ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం కష్టం. ఎందుకంటే ఒక్కోడిది ఒక్కో ప్రపంచం. నాకు ఇల్లే ప్రపంచం. ఒకరోజు అర్జెంటుగా ఆ ప్రపంచాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. చేతి చాపల్యం కొద్దీ మా ఇంటి ఓనర్‌పైనే ఒక కథ రాసాను. నా ‘క్షేమాన్ని’ కోరే మిత్రులు ఆయనతో ఆ కథ చదివించారు. ఆయన క్షమించాడు. కానీ వాళ్లావిడ క్షమించలేదు. ఇల్లు పీకి పందిరేసింది. ఇల్లు మారే క్రమంలో నాకు ప్యాకర్స్‌ తగిలారు. మేధావులు అన్ని చోట్లా ఉంటారు. దేవదాసు కూడా మేధావే. అండపిండ బ్రహ్మాండాన్నయినా ప్యాక్‌ చేస్తానని హామీ ఇస్తూ ఇంటికొచ్చాడు.‘‘అదంతా సరే, నీకీ పేరెందుకు పెట్టారో చెప్పు?’’ అని పిడకల వేటకి దిగాను.‘‘మా నాన్నకు దేవదాసు సినిమా అంటే ఇష్టం’’.‘‘సినిమా మాత్ర మే ఇష్టమా? దేవదాసుకి ఇష్టమైనవన్నీ ఇష్టమా?’’‘‘మొదట్లో మంచిదాసే... మా అమ్మని ప్రేమించి పెళ్లిచేసుకుని బ్రాందీ గ్లాసయ్యాడు’’.‘‘ప్రేమ సక్సెసయినా కూడా కిక్కే మిగిలిందా?’’‘‘కిక్‌ కాదు చెక్‌. మా నాన్న ఎటు కదిలినా చెక్కే, చిక్కే’’‘‘సంసారమంటేనే ... సమరం ... శాంతి’’.‘‘సమరం అమ్మ ప్రారంభించేది శాంతిని నాన్న కోరేవాడు’’.‘‘మరి మీరెలా పుట్టారు?’’‘‘బ్రేక్‌ టైంలో’’ఇంతలో మా ఆవిడ సీన్‌లో కొచ్చి ‘‘ఏళ్ల తరబడి ఇళ్లు మారడమేనా? ఏ నాటికైనా సొంత కొంపను కొంటామా’’ అని గట్టిగా అరిచింది.‘‘ఈ దేహమే ఒక అద్దెఇల్లు. ఆ దేవుడే ఏదో ఒకరోజు మనల్ని ప్యాక్‌ చేసి ఆరడుగుల నేలకు మూవ్‌ చేస్తాడు’’ అన్నాను.‘‘దంతాలు లేనివాళ్లే వేదాంతులవుతారు’’ అంది ఆవిడ.‘‘నాకు దంతాలున్నాయి కదా?’’‘‘నేను రాలగొట్టకపోవడం వల్ల వున్నాయి’’.‘‘పళ్లున్న చెట్టుకే రాళ దెబ్బలు’’.

‘‘ఈ సామెత ఇక్కడ అతకలేదు సార్‌’’ అన్నాడు దేవదాసు కల్పించుకుని.‘‘చూడబ్బాయ్‌ కంటికి కనిపించే వస్తువులే కాకుండా కంటికి కనపడని నాలుగో సింహముంది మా ఇంట్లో’’ అంది మా ఆవిడ.దేవదాసు జడుసుకుని ‘‘మీరు పోలీస్‌ డిపార్టుమెంటా మేడం?’’ అని అడిగాడు. ‘‘ఈ ఇంట్లో ఆమె రిటైర్‌మెంట్‌ లేని పోలీస్‌. నేను నేరాలు చేయని క్రిమినల్‌ని’’ అన్నాను.‘‘నాలుగో సింహమంటే మా ఆదాయన్నంతా కబళించే లైబ్రరీ. ముప్పయి రెండు అట్టపెట్టెల్లో పుస్తకాలున్నాయి’’ చెప్పింది మా ఆవిడ.‘‘అన్ని పుస్తకాలా...పాత పేపర్లవాడిని పిలవనా మేడం’’ అన్నాడు దేవదాసు.ఈ ప్రపంచంలో ప్రతివాడూ జ్ఞానాన్ని ద్వేషించేవాడే. పుస్తకాలు చదివి పాడయిపోయానని మా ఆవిడ వాటిని అట్టపెట్టెల్లో బంధించింది. పుస్తకాలు ఎలాగూ లేవు కదాని పేపర్‌ చదువుతూ పాలస్తీనా సమస్య గురించి ఆలోచిస్తూవుంటే ఆవిడకి పాలప్యాకెట్లు గుర్తొస్తాయి. మార్క్సిజం గురించి తర్జన భర్జన పడుతుంటే బ్రెడ్‌లోకి జాం కావాలని అడుగుతుంది. ఎంత మేధావి అయినా పెళ్లాం ముందు వెర్రోడే కదా!