పెద్ద మర్రి చేరేటప్పటికే అరగంట పట్టింది వెంకన్నకి. ఈ లెక్కన నడక ఇంకా గంటేనా పడుతుందనుకున్నాడు. ఆరోజు పని అయిపోయిం తరువాత, సాయంత్రం, ఏడు ఏడున్నరకి భోజనం చేసి బయల్దేరాడు వూళ్ళో... ఎప్పుడూ అలాగే ఆ టైముకే బయలుదేరతాడు. కాని ఆరోజు ఆలస్యమైంది నడక.నిన్న పనిలో.. లారీ లోడ్‌ చేస్తుంటే జారి, కాలు మడతపడి కుడిపాదం బెణికింది. నిన్నటి బెణుకు ఈవాల్టికి బాగా మోపుచేసి అడుగు తొందరగా సాగనివ్వటం లేదు.ఆలస్యం గుర్తింపు కొచ్చేటప్పటికి ఆక్కుండా వెళ్ళిపోదామనుకున్నాడు. కానీ కుడికాలు బాగా బరువుగా వున్నట్టనిపించింది. తలొంచి చూసుకుంటే పాదం చుట్టూ చీకటే తప్ప పాదం కనబట్టం లేదు.. తలెత్తి చూశాడు మర్రివేపు. రోడ్డుకి ఎడం పక్కన వందగజాల్లో ఎవరో నిలబెట్టిన పెద్ద చీకటి గొడుగులా కనిపించింది వెంకన్నకది. ఆ రోడ్డమ్మట వచ్చీ పోయేటప్పుడు చాలాసార్లు చూశాడు దాన్ని... చూసినప్పుడల్లా తనుండే రేకులగది గుర్తొస్తుంది. మర్రి చెట్టుకీ, తనుండే రేకులగదికీ ఏమిటో సంబంధం - ఎన్నిసార్లు ఆలోచించినా వెంకన్నకి అంతుపట్ట లేదు.ఇంచుమించు ఏడాదిక్రితం మొదటిసారిగా యిదే మట్టిరోడ్డమ్మట నడుస్తూ దాన్ని చూశాడు. ఆరోజు మటుకు పెద్దగా పరికించి చూళ్ళేదు. ఏదో యధాలాపంగా చూశాడు. చూసిన ఆ ఒక్కక్షణంలోనే తనుండే రేకులగది గుర్తొచ్చింది... ఆ గుర్తూ ఎంతోసేపు నిలవలేదు.ఆరోజు చాలాచిత్రమైన కంగారులో వున్నాడు తను. అసలు వెళ్దాం వెళ్దాం అని చెప్పి ఆ ప్రయాణం పెట్టింది సాంబడు.

 తీరా చివరికి పేకాటలో కూచుని... ‘‘మల్లీ ఎప్పుడేనా ఎల్దాంలే. ఆట మంచి పట్టులో వుంది’’ అని ఎగ్గొట్టేశాడు. సాంబణ్ని ఎలాగేనా ఆటలోంచి లేవదీయాలని ఒకటి రెండు చిన్న ప్రయత్నాలు చేసినా సాంబడు కదల్లేదు.ఉంటున్న వూరే కొత్త వెంకన్నకి. అక్కడకొచ్చి ఆర్నెల్లు కూడా కాలేదప్పటికి.ఉద్యోగం కోసం ఎక్కడెక్కడో దేవుళ్ళాడుతుంటే, ఈ వూళ్ళో కాకిరాయి తవ్వకం జరుగుతోందని, ఏదో పని అక్కడ దొరక్కపోదని ఎవరో చెప్పేరు. అప్పటి తన పరిస్థితిలో వెనకాముందూ ఆలోచించకుండా, బయలుదేరి ఆ వూరొచ్చాడు. వూళ్ళో బస్‌ దిగేటప్పటికి యింకా వెలుగు పూర్తిగా రాలేదు. ఎదురుగా చిన్నపాక హోటలుంటే కాఫీ తాగి వాళ్ళనీ వీళ్ళనీ వాకబుచేసి నెమ్మదిగా చేరాల్సిన చోటికి చేరాడు.అక్కడ చూసేటప్పటికి వాళ్లంతా ఓ రెండొందలమందేనా వుంటారని పించింది. గునపాల చప్పుడూ... సుత్తిమోతలూ.... రాళ్ళ పగుళ్ళూ.... చల్లటిగాలి... పల్చటి ఎండా... చూస్తూ నిలబడిపోయాడు.అప్పుడే బాగా పైకొస్తున్న సూర్యుడి వెలుగు ఆ పెద్దపెద్ద జేగురురంగు రాళ్ళమీద పడి మెత్తగా జారిపోతోంది... జారిపోతున్న వెలుగులో ఆకుపచ్చ గీతలు మెరుస్తున్నాయి వాటిమీద.