అతనికి నలభై ఉండొచ్చు. ఐనా ఇంకా కుర్ర నవాబులా వున్నాడు. నవాబులుసలాములు అందుకుంటారే తప్ప ఎవరికీ సలాములు చెయ్యరు. నవాబీ అహంకారమే వారికి గొప్ప అలంకారం. అందుకే తన పనిమీదే నా మేరిటల్ కౌన్సిలింగ్ ఛాంబర్లోకి అడుగు పెట్టినా నాకు మర్యాదకోసమైనా విష్ చేయకుండానే దర్జాగా నా ఎదురుకుర్చీలో ఆశీనుడయ్యాడు- నాలాటి బడా నవాబు నీ క్లయింట్‌గా రావడమంటే పెంకులు, పెచ్చులూడిపోయిన కుచేలుడి డొక్కు ఇంటికి స్వయంగా శ్రీకృష్ణపరమాత్ముడే వేం చేయడంలాటి అరుదైన గౌరవం తెల్సా! అన్నట్టు దర్పంగా చూస్తూ. వేళ్ళకి ఒకోటీ పావుకేజీ తూగే రాక్షస ఉంగరాలు, లక్షలు విలువ చేసే డైమండ్‌వాచీ, ఛాతీపై పిడకంత పులిగోరుపతకం, షర్ట్ జేబులో నిండు గర్భిణిలాంటి పర్స్. అదితెచ్చే మర్యాద లెరుగని వొగరూ, పొగరూ! ఎన్నిరకాల సెంట్లు కలిపి కొట్టాడోగానీ గదంతా వికారంగా అలుము కుంటున్న ఖరీదైన గబ్బుకంపు!ఇలాటి ఘనులకి సమస్యా? చల్లకొచ్చి ముంతదాచనేల ఘనుడా? నీ సమస్యేమిటో విప్పు మరి అన్నట్టు చూసాను. పోయింది- అన్నాడు సీలింగ్ వంకచూస్తూ. యేవిటి, మనసా? అన్నాను. కాదు, నా మొగతనం! అన్నాడు ఆ మర్రిచెట్టు మానంత మొగాడు.
పచ్చనిచేలో పడిమేస్తూ తప్పిపోయిన గేదెలాటి ఇతగాడి మొగతనాన్ని నేను వెదికి పట్టుకొచ్చి ఇవ్వాలికాబోలు! శాపవశానో ఖర్మవశానో మొగతనం పోగొట్టుకుని ఆడవాళ్ళుగా మారిపోయి, మొగాళ్ళతో కాపురాలుచేసి కడుపులు తెచ్చుకున్న పురాణ పురుషుల విచిత్రగాఽథలు కొన్ని చదివి వున్నాను. అంతకన్నా ఇంట్రెష్టింగ్ కథలు లోకంలో ఏముంటాయ్. ఇప్పుడీ దివ్య పురుషుడు తన మొగతనం పోగొట్టుకున్న విధం బెట్టిదో వినవలెనని నాకూ కుతూహలం పెరిగి నైమిశారణ్యంలో సూతమహర్షి చెప్పే పురాణగాధల్ని వినడానికి వినయంగా కూర్చున్న శౌనకాదిఋషుల్లాగ అటెన్షన్లో కూర్చున్నాను.మాది చాలా పెద్ద లేండ్‌లార్డ్స్ ఫామిలీలెండి. పొలాలు, తోటలు, రైస్‌మిల్లులు, పెట్రోల్ బంకులూ చాలావున్నాయ్. జీవితాన్ని జల్సాగా చిత్తుగా అనుభవించడం తప్ప మరో బాధ్యతలేదు. నా పెళ్ళాం రంభని మించిన గొప్ప అందగత్తెలెండి. పెళ్ళాం యెంత అందగత్తెఐనా జీవితమంతా రోజూ ఆ వొకర్తెతోనే గడపటం కన్నా పెద్దబోర్ ఏముంటుంది. కంచంలోనూ మంచంమీదా రోజూ కొత్తకొత్త రుచులు చవి చూస్తుండకపోతే ఆ లైఫ్ శుద్ధ వేష్ట్ కదా! ఆ థ్రిల్‌కోసమే మా జీడిమావిడి తోటలోనే లక్షలు పోసి, ఓ లగ్జరీ ఫాం హౌజ్ కట్టించా. డబ్బుకి పడిపోయే ఆడవాళ్ళని నా ఫాంహౌస్‌కి తరలించేందుకు నాకు సీక్రెట్ ఏజెంట్సే వున్నారు. యెవర్తీ దొరకని రోజున అవసరానికి ఇంటి రంభ వుండనే వుంది. ఇప్పటిదాకా నా ఫాంహౌస్‌లో నా చిలక కొట్టుడు వ్యవహారాలకి ఏ ఆటంకమూ ఎదురుకాలేదు.
కానీ నెలకిందట ఓ రోజు ఎడారి ప్రయాణం మధ్యలో ఇంజన్‌చెడి కారు ఆగిపోయినట్టు నా మొగతనం మొరాయించి పని చెయ్యనని మొండికేసింది. నాటి నుండి నేను కలవని డాక్టర్లు లేరు. చేయించని టెస్టుల్లేవు. వాడని చిట్కాలు, వయాగ్రాలూ లేవు. ఐనా ఫలితం ఏమీలేదు. శారీరకంగా లోపం ఏమీలేదు పొమ్మన్నారు డాక్టర్లు. నాకేం జరిగింది? నేను నపుంసకుడ్ని ఐపోయానా? ఇక నా బతుకింతేనా? మీరేం చేస్తారో నాకు తెలీదు. మీకెన్ని వేలు,లక్షల ఫీజు కావాలో తీస్కోండి. కానీ నేనెప్పట్లా తయారవ్వాలి! ఇది నా జీవన్మరణ సమస్య అన్నాడు. అది అభ్యర్థనలా లేదు. తన ఆస్థాన వైద్యుడికి నవాబు ఇచ్చిన హుకుంలా వుంది. ఎటోపోయిన అతని మొగతనాన్ని తిరిగి రప్పించలేకపోతే నా తల తీయించి తన ఫాంహౌస్ గుమ్మానికి వేలాడదీయిస్తాడు కాబోల్రా దేవుడా అనుకున్నాను.