మొత్తానికి పెళ్ళి అయిపోయింది. నాకు ముప్ఫై అయిదేళ్ళు. లతకి ముప్ఫై రెండు. అసలు పెళ్ళి అవుతుందో, అవదోనన్న సందేహం తీరిపోయింది. అమ్మ రెండున్నరేళ్ళు వెతికింది పెళ్ళి సంబంధాల కోసం. ఇప్పుడు మరో సందేహం.ఉద్యోగం వచ్చి పదేళ్ళయింది. కెరియర్‌ అనీ, ఉద్యోగంలో స్థిరపడాలనీ... అమ్మ మాట తోసిపుచ్చటం పెళ్ళి ఆలస్యం అవటానికి కొంత కారణం. ఓ స్థాయి వచ్చాక, ఇంక పరవాలేదనిపించి, పెళ్ళి దృష్టితో చూస్తే, చుట్టూ రకరకాలు. పెళ్ళయిన మర్నాటినుంచి ఏడాదిలోపే విడిపోయిన జంటలు ఎన్నో... కొన్ని కారణాలు బయటికి తెలుస్తున్నాయి. కొన్ని కారణాలు వాళ్ళవరకే. మనస్సుల్లోనే ఉండిపోతున్నాయి. సరైన వయసులో పెళ్ళయితే... ఆ లేలేత ఉద్వేగంలో చాలా సర్దుబాటు అవుతాయేమో. ఇప్పుడు ఎన్నిరకాల సంఘర్షణలో, అన్నిరకాల తొందరపాట్లు. ఎప్పుడు ఏ మాట, ఏ ప్రమాదం తెస్తుందో తెలియదు.‘ముప్ఫై ఏళ్ళకేనా పెళ్ళి అయితే, వెంటనే పిల్లలు పుట్టినా, మీకు అరవై వచ్చేటప్పటికి వాళ్ళ చదువులైనా పూర్తవుతాయి. వీలున్నంత తొందరగా పెళ్ళిళ్ళు చేసుకోవాలి అని అమ్మ ఎన్నోసార్లు అంది. అరవై దాటిన వయసు, ఓ చిత్రమైన కొలబద్ద ఆవిడకి. ఇదే కాదు, ఆవిడ ముఖ్యమని భావించి చెప్పిన చాలా విషయాలు అప్పుడు నా ఆలోచనకి పట్టలేదు.

 ఇప్పుడో చిత్రమైన సందేహం. లతతో ఏరకంగా ఏ తీరంలో మాట్లాడాలో తెలియని సందేహం.లత నాకన్నా చిన్నది అనిపించటం లేదు. ఎందుకో ఆ భావన... బహుశా ఉద్యోగ వాతావరణం వల్లేమో... అక్కడి వాళ్ళ ప్రవర్తన వల్లేమో. కేవలం అదే కాదు. మనుషులమాట, వ్యవహారాల్లో చాలా మార్పు. చాలామంది ఆడా మగా మృదుత్వం లేని, ఓ ఖచ్చితమైన వ్యవహారశైలిలోనే వెలుగుతున్నారేమో అనిపిస్తోంది.భార్యంటే భయంలేదు, కానీ ఓ రకం జంకు వుంది. ఏది ఎలా మాట్లాడితే నొచ్చుకుంటుందేమోనన్న జంకు. లత చాలా పెద్దమనిషి తరహాగా ఉండటం, కొత్త కాపురం ఇంకా పదో రోజుల్లోనే ఉండటం కూడా కారణమేమో?కానీ తల్లి ఊరునుంచి రాకముందే ఆ వ్యవహారం మాట్లాడటం అవసరం. తమిద్దరికీ ఏ ఇబ్బందీ లేకుండా ఉండేలానే ఆవిడ ఈ ప్రయాణం పెట్టుకుంది.‘అప్పుడు అమ్మ చేసినట్టే చేస్తే... ఎలా వుంటుంది?’తను ఉద్యోగంలో చేరిన కొత్త. మొదటిసారి అమెరికా వెడుతున్నాడు. పెళ్ళికాని, వయసులో ఉన్న కుర్రాడిగా... అమ్మకి తనమీద ఎన్నోరకాల బెంగలు. సూటిగా చెప్పలేక... ఓ మేగ్జయిన్‌ చూడమని ఇచ్చింది. అందులో బుక్‌మార్క్‌ పెట్టి వుంది. కండోమ్స్‌ని హోటల్స్‌ రూమ్స్‌తో సహా అన్నిచోట్లా అందుబాటులో ఉండేలా చూడాలని హెల్త్‌ మినిస్టర్‌ వెలిబుచ్చిన అభిప్రాయం ఉన్న పేజీ, ఆ అమ్మ బెంగ తనని నిబ్బరంగా వుంచింది. ఇంతవాణ్ణి చేసింది. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంచింది. అటువంటి అమ్మ గురించి లతతో మాట్లాడాలి.