పాత రోజుల్లో ఫోన్‌ చేయగానే ‘ఎలా వున్నారు?’ అని మొదటి ప్రశ్నగా ప్రారంభించి ఆనక మిగిలిన విషయాలు విశేషాలు మాట్లాడుకునేవాళ్లు. సెల్‌ఫోను వచ్చాక ‘ఎలా వున్నావ్‌’ అనే ప్రశ్న మర్చిపోయి ‘ఎక్కడున్నావ్‌’ అని అడగడంతో ఆరంభిస్తున్నారు సంభాషణ. ఉభయకుశలోపరి ఉభయులకూ అంత ముఖ్యమైన విషయం కాకుండా పోయింది.ధర్మరాజు నాకు ఎక్కడ తారసపడినా ‘‘మీ బ్యాంకులో డిపాజిట్ల మీద రేటాఫ్‌ ఇంటరెస్ట్‌ ఏమైనా పెంచారా’’ అనేది మొదటి ప్రశ్న. ఆనక ఆర్థిక ఇబ్బందులు, పెరిగే ధరలు, పెరగని వడ్డీరేటు, చాలని పించన్లు వగైరా వగైరా. అలా అడగడం తప్పని కాదు కానీ కన్పించిన ప్రతిసారీ, అదీ వరుసగా వారం రోజులు తటస్థపడితే ప్రతిరోజూ అదే ప్రశ్న అడగడం, బ్యాంకుకు వచ్చినప్రతిసారీ అదీ సందేహాన్ని తెలియపర్చడం నాకు అసహజంగా అనిపిస్తుంది, అసహనం కలిగిస్తుంది. అయినా పాఠక దేవుళ్లు, ఓటరు దేవుళ్లు, కస్టమర్‌ దేవుళ్లు అని మనుషుల్ని ఏకంగా దేవుళ్లని చేసేశారు. అవసరాలు తీర్చుకోవటం, అక్కరలు గడుపుకోవటంలో ఆరితేరిన నేర్పరులు. అందుకే ‘సహనమేవ జయతే’ అని మనసులోనే అనుకుని, ఆయనకు సమాధానం చెప్పటం అలవరచు కున్నాను. 

నేను చేసే ఉద్యోగానికి కేవలం ఉద్యోగి లక్షణాలే కాక వ్యాపారస్తుడి లక్షణాలు కూడా మేళవించి ఉండాలని నా వ్యక్తిగత అభిప్రాయం.ధర్మరాజు నాకు బంధవూ కాదు, మిత్రుడూ కాదు. కేవలం పరిచయస్థుడు. ఉద్యోగరీత్యా మా బ్యాంకు ఖాతాదారుడు. మా ఇద్దరి సంబంధం అంతే. వచ్చినప్పుడల్లా వడ్డీరేట్ల వివ రాలు ఆయన అడగటం, తగిన రీతిలో నేను సమాధానం చెప్పటం ఓ రివాజుగా మారింది.అసలుకంటె వడ్డీ ముద్దు అని సామెత. నిజానికి ఈ సామెత పిల్లలకు, పిల్లల పిల్లలకు సంబంధించిందే అయినా డబ్బుల విషయంలో కూడా పాపం ఈ సూత్రానికి ప్రాధాన్యాన్నిచ్చే చాలామంది అమాయకులు, ఆశాపరులు ఎక్కువ వడ్డీ వస్తుందని, ఎవరికిబడితే వారికి, ఎక్కడ పడితే అక్కడ డ బ్బు మదుపు చేయడం, వడ్డీతోపాటు అసలు కూడా పోగొట్టుకుని కుమిలిపోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం చేస్తున్నారు. ఇలాంటి వారికి ఎర వేసి ఎక్కువ మొత్తాల్లో డబ్బు పోగేసుకుని, పారిపోయే వారి సంఖ్య రానురానూ పెరిగిపోతున్నది.పాపం ధర్మరాజుని ప్రత్యేకంగా ప్రస్థావిస్తున్నానుగాని చాలామంది ఈ ప్రశ్న వేస్తూనే వుంటారు. ప్రజలు దాచుకునే డబ్బుల మీద బ్యాంకువారు ఇచ్చే వడ్డీరేట్టు, ప్రజలకు బ్యాంకులు ఇచ్చే ఋణాల మీద వసూలు చేసే వడ్డీరేట్లు... ఉద్యోగ వేళలన్నీ వీటితోనే ముడిపడి వుండటంతో, ఆ సమయం అంతా ఖర్చులు, జమలు, లాభాలు, నష్టాలు, అసలు, వడ్డి, వాయిదా సొమ్ములు వగైరాల్తో గడిచిపోతుంది. నాకు తెలిసిన రేటాఫ్‌ ఇంటరెస్ట్‌ అదే. కానీ మరో ఉద్యోగం చేస్తున్న నా మిత్రుడు వెంకట్రావ్‌ చెప్పిన రేటాఫ్‌ ఇంటరెస్ట్‌ విని విస్మయం చెందాను.