ఉదయం ఎనిమిది గంటలు. సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఈశ్వరరావు డ్యూటీకి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు. స్నానం చేసి, బ్రేక్‌ ఫాస్ట్‌ కానిచ్చాడు. తర్వాత యూనిఫారం వేసుకుని, సోఫాలో కూర్చొని వంగి షూ వేసుకుంటున్నాడు. ఇంతలో ఆయన భార్య లలిత కాఫీ కప్పుతో రావడం చూసి ‘‘ఇప్పుడొద్దోయ్‌, త్వరగా వెళ్లాలి’’అన్నాడు.‘‘ఏంటంత హడావుడి, కాఫీ కూడా తాగకుండా’’ చిరాగ్గా అంది లలిత.‘‘ఎలక్షన్లోయ్‌. ఇంకో రోజులయితే గాని మాకీ హడావుడి తగ్గదు’’ అన్నాడు లేచి నిల్చుంటూ.ఈశ్వరరావు ఎనిమిదేళ్ల కొడుకు ఆశ్రిత్‌ అక్కడే కూర్చొని గట్టిగా చదువుకుంటున్నాడు. ‘మ్యాన్‌ ఈజ్‌ ఎ సోషల్‌ బీయింగ్‌’అని ‘‘నాన్నా! దీనర్థం ఏంటి!’’ అనడిగాడు.‘‘మానవుడు సంఘజీవి అని’’ చెప్పి, ‘‘లలితా, నేను వెళ్తున్నాను. ఎలక్షన్‌ టైం కాబట్టి నేనెప్పుడొస్తానో నాకే తెలీదు. నువ్వు భోంచెయి. నాకోసం చూడొద్దు’’ అన్నాడు.‘‘నాన్నా! సంఘజీవి అంటే ఏమిటి?’’ ఆశ్రిత్‌ మళ్లీ అడిగాడు.‘‘ఒరేయ్‌ నాన్నా! నేను త్వరగా వెళ్లాలిరా. నన్ను చంపకు, మీ అమ్మను అడుగు, ఓపిగ్గా చెపుతుంది’’ అంటూ లోపలికి వెళ్లి రివాల్వర్‌ తీసుకుని బయటికొచ్చాడు.‘‘నువ్వు రోజూ రివాల్వర్‌ ఎందుకు తీసుకెళ్తావు నాన్నా!’’ మళ్లీ ప్రశ్న.‘‘రక్షణ కోసం’’.‘‘అది నీకు రక్షణ కల్పిస్తుందా’’అనుమానంగా చూస్తూ అడిగాడు ఆశ్రిత్‌.‘‘నన్నొదిలేయరా బాబూ. నీ అనుమానాలన్నీ తర్వాత తీరుస్తాను’’ అంటూ హడావుడిగా బయటకు నడిచాడు. అప్పటికే డ్రైవర్‌తో సహా బయట జీపు సిద్ధంగా ఉంది.

వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ కొచ్చేసరికి పోలీసులు, ఇతర జనంతో అక్కడంతా హడావుడిగా ఉంది. ఈశ్వరరావు లోపలికి వెళ్లి సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ను పిలిచి ‘‘మనవాళ్లందరూ ఎలక్షన్‌ డ్యూటీకెళ్తున్నారా, ఎవరెవరు ఎక్కడికి వెళ్లాలో చెప్పావా’’ అని అడిగాడు.‘‘ఆర్డర్స్‌ ఇచ్చేసాను సార్‌ అందరికీ . కొన్ని విలేజెస్‌కు రోడ్డు సరిగా లేదు. టూవీలర్స్‌ మీద వెళ్లాలి’’ అన్నాడు ఎస్సై శ్రీనివాస్‌.‘‘సరే, టూ వీలర్స్‌ మీదే వెళ్లమను. ఎలక్షన్‌ డ్యూటీకి వెళ్తున్న ఎంప్లాయీస్‌ బస్సులలో సెక్యూరిటీగా వెళ్తున్న వారి లిస్టు ఉందా’’ అడిగాడు.‘‘ఉంది సార్‌. చూపిస్తాను.’’ఇంతలో ఒక కానిస్టేబుల్‌ లోపలికి వచ్చి సెల్యూట్‌ చేసి నిల్చున్నాడు.ఈశ్వరరావు అతని వంక చూసి ‘‘చెప్పు, ఏం కావాలి’’ అడిగాడు. ఇన్‌స్పెక్టర్‌ అతనిని చూసి ‘‘అరే, మళ్లీ వచ్చావా! చెప్తే వినిపించుకోవేం’’ అని గట్టిగా అరిచి ఈశ్వరరావుతో ‘‘సార్‌, ఇతడు ఏజన్సీ ఏరియాలోని నాగారం విలేజికి వెళ్లాలి. టూ వీలర్‌పై వెళ్లమంటే వె ళ్లనంటున్నాడు. ఏదైనా బస్సులో వెళ్లే ఎలక్షన్‌ డ్యూటీ ఆఫీసర్స్‌కి సెక్యూరిటీగా వెళ్తా అంటున్నాడు’’ అన్నాడు. ఈశ్వరరావు అతన్ని చూసి ‘‘నాగారం ఎందుకు వెళ్లవు’’ అనడిగాడు. అతను నసుగుతూ ‘‘సార్‌! ఆ వూరికి రోడ్డు సరిగ్గా లేదు. టూవీలర్‌ పైననే వెళ్లాలి. నాతో పాటు ఇంకొకరే ఉంటారు. అందుకని భయం సార్‌!’’