‘‘అమ్మా రిక్షా కావాలా’’తైల సంస్కారం లేని ఉంగరాల జుట్టు, కోల ముఖంలో చురుకైన కళ్లు, సూది ముక్కు, బండ పెదవులు, మెడలో మురికిపట్టిన తాడు, దానికి వేళాడుతూ ఏడు కొండలవాడి ప్లాస్టిక్‌ బిళ్ళ, చిన్నచిన్న బొక్కల బనీను, రెండు పెద్దపేచ్‌లున్న బిగుతు ఆఫ్‌ ఫేంటు, బన్నీన్నిఫేంటుని కలుపుతూ మురికిపట్టిన నల్లని తోలు బెల్టు, నల్లని ఒళ్ళు. చెప్పులులేని కాళ్ళు. ముప్ఫయి మూడేళ్ళ వయసు. పేరు నర్శిమ్మ. నరిసిగాడంటారు అంతా.‘‘రిక్షా తల్లీ రిక్షా’’గోదావరి ఎక్స్‌ప్రెస్‌ చాలా ఆలస్యంగా వచ్చింది. అందులో ఆశ్చర్యం లేదు. 

అదేం అద్భుతం కాదు. ఎప్పుడూవున్న న్యూసెన్సే గాబట్టి పెద్ద బాధాకరమైన విషయం కూడా కాదు. ఆ మాటకొస్తే సీటూ బెర్తు రిజర్వేషనూ... వీటికన్నా ఇదిగో ఈ వూళ్ళో స్టేషన్నించి ఇంటికి వెళ్ళడమే అసలైన బాధ. సిసలైన గాథ!‘‘రిక్షా కావాలేటమ్మా’’ప్లాటుఫారం అవతల వుండాల్సిన రిక్షావాడు ప్లాటుఫారం టికట్‌ లేనే లేకుండా ప్లాటుఫారం మీదికి ప్రవేశించి - బిలబిలమంటూ రైలు దిగిన జనాన్ని దేవేస్తున్నాడు పట్టే యత్నంలో. పోటీలో రెండూ, మూడు చిక్కినట్టుచిక్కి చేజారి పోయేయి. నిరాశ ఆ క్షణం! ఆశ మరుక్షణం. మళ్ళీ ప్రయత్నం. పరుగు పట్టు.‘‘అమ్మా రిక్షా’’అమ్మని వదిలేలాలేడు రిక్షా నరిసిగాడు.ఆయమ్మ ‘అమ్మ’ అంటే అమ్మకాదు. అమ్మమ్మ నరిసిగాడికి కాదు. ఆమె చెంగు పట్టుకొని నడుస్తున్న చిన్నారి చిట్టికి, ఏడేళ్ళ బూరిబుగ్గల పెద్దకళ్ళ చిట్టికి.చిట్టి అమ్మమ్మని పట్టుకు నడుస్తుంటే, అమ్మమ్మ ట్రంకు పెట్టిని పట్టుకు నడుస్తోంది.పెట్టెని మోస్తుంటే చేయిలాగేస్తోంది ఆమెకి. పదడుగులు నడిచింది.

పెట్టె నేల దించింది. పెట్టెని కుడిచేతి నుంచి ఎడమచేతికీ, చిట్టిని ఎడమ చేతినుండి కుడిచేతికి మార్చుకు నడుస్తోంది. మనిషిని చూస్తే - అలాంటి బరువు పెట్టెలు పది ఒక్కసారే మోసేయగలదు. అనిపిస్తుంది. కాని ఆమె తనవొళ్ళు తనే మోయలేక పోతోంది. ఆమె శరీరం యినపరాయిలా గట్టివొళ్ళు కాదు. గాలి నింపిన బెలూన్‌లా నీరుపట్టిన వొళ్ళు. నాలుగడుగులు నడిస్తేచాలు కాళ్ళు పొంగుతాయి. ఆమె వయసు యాభై అయిదేళ్ళు. పేరు సోములమ్మ. కాని అంతా దిబ్బమ్మ అంటారు.‘‘ఎక్కడికమ్మా ఎల్లాల’’.వెళ్ళాల్సిన చోటు ఇక్కడా, అక్కడాలేదు. చాలా దూరం. ఆటో అయితే పదో, పన్నెండో అడిగే దూరం. బస్సయితే రూపాయి తీసుకొని పదిపైసలు తిరిగిచ్చే దూరం.తను వెళ్ళాల్సిన సిటీ బస్సు దొరికే బస్టాండు దిబ్బమ్మకి తెల్సు. ప్లాటుఫారం అంచునుంచి చూస్తే అదిగో, అల్లదిగో కనిపిస్తోంది... పెట్రోలు బంకు పక్కన నడిస్తే అయిదు నిమిషాలు.ఆమె నడిచేయగలదు. కాళ్లు పొంగినా ఖాతరు చేయకుండా. ఈ గుంట పాప. ఆ ట్రంకు పెట్టె లేకుంటే నడిచేసును.