ప్రశాంతంగా సాగుతున్న నా జీవితంలో రంగూన్‌ రౌబ్డి సిన్మా ఓ చిచ్చు రేపింది. అపడు నేను నాల్గో తరగతి చదూతుండాను. మా ఎమ్‌.ఎమ్‌.ఎల్‌.డబ్లూ. ఎలిమెంట్రీ బళ్లో మనకున్నంత గౌరం ఇంకోడికుండేది కాదు.ఎందుకంటే నా పైన అటు అయిదో తర్గతిలో గాని, నా కింద ఇటు మూడు రెండు ఒకటో తర్గతులలో గాని నెల్లూర్కెళ్లొచ్చినోడు ఎవ్డూ లేడు నేన్తప్ప. మా బళ్లో నేనొక్కడ్నే నెల్లూర్‌ రిటాన్డ్‌. అట్టాంటి నా గౌరవాన్ని ఈ రంగూన్‌ రౌబ్డి సిన్మా దెబ్బదీసింది. ఎట్టాగంటారా, మా బడేమో చెర్లోపల్లెలో వుంది. ఆణ్ణించి రెండు మైళ్లు నడిస్తే తల్పూరొస్తుంది. ఆణ్ణించి మూడుమైళ్లు నడిస్తే కల్చేడొస్తుంది. ఆ వూళ్లో వుంది శీ కన్కదుర్గా టూరింగ్‌ టాకీస్‌. ఏ సిన్మా అయినా, దేశమంతా ఆడిన తర్వాత చివరాఖర్న ఈ కల్చేడ్‌ హాల్కొస్తుంది. ఈ తేప ఈ రంగూన్‌ రౌబ్డి సిన్మా కొంచెం ముందుగానే ఈ హాల్కొచ్చింది. దీన్ని నా ఎగస్పార్టీ ఎంకటాద్రిగాడు సూసేసినాడు. సూసినాడు గమ్ముగుండొచ్చుగదా. ఆహా, గమ్ముగా ఆడెందుకుంటాడు. నన్నెట్టా దెబ్బదియ్యాల్నా అని ఇరవైనాలుగ్గంటలూ ఆడికి మనియాదైతేనూ.మా మాలకొండయ్యోరు ఉదయం మూడోగంట గొట్టిం తర్వాత బళ్లో కొస్తాడా, వచ్చీ రావడంతోనే ఓ పిల్లోడ్ని పిల్చి ఈరయ్య హోటేల్కి పంపి దోసెల్దెప్పించుకొని తింటాడా, ఆ పైన రెండు కాళ్లూ బెంచిమీద పెట్టి ‘నా మది నిన్ను బిల్చింది గానమై’ అని పాడ్తా పాడ్తా గంట నిద్దరోతాడా, మళ్లీ మద్దినేల కూడా ఇదే ఇదంగా ఓ గంట సేపు నిద్దరోతాడు. 

ఎపడు సూడు ఇదే పాట. ఏ పొద్దన్న వేరే పాట పాడ్న పాపాన బోల. ఈ అయ్యోరు అట్టా నిద్దర్లోకి జారగిలడం మొదలు ఈ ఎంకటాద్రిగోడు ఆడంగుల్నందర్నీ పోగేస్కొని రంగూన్‌ రౌబ్డి సిన్మా కథలు కథలుగా చెప్పడం ఆరంభిస్తాడు. అంతట్తో ఆగినాడా, పాటలు పాడ్డం, స్టెపలెయ్యడం. అది ఎంత పెద్ద కథోగాని పెతీరోజూ ఆడ్కిదే పని. అపడ్దాకా నా ఎంబడి దిర్గే ఆడంగుల్లో ఒక్క ఆడ్ది కూడ ఇప్పుడు నా పక్కన లేదు. అంతెందుకు నిన్నట్కి నిన్న నా తోకలాగ దిర్గే భారతి ‘ఇట్రామేయ్‌’అని పిలిస్తే అదేమనిందో తెల్సా, ‘ఏయ్‌ ఎందుకు నేన్రాను’ అనింది. అదట్టా అంటున్నపడు ఎంకటాద్రిగాడు నావైపు నవ్వుతూ సూసిండు సూడూ, ఛీ ఛీ ఆడజాతి బుద్ది సూపించింది. ఈ అగమానాలు భరించడం ఇక నా వల్లగాదు, నేను ఎట్టాగో అట్టాగ అర్జెంటుగా రంగూన్‌ రౌబ్డి సిన్మా సూసి నా ఇమేజ్‌ని కాపాడు కోవాలన్కొన్నాను.