దేవలోకంలో వున్న ఆహ్లాదకర వాతావరణానికి తాను కూడా తోడై వసంత గాలులతో మరింత రంజింప చేస్తున్నాడు వాయుదేవుడు.బ్రహ్మ - విష్ణు - మహేశ్వరులు ఇంద్రుని లోలత్వం గురించి పరాచికాలు ఆడుకొంటుంటే, సరస్వతి-లక్ష్మి-పార్వతి వింటూ మూతులు విరుచుకొంటూ అంతలోనే ముసిముసి నవ్వులు నవ్వుకొంటూ పాచికలు ఆడుకొంటున్నారు.సుదూర తీరాల నుండి మహతీనాదం వినపడేసరికి - ఏ ఉపద్రవం రాబోతున్నదోనని విష్ణువు గతుక్కుమన్నాడు. ‘‘కలహభోజనుడు రాబోతున్నాడా’’ అని ఆలోచిస్తుండగానే మేఘాల చాటునుండి నారదుడు ప్రత్యక్షమయ్యాడు.‘‘అనూహ్యగమనానికి కారణమేమిటో? కలహ భోజనములు - సకల కళా కోవిదులు అయిన నారదుల వారి రాక మాకు భయం కోల్పోతోంది. ప్రశాంతంగా వున్న దేవలోకంలో కలహాలు సృష్టించరాలేదు కదా!’’ అన్నాడు శివుడు ‘సకళా కళా’ అనే పదం ఒత్తిపలుకుతూ.‘‘ఎంతమాట! ఎంతమాట!! జగత్తుని ఒంటి వ్రేలిపై నడిపించే సామర్థ్యం కల త్రిమూర్తుల మధ్య కలహం సృష్టించగల నేర్ను నాకు ఎక్కడిది స్వామి! నేడు నరక లోకం నుండి వస్తున్నాను. కాగల కార్యం గంధర్వులే తీరుస్తారన్నట్లు అందరూ భార్యాసమేతులై వున్నారు’’ అన్నాడు నారదుడు.

‘‘నరక లోక విశేషాలేమిటి? నారదా!’’ అడిగింది సరస్వతి.‘‘తినబోతూ రుచులేలనమ్మా! యమధర్మరాజుల వారే రాబోతున్నారు’’ అన్నాడు నారదుడు.దూరంగా మహిషపు రంకెలు వినపడ్డాయి. కొన్ని క్షణాల్లో యమధర్మ రాజు వచ్చాడు. తన వాహనం మీద నుండి దిగి - గదను ప్రక్కన బెట్టి త్రిమూర్తులకి వంగి నమస్కరించాడు.‘‘ఏం! యమా వేళకాలని వేళ వేంచేశావు’’ అడిగాడు శివుడు.‘‘ఏం చెప్పమంటారు శివా! నరకమందు కాలు పెట్టడానికే చోటు లేదు’’‘‘కారణం అడిగాడు’’ శ్రీపతి.‘‘విరించి గారినే అడగండి’’ వ్యంగ్యంగా అన్నాడు యమధర్మరాజు.విష్ణువు-బ్రహ్మ వైపు ‘ఏమయింది’ అన్నట్లు చూశాడు. బ్రహ్మ చిరునవ్వు నవ్వాడు.యమధర్మరాజు తిరిగి అన్నాడు. ‘‘రోజు రోజుకి పాపాత్ముల సంఖ్య పెరిగి పోతోంది. నరకంలో వున్న సామాగ్రి - స్థలం వున్న పాపాత్ములకే సరిపోతూంటే వచ్చే జనాన్ని ఏం చేయాలో - ఎలా సర్దాలో పాలు పోవడం లేదు’’.‘‘హిరణ్య గర్భా! ఎవరిదీ వైఫల్యం’’ అడిగాడు విష్ణువు.‘‘తండ్రీ! నేను విధి రాతను రాస్తున్నాను కానీ. నాకంటే తెలివైన బాబాలు, జ్యోతిష్కులు, వాస్తుప్రవీణులు భారతదేశంలో పుంఖాను పుంఖాలుగా తయారయి, నీ రాతనే కాదు. చిత్రగుప్తుడి చిట్టాను కూడ తిరగ రాస్తున్నారు. ఈ విషయంలో నేను నిస్సహాయుణ్ణి. నా ఓటమిని అంగీకరిస్తున్నాను. మీరే ఏదైనా ఉపాయం ఆలోచించండి’’ అన్నాడు బ్రహ్మ.‘‘యమా! ధర్మ సంస్థాపనార్థమై భూలోకంలో మరో అవతారం ఎత్తే ఓపికలేదు. పైగా విరించి మాటలనుబట్టి మానవులు నాకంటే తెలివి మీరి పోయారు. ప్రత్యామ్నాయం ఆలోచిస్తాను. మీరు నిశ్చింతగా వెళ్లండి’’ అన్నాడు చక్రపాణి.