శంఖుపూల తీగల్ని తప్పించుకుంటూ ఏపుగా పెరిగిన చెట్ల మధ్య నడుస్తూ తులసికోట దగ్గర ఆగి నాలుగు అక్షింతలు తీసి పాపిట పొదువుకుని, మందారపువ్వు తీసి జడలో తురుముకుని బైట గేటుకి తాళం వేసి భర్తని అనుసరించింది రాజేశ్వరి.గంభీర వదనంతో పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వెళ్ళిపోతున్న భర్తను అందుకోలేక ఆమె పడుతున్న అవస్థ గమనించి నడకవేగం తగ్గించాడు రాజారాం. గబగబా భర్తను సమీపించి పక్కన నడుస్తూ అడిగింది రాజేశ్వరి.‘‘ఏమండీ! ఈ ఇల్లైనా మనకి నచ్చుతుందంటారా?’’‘‘నిక్షేపంలా! ఇదే మనం చూడబోయే ఆఖరి ఇల్లు’’ అన్నాడు రాజారాం నవ్వుతూ.నెలరోజుల నుండి అద్దె ఇంటి కోసం ఊరంతా గాలిస్తున్నారు. వారు చూడని ఇల్లు లేదు. చూసిన ఇల్లేదీ నచ్చలేదు. ఊరు నగరంగా మారి పట్టణ జనాభా పెరిగిన నేపథ్యంలో తాను కూర్చున్నకొమ్మను తానే నరుక్కుంటూ ఇంటి ఆవరణలో పచ్చదనమే లేకుండా కృత్రిమత్వాన్ని చుట్టూ కోటలా కట్టుకుంటున్న ఆధునిక నివాసాలు. వాటి మధ్య పర్ణశాల వంటి అద్దె ఇంటి అన్వేషణ ఎడారిలో గంధపుమొక్క కోసం అన్వేషించటమేనని తెలుసు రాజారాంకి. అయినా తలదాచుకోవటానికి ఏదో ఒక ఇల్లు చాలని డీలాపడిన మనసుతో, రాజీపడి వెతుకుతున్నాడు. పక్కింటి ప్రసాదుగారు చెప్పిన మాట తియ్యని చెరకుపానకంలా అనిపించి ఇల్లు చూడాలని భార్యతో కలిసి బయలుదేరాడు. ఇల్లు చూడగానే నచ్చింది. అది రెండు వాటాల పాతకాలపు నాటి పెంకుటిల్లు. 

ఒక వాటాలో ఇంటి ఓనరు ఉంటూ, రెండో వాటా అద్దెకు కేటాయించారు. ఇంటి చుట్టూ నేత్రపర్వంగా పేరు తెలిసిన కొన్ని, పేరు తెలియనివి మరికొన్ని పలు రకాల చెట్లతో ఎటుచూసినా పచ్చదనమే కనిపిస్తూ మనసుకెంతో హాయి కలిగిస్తోంది.ఇంటి వాతావరణం ఎంతో ఆహ్లాదంగా అనిపించి అద్దె, అడ్వాన్సు మాట్లాడుకుని మర్నాడు వస్తామని చెప్పి వచ్చిన దారినే వెనుదిరిగారు. నిజానికి అద్దె ఇల్లు ఎలా ఉంటుందో వారికి తెలియదనే చెప్పాలి. విశాలమైన సొంత ఇంటిని వదిలేసి, వారు అద్దె ఇంటికోసం కాళ్ళు అరిగేలా ఎందుకు తిరగాల్సి వచ్చిందో తెలియాలంటే కాస్త వెనక్కి వెళ్ళాలి.పట్టుపరికిణీ కట్టుకుని ఒత్తైన పూలజడతో ఛెంగు ఛెంగున తిరిగే మహాలక్ష్మి పెళ్ళీడుకొచ్చినా రాజారాం కంటికింకా చిన్నపిల్లగానే కనిపించేది. రాజారాం, రాజేశ్వరిల ఏకైక గారాల పుత్రిక మహాలక్ష్మి. చదువు పూర్తిచేసి ఆమె తోటివారంతా అత్తవారిళ్ళకు వెళ్ళిపోతున్నా ఆమె మాత్రం తండ్రి చాటు బిడ్డగానే ఉండేది. ఒకనాడు పొరుగూర్లో ఉంటున్న చిన్ననాటి స్నేహితుడు అనుకోకుండా బజారులో కనిపిస్తే తన ఇంటికి పిలిచి చక్కటి ఆతిథ్యమిచ్చాడు రాజారాం.