‘కొడుకూ..కోడలు..’ రెండేళ్ల మనుమడితో పాటు మనాలీ వెళ్లడంతో ‘మనసు’కు ప్రశాంతత లభించినట్లు చిన్నగా నిట్టూర్చింది జయంతి. ద రిటైర్డ్‌ లెక్చరర్‌ ఆఫ్‌ ఆంధ్రమహిళాసభ కాలేజ్‌వారం రోజులుగా ఒకే విషయం గురించి ఆలోచించీ.. ఆలోచించీ...పరిష్కారం దొరక్కపోవడంతో మానసికంగా చాలా అలసిపోయిందామె.ఇంతేనా జీవితమంటే? ఏదో జరుగుతుందని... ఆశలతో అహర్నిశలు శ్రమతో నిర్మించుకున్న జీవిత సౌధం కేవలం ఒకే ఒక చిన్న వాక్యంతో బీటలు వారిపోయిందంటే తప ఎవరిది?తనదా? కన్న కొడుకుదా?తను కూడా ఓ తల్లికి బిడ్డననే ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయిన కోడలు రమ్యదా? భర్తను అదుపులో పెట్టుకోగలిగినంత మాత్రాన అందరి మీదా అధికారం వచ్చేసినట్లేనని భావించే కోడలు... చూపులకు మాత్రమే ‘రమ్య’...ప్రవర్తనలో కానీ, పెట్టుపోతల్లో కానీ రమ్యత లేని ఆమె కా పేరెందుకు పెట్టారోనని... ఆమె తన ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండీ ఆలోచించని క్షణాలు ‘చాలా అరుదు’.అసలీ సంక్షోభానికి కారణం ఏమిటి?తను భర్తను కోల్పోవడమా? జీవిత సౌఖ్యాలను వాయిదా వేసుకొని ‘మనసుని శిలగా మార్చుకుని’ కంటికి రెప్పలా మారి పిల్లల్నిపెంచి ప్రయోజకుల్ని చేయడమా?ప్రయోజకులైన పిల్లలు తననేదో ఉద్ధరిస్తారనే అపోహల్ని ఆశలుగా మలుచుకోవడమా?ఒంటరిగా బతుకు బండిని ఈడ్చలేనేమోనని ‘కొడుకుని, కోడలిని’ తనతో వుంచుకోవడమా? ఇన్ని ఆలోచనల మధ్య వారం క్రితం జరిగిన ‘ ఆ సంఘటన’ ఆమె మనసును పచ్చి పుండులా సలుపుతుంటే..బాధను భరించడం కోసం...కళ్లు మూసుకున్న జయంతికి కనురెప్పల మధ్య ‘కలికం’ పెట్టినట్లు మెదిలింది.

ఆ రోజు సాయంత్రం ఆఫీసు నుంచి వస్తూనే చిన్నగా గీరుకుపోయిన బాబీగాడి చేతిని చూస్తూ... ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా తనను అదోలా చూస్తూ...‘‘ఏంటత్తయ్యా? ఇలాగేనా? పిల్లల్ని చూసుకునేది? ఆ తగిలిన దెబ్బేదో ఇంకా కొంచెం గట్టిగా తగిలుంటే? వాడి బతుకు ఏమయ్యేది? మిమ్మల్నేమైనా బజారుకెళ్లమన్నామా? బరువులెత్తమన్నమా? బాబును చూసుకోమన్నాం. అంతేగా? అది కూడా చేతకాకపోతే ఎందుకు ఇంత వయసొచ్చి?’’రమ్య వాయిస్‌లో తొంగి చూసిన కోపాని కన్నా చిన్న విషయాన్ని పెద్దదిగా చేస్తూ తన వయసు గురించి చేసిన కామెంట్‌కు కన్నీళ్ల పర్యంతమైంది.