‘‘హాయ్‌ స్వీటీ!ఆ విషయం ఏం చేసావ్‌? ఎంత త్వరగా డిసెషన్‌ తీసుకుంటే అంత మంచిది. లవర్స్‌గా హిస్టరీ క్రియేట్‌ చేసినవాళ్ల మవుతాం. ఇంకా ఆలస్యం చేసామా.. ఏమవుతుంది?మరో వారంలో నీ పెళ్లవుతుంది. ఓ ఇల్లవుతుంది. మెల్లో తాళితో.. పెళ్లామనే కొత్త స్టేటస్‌తో... వయసుకి మించిన ఆరిందాతనంతో... నువ్వు మెరిసిపోతావ్‌. నేనూ అంతే! నువ్వు పంజాబీ డ్రస్సులోంచి చీరలోకి మారి లైఫ్‌లో వచ్చే ఏకైక ఉత్సవాన్ని అత్యంత రమణీయంగా, కమనీయంగా జరుపుకుంటుంటే... నేనూరుకుంటానా? మగాడ్ని. ఆపై మొనగాడ్ని. జీన్స్‌ నుంచీ నేనూ పంచెలోకి మారుతా. పెద్దరికమనే ఉత్తరీయం మెళ్లో వేసుకుని.. మొగుడనే మెడల్‌ కోసం పంతులుగారి ముందు మెడలు వంచేస్తా.ఆ తర్వాత షరా మామూలే! సాదీసీదా మొగుడ్స్‌ పెళ్లామ్స్‌ కహానీయే. రొటీన్‌ ధీరీ... యమ రొటీన్‌ స్టోరీ... థ్రిల్‌ లేని లైఫూ లైఫేనా.. లవర్‌ కాని వైపూ వైఫేనా...? వెనక్కి తిరిగి చూసుకుంటే.. ఒళ్లు గగుర్పొడిచేందుకు హాట్‌హాట్‌ హగ్స్‌, స్వీట్‌స్వీట్‌ కిస్సెస్‌ కొన్నయినా ఉండొద్దా?అపుడేగా.. జీవనోత్సవం పండేది. ఉత్తేజం పండుగ చేసుకునేది. చరమాంకంలో వెండిపోగుల్లాంటి మీసాలు మెలేస్తూ... ఒళ్లో కూర్చున్న మనవడికి దర్జాగా చెప్పుకునేందుకు ఓ కథైనా ఉండాలిగా... ఆ కథకిపుడే శ్రీకారం చుడదాం. లేటువయసులో ఘాటుప్రేమను తలచితలచీ థ్రిల్లయ్యేందుకు ఇపుడో ఈవెంట్‌ని ఆహ్వానిద్దాం. లైఫంతా గుండెభరిణలో దాచుకుని మరీ గుర్తుంచుకునేందుకుగాను.. ఓ మధుర జ్ఞాపకానికి జంటగా రెడ్‌ కార్పెట్‌ పరుద్దాం. పెళ్లికి ముందు వెన్వెంటనే మనమో సాహసం చేయాలి.ఆ సాహసానికిదే నా ఆహ్వానం. షెడ్యూల్‌ ప్రకారం ఈవెనింగ్‌ గోల్కొండ హోటల్‌ రూం నంబర్‌ ఫోర్‌ నాట్‌ టూలో నీకోసం వెయిట్‌ చేస్తుంటా... ఆ తర్వాత జరగబోయే కహానీ ఏంటో నీకూ తెలుసుగా....

నీ-భరద్వాజ.

లెటరంతా చదివింది కార్తీక. ఒకసారి కాదు.. పదేపదే. అతడు దేనికోసం తహతహలాడ్తున్నాడో.. దేనికోసం తపన పడ్తున్నాడో ఆమెకు అర్థమవుతూనే ఉంది. అయితే... పెళ్లికి ముందే... ఇలాటివి ఇంటావంటా లేనేలేవు. ఆ సంగతి ఎలా చెప్పాలో ఆమెకు తెలీడం లేదు.మరోసారి ఉత్తరంలోకి తొంగిచూసింది కార్తీక. ఆ ఉత్తరంలోని ప్రతి అక్షరమూ భరద్వాజ మనసుని ఏ సంకోచాలు లేకుండా సంపూర్ణంగా ఆవిష్కరిస్తూనే ఉంది. అతడేం కోరుకుంటున్నాడో అర్థంకానంత అమాయకురాలు కాదు కార్తీక. వంటికి వయసొచ్చిందనేగా పెద్దలు ఈ పెళ్లి పేరంటం చేస్తున్నారు.ఇంకెన్ని రోజులు... ఓన్లీ సెవన్‌ డేస్‌.మళ్లీ ఈ వారం తిరిగొచ్చేసరికి మెళ్లో తాళి పడ్తుంది.మిస్‌ని మిస్‌ చేస్తూ.. మిసెస్‌గా మారిపోతుంది.అపుడు సంకేతస్థలాలు ఏకాంతాల కోసం వెంపర్లాడక్కర్లేదు. మాటిమాటికీ సెల్‌లో షార్ట్‌ మెసేజ్‌లు పంపక్కర్లేదు. ఒకే ఒక్క కౌగిలంటూ వెనుకెనుక తిరుగుతూ బతిమాలక్కర్లేదు. గోరుముద్ద కోసం, సంగోరు ముద్దుకోసం బిచ్చగాడిలా అడుక్కోనక్కర్లేదు.