‘‘అత్తయ్యా! గోవుపాలెం నుంచి రామచంద్ర బాబాయి గారొచ్చారు’’ పెద్ద కోడలు కమల పిలుపు విని పార్వతమ్మ తన గదిలోంచి డ్రాయింగ్‌ రూంలోకొచ్చింది. తమ్ముడు, తన పెద్ద కొడుకు మురళి సోఫాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇదే మురళి చిన్న పిల్లవాడుగా ఉన్నపడు రామచంద్ర గేట్లో కన్పించగానే ‘అమ్మా మామయ్యొచ్చాడు’ అంటూ సంబరంగా పరిగెత్తుకుంటూ తన దగ్గరికొచ్చేవాడు. తమ్ముడు పల్లెనుంచి తెచ్చే చెరకుముక్కలు, పచ్చి వేరు సెనక్కాయలు, అలసంద కాయలు, కొత్త బెల్లం కోసం పిల్లలు పోట్లాడుకునేవాళ్లు. పార్వతమ్మ నవ్వుకుంది.‘‘ఏరా ఇపడా రావడం. పొద్దున్నుంచీ చూస్తున్నాం. సుగుణా ఏదీ? వూళ్లో అంతా బాగున్నారా?’’‘‘బాగున్నావాక్కా ఏదీ పొద్దున్నే సుగుణా వాళ్ల పిన్ని కూతురింటికి పోతిమా ఏదిగో ఇపడయ్యింది బయటికొచ్చేటప్పటికి. సుగుణ్ణి రేప్పొద్దున్నే దింపుతామనిరి. ఈ సిటీలో అన్నీ దూరాలే గదా. రేపు రాత్రికి మళ్లా కాశీకి బయలుదేరాల్ల’’చాలా రోజుల తర్వాత వచ్చిన తమ్ముడిని పరీక్షగా చూసింది పార్వతమ్మ. మనిషి చిక్కాడు. జుట్టు పలచబడింది. మొహంలో మునుపటి కళ లేదు. ఓడిపోయి సంధికొచ్చిన రాజులాగున్నాడు.‘‘కూర్చోమ్మా నీకోసమే చూస్తున్నాం’’ అని తల్లితో అని- ‘‘అయితే మామయ్యా ఆంజనేయులు కొంటానన్నాడా మన దేవళం తోట పొలం. ఎంతిస్తానన్నాడు’’ అంతకుముందు జరిగిన సంభాషణని పొడిగించాడు మురళి.

‘‘వాడు మా పీనాసిరాప్పా! మనం అది ఎప్పటికైనా అమ్ముకునేకే అని తెలిసి కష్టమ్మీద మూడు లక్షల దాకా వచ్చినాడు’’‘‘అదేంటి మామయ్యా ఎకరానికి లక్ష లెక్కన అయిదయినా వస్తుందనుకున్నామే. బోరు బావి, చెట్లుగూడా వున్నాయి’’‘‘అవేం చెట్లు లేరా రాగి, నేరేడు, రేగు ఇట్లాటివే గదా. ఆ నాలుగు వేప చెట్లకేమైనా విలువుంటుందేమో. నీటి వసతి గూడా అంతంత మాత్రమే గదా. పైగా ఆ చెట్లు కొట్టేకిలేదని, దేవళాన్ని నడపాలని షరతు బెడితిం గదా’’‘‘ఎవడు ఆ కోటయ్య కొడుకు ఆంజనేయులేనా? వాడికైతే అమ్మనే వద్దురా. వడ్డీల మీద వడ్డీలు గట్టి వాడు జనం రక్తం పీలుస్తాడు. ఆ పాపిష్టి డబ్బు మనకొద్దు’’ పార్వతమ్మ కోపంగా మాట్లాడింది.‘‘అమ్మా ఇన్నాళ్లాయె. ఎన్నో కండిషన్లు పెట్టి అమ్మడానికి వొపకున్నావు. మళ్లీ కొనేవాడి గుణగణాలు బావుండాలనే ఈ కొత్త షరతు ఎక్కడిదే?’’ మురళి నవ్వాడు.‘‘వూర్లో భూములు కొనే పెద్ద మనుషులెవరున్నారే? అంతో ఇంతో స్థోమతున్నోళ్లే భూముల్ని అమ్ముకొని టౌన్లు చేరుతున్నారు. ఇపుడు సేద్యం ఎవరికీ గిట్టుబాటు గావడం లేదక్కా. రైతులంతా కూలీలై దేశాలు బట్టి పోతున్నారు. బిడ్డ పెళ్లి ఎట్లో కానిస్తిని. దేవుని దయ వల్ల శంకరానికి బెంగుళూర్లో వుద్యోగమొచ్చే. ‘బెంగుళూరుకి రాకుండా ఆ పల్లెలో అగచాట్లెందుకని వాడనె’ సంవత్సరం నుంచి ఇష్టపడితే నా భూమి తల్లిని అమ్మాలన్నా, విడిచి వెళ్లాలన్నా బాధే. ఏంజేస్తాం’’ వేదాంతంలోకి దిగాడు రామచంద్ర.