ముసురు మూడు రోజులనుండి. ఎడతెరిపి లేకుండా సన్నని వాన.జలుబు చేసిన ముక్కుల్లా నల్లటి తెల్లమబ్బులు. చరా చర జీవరాసులూ విశ్రాంతి తీసుకొంటున్నట్టు వుంటున్నవి. అత్యవసరమయితే తప్ప బయట ఎవరూ తిరగడం లేదు. సన్నటి వానయినా భయకంపితుల్ని చేసే ఉరుములు, మెరుపులు.అట్లాంటి ఒక చీకటి రాత్రిలో...ఊరికి దూరంగా, కొండకు దగ్గరగా ఓ రావిచెట్టు కింద పూరిగుడిసె. ఆ గుడిసెలో రెండు ప్రాణాలు. ఒక ప్రాణం దేహాన్ని వొదిలి వెళ్ళడానికి క్షణాలు లెక్కిస్తున్నది. నిస్సహాయంగా నిరాశా నిస్పృహలతో మరోప్రాణి కన్నులార్పకుండా పోయే ప్రాణం మూల్గులు వింటున్నది. పోవడానికి సిద్ధంగా ఉన్న ప్రాణం ఒక తాతది. నిర్వికారంగా చూస్తున్న ఆమె ప్రాణం వయసు ఇరవై ఐదు.తాత ప్రాణం గాలిలో కలిసిపోతే... నాకింకెవ్వరు దిక్కు? నాన్న... దేశమంటే పడి చచ్చే నాన్న - దేశంకోసం పాకిస్తాన్‌ యుద్ధంలో చనిపోయిన నాన్న. భర్త మరణవార్త విని రోగిష్టి తల్లి గుండె ఆగిపోయింది. అట్లాంటి నిస్సహాయస్థితిలో నేనున్నాను తల్లీ! అంటూ ఆసరాగా నిలబడ్డాడు తాత.తాత పయ్రత్నం లేకుంటే ఈ కొండ కింద భూమి అయినా ప్రభుత్వం ఇచ్చి వుండేదా! మూడేళ్ళు తిప్పి తిప్పి ఈ నాలుగు ఎకరాలు ఇచ్చింది సర్కారు. రాళ్ళూ రప్పలూ, ముళ్ల పొదలూ, చెట్టూ చేమా వున్న ఈ నేలను సాగుకు యోగ్యం చేయడానికి ఎంత కష్టపడాల్సి వచ్చింది. రెండేళ్ళు కష్టపడితేనేగాని ఈ నేల దారికి రాలేదు. తన సొంత భూమిలా, తన సొంత మనుమరాలుకు చేస్తున్నట్టు చెమట పారించాడు తాత. ‘‘ఇక్కడే ఈ భూమి దగ్గరే ఒక గుడిసె వేసుకుందాం తల్లీ! ఈ భూమిని నమ్ముకుని బతికేద్దాం. కాస్త డబ్బు చేతికందగానే నిన్ను ఒక అయ్య చేతిలో పెట్టి హాయిగా కన్ను మూస్తాను తల్లీ!’’ అనేవాడు తాత.కాని ఇప్పుడు తాత బతుకు బాటలో నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోవడానికి సిద్ధమైపోయాడు. వైద్యం చేయించే స్థితిలో కూడా నేను లేను. 

ముసురు పట్టిన యీ చీకటి రాత్రి... ఎక్కడికి వెళ్ళగలను? అరకిలోమీటరు వెడితే గాని గూడెం రాదు. భగవంతుడు నన్ను పరీక్షిస్తున్నాడా?బయట చిమ్మ చీకటి. ప్రమిద నుండి వచ్చే నీరసిస్తున్న వెలుగు. మొదటిసారిగా నాకు భయమేమిటో తెలిసింది. నాన్న తనను ఒక సాహసవంతురాలిగా పెంచాడు. ఎన్నో వీరగాథలు నూరిపోశాడు. ఝాన్సీ లక్ష్మీభాయ్‌ నీకాదర్శం గుర్తుంచుకో అనేవాడు. నా భరత భూమి వేదభూమి. తపోధనులు, శౌర్యధనులు తిరుగాడిన పవిత్ర నేల. ఈ నేల స్వాతంత్య్రం కోసం ఎందరో ఎందరెందరో బలైపోయారు. వారి త్యాగాల ఫలమే మనకు లభించిన స్వాతంత్య్రం. ఈ దేశ స్వాతంత్య్ర రక్షణకు ప్రాణాలు బలిపెట్టడానికి ప్రతి పౌరుడూ సిద్ధంగా వుండాలి. ఈ మట్టి వాసనలు మహానిర్మలమైనవి తల్లీ! అవసరమైతే నువ్వూ ఈ మట్టికోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా వుండాలి సుమా!’’ అనేవాడు. భయం తెలియకుండా పెంచాడు నాన్న. కాని నేనిప్పుడు భయపడుతున్నాను. భయం... భవిష్యత్తు గురించి కాదు. తాత... తాత... తండ్రి తర్వాత అన్నీ తానై ఆదుకున్న తాత. ఆ తాతకు ఏమీ చేయలేకపోతున్నానన్న నా అసహాయస్థితి... నన్ను భయపెడుతున్నది.