జిజియా, కమలాకరం మద్రాసు నుంచి వచ్చే రైల్లో దిగారు. మద్రాసులో ఒక కాలేజీలో కమలాకరం ప్రొఫెసరు. ఆ కాలేజీలోనే జిజియా ఆనర్సు పరీక్ష చదివింది.కాలేజీ సారస్వత సంఘానికి జిజియా సెక్రటరీ, కమలాకరం ప్రెసిడెంటు. ఈ విధంగా వాళ్ళిద్దరికీ స్నేహం కలిగింది. వాళ్ళిద్దరికీ స్నేహం కలగటానికి మరొక కారణం కూడా వుంది. ఇద్దరూ ఒక తాలూకానుంచే వచ్చారు. ఇద్దరి గ్రామాలూ దగ్గరే.సారస్వత సంఘం పనుల్లో వాళ్ళు తరచు కలుస్తూ వుండేవారు. అనేక విషయాలను గురించి చర్చించుకుంటూ వుండే వారు. వాళ్ళస్నేహం అందరి స్నేహం వంటిది కాదు. అన్ని విషయాల్లోనూ యిద్దరూ ఒకే విధంగా ఆలోచించే వారు.ఇద్దరికీ సంఘసేవ చెయ్యాలనీ, భారతదేశంలో వున్న దారిద్య్రం పోగొట్టి ప్రజలను బాగుచెయ్యాలనీ అభిలాష వుండేది.‘‘చదువు పూర్తి అవగానే సంఘసేవ చేస్తాను’’ అనేది జిజియా.‘‘దేశం అంతా ఇలా అల్లకల్లోలంగా వున్నప్పుడు ఏమీ అంటనట్టు ఉద్యోగం చేసుకుంటూ కూర్చోవటం నాకు ఏమీ బాగా లేదు’’ అనేవాడు కమలాకరం.‘‘మరి ఏం చేస్తారు?’’‘‘ఉద్యోగానికి రాజీనామా పెడదామనుకుంటున్నాను’’.వాళ్ళిద్దరిలో ఒకరు మహమ్మదీయులు. ఒకరు హిందువులు. అయినా వాళ్ళ ఆలోచనలకు మతం ఎప్పుడూ అడ్డు వచ్చేది కాదు. భారతదేశం దాస్యంలో, దారిద్య్రంలో వుండటం వల్ల మహమ్మదీయులూ కష్టపడుతున్నారు. హిందువులూ కష్టపడుతున్నారు. ప్రత్యేకం మహమ్మదీయులకి సహాయం చెయ్యాలి అనుకోటంగానీ, ప్రత్యేకం హిందువులకే సహాయం చెయ్యాలి అనుకోటం గానీ వీళ్ళకి బొత్తిగా అర్థమయ్యేది కాదు. సహాయం ఎవళ్ళకి అవసరమో వాళ్ళకి చెయ్యాలి.

 హిందువులలోను, మహమ్మదీయులలోను ధనవంతులున్నారు. ఈ ధనవంతులు వాళ్ళ వాళ్ళ మతాలలో వున్న బీదవాళ్ళని దోచుకుంటూనే వున్నారు. కాబట్టి భారతదేశాన్ని బాగుచెయ్యాలంటే మత దృష్టితో చూడటం వల్ల లాభం లేదు, అన్ని మతాల్లో వున్న బీదవాళ్ళకి సహాయం చెయ్యగలిగినప్పుడే మొత్తం దేశం బాగుపడుతుంది - అనుకుంటూ వుండేవారు.రైలు స్టేషన్‌లో దిగగానే వాళ్ళ మనస్సులు ఇటువంటి ఉత్తమమైన ఆలోచనలతో తొణికిసలాడుతున్నాయి. వారి వారి గ్రామాలకి వెళ్ళటానికి వారు విడిపోవలసిన సమయం వచ్చింది. స్టేషన్‌ దగ్గర నుంచి కమలాకరం గ్రామం వెళ్ళాలంటే బస్సు మీద ఇరవై మైళ్ళు వెళ్ళాలి ఉత్తరంగా. జిజియా గ్రామానికి పదిమైళ్ళు వెళ్ళాలి దక్షిణంగా.ఇప్పుడు వారు కొత్తగా మాట్లాడుకోవలసిన సంగతులేమీ లేవు. ఏమయినాసరే సంఘసేవకి తమ జీవితాలని అర్పించాలనే సంకల్పాన్ని మళ్ళీ వొకసారి పునశ్చరణ చేసుకున్నారు.‘‘సెలవు’’ అన్నది జిజియా.‘‘మళ్ళీ ఎప్పుడు కనపట్టం?’’ అడిగాడు కమలాకరం.దీనికి వెంటనే జవాబు చెప్పలేక పోయింది జిజియా.‘‘ఇక మా వూళ్లోనే ఉంటాను’’ అన్నాడు కమలాకరం.‘‘మరి ఉద్యోగమో!’’ అన్నది జిజియా.‘‘మా వూరి నుంచే రాజీనామా పంపిస్తాను. కష్టమో, నిష్టూరమో నేను నిశ్చయించుకున్నాను - ప్రజల సుఖం కోసం నా జీవితం అంకితం చేస్తాను’’ అన్నాడు కమలాకరం.