‘‘రాయలమ్మ’’ అదేం పేరు!చిన్నప్పుడు చదువుకున్న శ్రీకృష్ణదేవరాయలు, హరిహరరాయలు, బుక్క రాయలు వాళ్ళ వంశంలోంచి వచ్చిన మనిషా!అదే అడిగాను రాయలమ్మని.తల అడ్డంగా ఊపి, గర్వంగా కనుబొమలు ఎగరేసి చిరునవ్వు నవ్వింది.‘‘పదహారో శతాబ్దం నాటి మాట. ఢిల్లీ పాదుషాని, తన ఏకసంథాహి తెలివితేటలతో మెప్పించి, తన సంస్కృత పాండిత్యంతో, ఆయన కొలువులో చేరిన మా ముంగండవాసి, జగన్నాథ పండితరాయులు అంటే, మా నాన్నగారికి ఎంతో గౌరవం అభిమానం. అందుకే, ఆ ఉపద్రష్ట జగన్నాథ పండితరాయలు మా ముంగండని వదిలేసి అన్ని వందల ఏళ్ళయినా, ఆ పండితుడిని మర్చిపోకుండా, మా యిళ్ళల్లో వాళ్ళకి అతని పేటని కాస్త అటూ ఇటూగా మార్చి పెడుతూండే వారు’’.రాయలమ్మ తెల్లపంచె కట్టుకుని, దాని ఓ చెఱగుని నెత్తిమీద నుంచి వేసుకుని, కుడి భుజం మీద నుంచి తెచ్చుకుని, ముందు దోపుకుంటుంది. మా చిన్నతనంతో నెత్తిమీదనున్న కొంగుని లాగేసి, అక్కడున్న గుండు మీద ఓ రెండు మొత్తులు మొత్తి వెళ్ళిపోయేవాళ్ళం. 

అయితే, రాయలమ్మ విసుక్కునేది కాదు. నవ్వుతూ, గుండు మీదకి లాక్కుని, చెవుల వెనక్కి దాన్ని దోపి, చెవుల్ని ముందుకి లాక్కునేది.పొట్టిచేతుల తెల్లరవిక, దాని మీద నుంచి, చిన్న సెనగ్జింజలంత రుద్రాక్షల వెండిలో చుట్టిన మాల జారుతుంటుంది. వేళ్ళకి దర్భముడి వెండి ఉంగరం, వెంకన్నబాబు ఉంగరం, అది కూడా వెండిదే, సమయాన్ని బట్టి, పనులని బట్టి అటూ ఇటూ మారుతుంటాయి.‘‘రాయలమ్మ ఎవరికి చుట్టం!’’‘‘ఎక్కడో దూరం.... ఆవిడకి ఎవరూ లేరట. సరే, నాక్కూడా వంటకి కావాలి కదా ఓ మనిషి... అందుకని, జీతం యిస్తుంటాం... ఆవిడ పనికి..’’అమ్మ జీతం ఇస్తూ, తన బాధ్యత అయిపోందనుకుంది.కానీ, రాయలమ్మ అనుకోలేదు. వంటపని బాధ్యత అనుకోలేదు. నా వాళ్ళకి ప్రేమతో చేస్తున్నానుకుంది. ప్రేమ ఉన్న చోట బాధ్యత మధ్యలోకి రాదు. స్కూల్లో చెప్పనివి, పుస్తకాల్లో చదువుకోలేనివి, అన్నం పెడ్తూ చెప్పేది. ఆమె మా నుంచి ఏదో ఆశించి చెప్పలేదు. ఆమె పని జీతంతో వెలకట్టలేనిది.