథలు అనర్గళంగా అలవోకగా ఉటంకిస్తాడు. తన కుటుంబ విషయాలు - భార్యా పిల్లలు, తమ్ముళ్ళు, వాళ్ళ సంసారాలు, తన తల్లిదండ్రుల గురించీ చెప్పి చెప్పి బుర్ర తినేస్తాడు!