ఆఫీసునించి ఇంటికి వచ్చేసమయంలో ఆకాశంలో దట్టంగా మబ్బులు పట్టడం గమనించాను. కూరల మార్కెట్‌కి వెళ్ళాలనుకున్న నేను వర్షానికి జంకి సరాసరి ఇంటికి వచ్చేసాను. కాఫీ ఇచ్చాక, మాఆవిడతో కూరలు ఎందుకుతీసుకురాలేదో చెప్పాను.‘‘బంగాళాఖాతంలో వాయుగుండమట. ఇవాళ, రేపూ వర్షం పడుతుందని టీ.వి.లో చెప్పారు. అన్నట్లుమీ నాగమణి ఫోన్‌ చేసిందండి’’మా ఆవిడ చెప్పింది.‘‘ఏమిటి విశేషం?’’‘‘మిత్రబృందంతో కలిసి ఇవాళచెన్నైకి వెళ్ళే రైలు ఎక్కుతోందిట.తీర్ధయాత్రలకిట.’’‘‘రైలు మన ఊరి మీంచేగా వెళ్ళేది. మన సూట్‌కేసుని తెమ్మని చెప్పకపోయావా? స్టేషన్‌కి వెళ్ళి తీసుకోవచ్చు.’’‘‘అది చెప్పడానికే ఫోన్‌ చేసింది. రేపు ఉదయం ఏడున్నరకి రైలు మన ఖమ్మం స్టేషన్‌కి వస్తుంది. మిమ్మల్ని తప్పకుండా వచ్చి తీసుకోమంది.’’‘‘ ఏ రైలు? కంపార్ట్‌మెంట్‌ నంబరు....’’‘‘అన్నీ రాసుకున్నాను. నలుగురికి ఇడ్లీ, పెసరట్‌లు తీసుకు రమ్మంది.’’‘‘రేపు హోటల్‌లో కొని తీసుకెళ్లి ఇద్దాంలే.’’ చెప్పాను.నా పిన్నమ్మ కూతురు నాగమణి భర్త గోండియా రైల్వేలో పని చేస్తున్నాడు. నాలుగు నెలల క్రితం నాగమణి న్యూజెర్సీలోని ప్రిన్స్‌టన్‌లో ఉన్న తన కొడుకు దగ్గరకి వెళ్లేప్పుడు మేం అమెరికాలో కొన్న అమెరికన్‌ టూరిస్టర్‌ సూట్‌కేసుని తీసుకెళ్లింది. 

నెల క్రితమే తిరిగి వచ్చింది.మర్నాడు ఉదయం ఆరుకి సెల్‌ఫోన్‌ అలారం మోగితే నాకు మెలకువ వచ్చింది. బయట వర్షం పడే శబ్దం వినిపిస్తోంది. లేచి ముందు తలుపు తెరచి చూసాను. వర్షం రాత్రి నించి కురుస్తున్నట్లుంది. రోడ్డు ఉండాల్సిన చోట కాలువ కనిపించింది. నీరు వేగంగా ప్రవహిస్తోంది. స్కూటర్‌ని తీస్తే ఆ నీళ్ళల్లో రైల్వేస్టేషన్‌కి చేరుకోకుండా అది మధ్యలో ఎక్కడో ఆగిపోతుంది. ఎలా వెళ్లాలో పాలుపోలేదు. నిస్సహాయంగా చూసాను.‘‘నేను రాను. పోనీ గొడుగేసుకుని నడిచి వెళ్తారా?’’ అడిగింది మా ఆవిడ.‘‘డ్రైనేజీ మూతలు తెరచి ఉంటే ప్రమాదం.’’ నిరాకరించాను.‘‘నాగమణి ఆ పెద్ద సూట్‌కేస్‌ని తన వెంట ఆ యాత్రల్లో తిప్పాల్సిందేనన్నమాట.’’ మా ఆవిడ కొద్దిగా బాధపడింది.ఏడుకి స్టేషన్‌కి ఫోన్‌ చేస్తే ఆ రైలు టైముకే వస్తుందని తెలిసింది. ఎనిమిదికి నా సెల్‌ ఫోన్‌ మోగింది. నాగమణి కంఠం వినబడింది.‘‘రాలేదేంరా? మీ ఆవిడ చెప్పలేదా?’’ నిష్ఠూరంగా అడిగింది.సమస్యని వివరించాను.‘‘నాతో నాగ్‌పూర్‌లో ఎక్కి ఖమ్మంలో ఓ పెద్దాయన దిగాడు. నువ్వు రాకపోవడంతో నీకిస్తానంటే నీ ఫోన్‌ నంబరు, అడ్రసు ఇచ్చి ఆ సూట్‌కేసుని ఆయనికిచ్చాను.’’‘‘అరెరె! అతనెలాంటివాడో?’’‘‘పెద్ద మనిషిలానే ఉన్నాడు. అతనికి ఇవ్వడం తప్ప నాకు వేరే గత్యంతరం లేకపోయింది. నెల రోజులు యాత్రల్లో దాన్ని నా వెంట ఎలా తిప్పగలను?’’‘‘అదీ నిజమే.’’‘‘అది అందగానే నాకు ఫోన్‌ చేసి చెప్పు. అతను తన వ్యాపారం పని మీద ఖమ్మంలో దిగాడు. అది చూసుకుని ఇవాళ సాయంత్రమే మళ్ళీ అతను విజయవాడ వెళ్ళిపోతాట్ట. అతని సెల్‌ నంబర్‌ ఇచ్చాడు. రాసుకో...’’