ఆమె పేరు రాధ! అతని పేరు రాఘవ!ఇద్దరికీ పది రోజుల పైబడి మాటల్లేవు. ఒకే గొడుగుకింద ఉంటున్నా మొహాలు చాటేస్తూ తప్పించుకొని తిరుగుతున్నారు. పొరపాటున ఇద్దరూ ఎదురుపడ్డా కళ్ళతోనే కత్తులు దూసుకుంటున్నారు. ఇద్దరూ ఎవరో కాదు మరి! దాదాపు పన్నెండేళ్ళ నుంచీ కాపురం చేసుకొంటున్న భార్యాభర్తలే! ఎవరూ వేలుపెట్టి చూపలేని అన్యోన్యమైన దాంపత్యం.కానీ కాలం ఎప్పుడూ ఒకలాగే ఉండదు కదా!పది రోజుల క్రితం ఓ ఉదయంపూట ‘‘రాధా! కొద్దిగా నా షూష్ బాగా పాలిష్ చెయ్యవా!’’ గబగబా బట్టలేసుకొంటూ అభ్యర్థనగా అడిగాడు రాఘవ. అప్పటికే రెండు రోజులుగా ఆఫీసుకులేటుగా వెళ్ళి చివాట్లు తిని ఉన్నాడు. డ్రస్‌కోడ్‌తో పాటు షూస్ కూడా పాలీష్‌తో ‘నిగనిగ’లాడుతూ ఉండటం ఆఫీసు క్రమశిక్షణలో ఓ భాగం.
చీకటితో లేచి ఇంటిముందు ముగ్గులు వెయ్యటంతో దినచర్య ప్రారంభించే రాధ పిల్లలుఇద్దర్ని స్కూలుకి పంపేవరకు రంగుల రాట్నంలా పరుగులాంటి నడకతో ఇల్లంతా తిరుగుతూనే ఉంటుంది. పులిమీద పుట్రలా ఆరోజే అన్నం ఉడుకుతుండగా గ్యాస్ అయిపోవడం, సిలిండర్ మార్చాల్సి రావడం, రెండురోజులకోసారి వచ్చే పంపునీళ్ళు కూడా అప్పుడే రావడం, నీళ్ళు బిందెలతో పట్టి ఇంట్లోకి మోసుకోవాల్సి రావడం....ఇలా ఒంటిచేత్తో అన్ని పనులూ ఆమె చేసుకోవాల్సి వచ్చింది. దాంతో అలసట, టెన్షన్‌తో రాధ విసిగి పోయింది.
అదే సమయంలో రాఘవ బూట్లు పాలిష్ చెయ్యమనడంతో, ‘మీ బూట్లు పాలిష్ చెయ్యాటానికీ, బండి తుడవటానికీ నేనేం మీ దాసీదాన్ని కాను’ అంటూ రోషంగా విరుచుకుపడింది రాధ.ఊహించని తిరస్కారం, ఆమె మొహంలోనిర్లక్ష్య భావం చూసి రాఘవ నోట మాటరాలేదు. వెంటనే తేరుకొని ‘బూట్లు తుడిచినంత మాత్రాన దాసీదానివైపోతే రోజూ ఇంట్లో నువ్వు చేసేదీ దాసీపనే! అంతకన్నా బయటికెళ్ళి నువ్వుచేసే గొప్పపనులు కూడా ఏమీలేవు కాబట్టి నిజంగా నువ్వు దాసీదానివే!’ అన్నాడు తీవ్రంగా. ఇంటా బయటా బాధ్యతలతో సతమతమైపోతున్న తన తోటి ఉద్యోగినులు ఆ క్షణంలో అతడికి గుర్తొచ్చారు. కాలు గడప బైట పెట్టని భార్య అలా మాట్లాడటం ఆ క్షణంలో అతనికి ఆగ్రహం రప్పించింది.