పట్నంకు నలపై మైల్ల దూరంల మా ఊరున్నది. తార్నాకల బస్సెక్కినా లష్కర్‌ టేసన్ల రేల్‌గాడి ఎక్కినా గంటల మా ఊరు బోన్గిరికి బోవచ్చు. మా ఊర్లె ఒక్కటే రౌతుతోని పెద్ద గుట్ట ఉన్నది. గా దాని మీద ఖిల్ల ఉన్నది. ఖిల్ల మీదికి బోయేతందుకు కిందికెల్లి తంతెలున్నయి. ఖిల్ల మీదికి బోవాలంటె ముందుగాల పెద్ద కాన్లకెల్లి బోవాలె. ఇంతకుముందు గా కమాన్‌ ముంగట రెండు తోపులు ఉండేటియి. బంగారం, యెండి, రాగి, ఇనుముతోని గా తోపులను చేసిండ్రని పెద్దోలు జెప్పబట్కె కొంతమంది ఒక తోపును తుక్డలు జేసి గొంచబోయిండ్రు. ఇగ దాంతోని కడ్మతోపును పోలీసోల్లు గొంచబోయి అమీన్‌కచేరిల ఉంచిండ్రు.గుట్టకు పక్కపంటి తమ్లపాకు తోటలున్నయి. గుట్ట కింద హన్మంతుని గుడి ఉన్నది. గుడి ఎన్క గుండమున్నది. ఏ దినం బోయినా బోకున్నా శనివారం మా ఊరోల్లు తప్పకుంట గా గుడికి బోతరు. మా ఊర్లె ఒక దిక్కు గంజ్‌ ఉంటె ఇంకో దిక్కు ఊరున్నది. గంజ్‌ల అన్ని తీర్ల దుక్నాలున్నయి.

గంజ్‌ ఆకర్ల రేల్‌టేషన్‌ ఉంటె బహార్‌పేటల మా ఇల్లు ఉన్నది. ఇల్లంటె మాది చిన్న ఇల్లు గాదు. రెండంత్రాల పెద్ద బంగ్ల. మా బంగ్లమీద ఎక్కితె ఖిల్ల గండ్లబడేది. బంగ్ల ఎన్క పెరడు ఉన్నది. గా పెరట్ల ఉన్న చేదబాయిలకెల్లే మేము నీల్లు తోడుకునేటోల్లం. మా పెరట్ల జాంచెట్లు, బాదం చెట్లు ఉన్నయి.మా ఊరంతటికి ఒక్కటే సిన్మ తేటర్‌ ఉండంగ గది మా బహార్‌పేటలనే ఉన్నది. గా తేటర్‌ ముంగట పొలాలుండేటియి. ఆనలు బగ్గ గుర్సినపడు గవ్విట్ల వరిపంటను ఏసెటోల్లు. ఉత్తపడు గవ్వి కాలిగనే ఉండేటియి. సిన్మకొచ్చెటోల్లు మడికట్లల్ల గూసునేటోల్లు. సిన్మ షురువయ్యే ముంగట నమో వెంకటేశా, చౌద్‌వీకా చాంద్‌ హో అసుంటి రికార్డులు అద్దగంట ఏసెటోల్లు. రికార్డులు ఇని జెనం సిన్మ జూసెతందుకు ఇంట్లకెల్లి ఎల్లెటోల్లు. సిన్మ తేటర్ల నాలుగైదు గుంజలుండేటియి. జల్లి బోకుంటె గా గుంజలెన్క ఉన్న సీట్లల్ల గూసునే బాద ఉంటదని గిట్ల రికార్డు బడంగనే గట్ల మా ఊరోల్లు తేటర్‌ కాడ్కి ఉర్కెటోల్లు.