‘‘పెళ్లివారు వచ్చినట్టున్నారే’’ పార్వతితో అన్నాడు రామారావు చెపలు, వరండాలో విడుస్తూ!గబగబా లోపల్నుంచి మంచినీళ్ల గ్లాసు పట్టుకువస్తూ,‘‘ఆ పొద్దున్నే వచ్చారు!పెళ్లికూతురు కుందనపు బొమ్మలా ఎంత బావుందో!’’ అంది పార్వతి.మంచినీళ్లు తాగి, చొక్కా విప్పి పక్కనే కొక్కానికి తగిలించి,పడక కుర్చీలో జారగిలపడ్డాడు.‘‘పోస్టాఫీసుకెళ్లి ఉత్తరం పోస్టులో పడేసి రావటానికి కూడా ఓపిక లేనట్టుగా వుందే పార్వతి!’’ ఉస్సూరుమంటూ ముందుకు వంగాడు.‘‘అయిదయినా ఎండ తగ్గితేగా! అలసటగా ఉందా! ఏమన్నా చేసి పెట్టనా! ఆకలేస్తోందా?’’ అంది పార్వతి రామారావు పక్కకు వచ్చి.‘‘అబ్బే ఏం వద్దు! మళ్లీ నువ్వేం చేస్తావులే! దా, ఇలా కూర్చో!’’ పక్కనున్న కుర్చీ లాగబోయాడు.‘‘వద్దండి! కిందే కూర్చుంటాను!’’ అంటూ గోడకి ఓ పక్కగా కూర్చుని చీర చెంగుతో అటు ఇటూ విసురుకోవడం మొదలుపెట్టింది.‘‘అయ్యో! నా మతిమండ! పక్కింటి వాళ్లు మిఠాయిలు, సున్నుండలు, జంతికలు పంపారు, అవి పెడతానుండండి’’ అంటూ లేవబోయి మళ్లీ ఏదో గుర్తుకు వచ్చినట్టు చటుక్కున ఆగింది ఆమె.‘‘సున్నుండలా!’’ నోరూరింది అతనికి. అంతలోనే తెలియని బాధ అతని కళ్లలో కదలాడింది.‘‘వద్దు పార్వతి! కొత్త రోగం వచ్చింది కదూ! బి.పి.కి చెల్లెలు షుగరు తోడయ్యిందిగా’’ తనలో తాను అనుకున్నట్టుగా అన్నాడు.పార్వతికి తన మీద తనకే కోపం వచ్చింది. 

రామారావుకి సున్నుండలు ఎంతిష్టమో ఆమె ఎరగంది కాదు.‘‘పొరపాటున నోరు జారేను’’ అనుకుని మనస్సులో బాధపడింది. ‘‘ఇష్టమైంది ఎదురుగా పెట్టుకుని తినలేకపోవడం ఏ మనిషికైనా ఎంత బాధాకరం! పాడురోగం! ఈయనకే రావాలా’’ మళ్లీ ఉక్రోశంగా అనుకుంది, తనలో తానే! రామారావుకి సున్నుండలు అంటే పంచ ప్రాణాలు. చిన్నప్పటి నుంచి అవంటే అతనికి చాలా ఇష్టం! అతని కళ్లముందు తన బాల్యం కదలాడింది.్‌ ్‌ ్‌‘‘అమ్మా! మంచి వాసనే! నిజం చెప! సున్నుండలు చేసావు కదూ! నాకు పెట్టవా!’’ జారి పోతున్న నిక్కర్ని పైకి లాక్కుంటూ రామారావు తల్లిని ఆశగా అడిగాడు.‘‘భడవా! పట్టావా వాసన! అనుకుంటూనే ఉన్నాను’’ అంటూ అనసూయ నవ్వి లోపల్నుంచి రెండు ఉండల్ని పట్టుకొచ్చి కొడుకు చేతిలో పెట్టింది.చటుక్కున రెండు ఉండల్ని ఆత్రంగా మింగేసి, ‘‘అమ్మా! ఇంకా పెట్టవే’’ అంటూ తల్లిని పట్టుకుని కొంగులాగాడు.‘‘ఓర్నీ అపడే మింగేసావా! ఇంక లేవురా నాన్న! నాన్నగారికి రెండు ఉండలే దాచాను’’ అంది అనసూయ.‘‘నాక్కావాలి! నాకింకా కావాలి!’’ అంటూ నేలమీద పొర్లడం మొదలుపెట్టాడు రామారావు.‘‘ఏమిట్రా గొడవ!’’ అక్కయ్యలిద్దరూ వాడ్ని పట్టుకుని లేవదీసారు. అయినా వినకుండా నేలను కాళ్లతో బలంగా తన్నుతూ మారాం చేయసాగాడు రామారావు.‘‘పోనీలేవే అమ్మా! వాడికి ఒక్క ఉండ ఇవ్వవే!’’ చిన్నది కమల అర్థింపుగా తల్లితో అంది.