ప్రియమైన రహీమ్‌!నీకు తెలుసుగా ఫోన్‌లో చెప్పలేని విషయాలు, విశేషాలున్నప్పుడు నేను నీకు ఉత్తరం రాస్తానని. నిజంగా భలే చిత్రమైన విషయంలే. నీకు ఎప్పుడెప్పుడు చెబుదామా అని మనసాగలేదనుకో. మొన్న శ్రీ నేను చెన్నై వచ్చాము. ఆయన ఆడిట్‌ పని మీద వస్తుంటాం తెలుసుగా. ఇప్పుడు చెన్నై నుండే ఈ ఉత్తరం రాస్తున్నా. వైజాగ్‌లో ట్రైన్‌ ఎక్కామోలేదో మా కంపార్ట్‌మెంట్‌లో ఓ విచిత్రమైన దంపతుల్ని చూశాను. ఆమెకో నలభై అయిదు సంవత్సరాలుంటాయి. మనిషి ఎత్తరి, ఎత్తుకు తగ్గలావు. మనిషి బొద్దుగా నదురుగా వుంది. ఆమె భర్త ‘ఏభై ఏళ్లుంటాయోమే. ఆమెకు కరెక్ట్‌గా వ్యతిరేకంగా వున్నాడు. నల్లగా, బట్టతల, భయంకరంగా ఉన్నాడనొచ్చు. ఇద్దరూ అస్సలు ఒకరికొకరు మేచ్‌కారు. ఇలా ఎందర్నో చూస్తుంటాం. అది పెద్దగా పట్టించుకోదగ్గ విషయం కాదులేనని నేను పెద్దగా పట్టించుకోలేదు. మా బెర్త్‌ల మీద కూర్చుని భోజనం చేస్తున్నారు. కనీసం అడగనైనా అడగకుండా వాళ్లు భోజనం చేసి లేచేవరకు మేం ఎదురుగా కిటికీ పక్క బెర్త్‌మీద కూర్చోవలసి వచ్చింది. అటు పక్క రెండుబెర్త్‌లు వాళ్లవి. వాళ్లటు వెళ్లాక మేం సామాన్లు సర్దుకుని కూర్చున్నాం. నేను, శ్రీ ఏదో సాహిత్యం గురించి మాట్లాడుకుంటున్నాం. సండే మేగజైన్‌లో వచ్చిన నీ కథ గురించి చెబుతున్నా, ‘‘బాగా రాశాడురా, అయినా అలవోకగా కథ రాసేస్తాడు రహీమ్‌’’ మెచ్చుకోలుగా అన్నారు శ్రీ నీ కథ విని. మంచి ఇతివృత్తం. మనిషి మృదువైన స్పర్శని ఎంతలా కోరుకుంటాడో. లక్ష మాటలు చెప్పలేనిది, ఒక్క స్పర్శతో ఎలా చెప్పచ్చో బాగా రాశాడు అనుకున్నాం ఇద్దరం.అప్పటికి బండి తుని దాటిందనుకుంటాను.

 ఆ భార్యాభర్తలిద్దరూ కాసేపు పడుకుని లేచారు. ఇద్దరూ కిటికీ పక్క బెర్త్‌ కదా ఒకరికొకరు ఎదురుగా కూర్చున్నారు. ఇటుపక్క బెర్త్‌లో మేం, మా ఎదురు బెర్త్‌లో కొత్తగా పెళ్లై వీసా స్టాంపింగ్‌కోసం చెన్నై వెళ్తున్న ఓ అనకాపల్లి అమ్మాయి, అమెరికా అబ్బాయి భార్యాభర్తలున్నారు. వాళ్ల మాటలు బట్టీ తెలిసిందిలే. వాళ్ల లోకంలో వాళ్లున్నారు.‘‘సాహిత్యంలో ఈ రూపాన్ని గూర్చి వస్తువు గూర్చి ఇన్ని చర్చలు అనవసరం, వస్తువు బట్టే (ఇతివృత్తం) రూపం వస్తుంది. వస్తు సాంద్రతను బట్టి అది కవితగానో, కథగానో రూపుదిద్దుకుంటుంది’’ చెప్తున్నారు శ్రీ. మన సోక్రటీసు శ్రీగారు ఏంచెప్పినా ఎన్నిసార్లు చెప్పినా, ఇంకా వినాలనే ఉంటుంది. ప్రతి విషయం కొత్తగానే వుంటుంది. అయినా నీకూ, నాకూ ఈ విషయం కొత్తకాదుగా. శ్రద్ధగా వింటున్నా. ఇంతలో వినిపించింది ఆ శబ్దాన్ని భాషలో ఎలా రాయాలో తెలియటం లేదు. చాచి చెంపమీద ఛెళ్లున చరచికొట్టిన చప్పుడు. ఆ భర్త తన భార్యను కొట్టాడని అర్ధమైంది. మా ఎదురుగా కూర్చున్న కుర్ర జంట, పై బెర్త్‌ మీద పడుకున్న నౌవల్‌ అబ్బాయి, మొత్తం అందరూ ఎదురుగా కూర్చున్న ఆ భార్యాభర్తలవైపు చూశారు. నాకయితే వాళ్లిద్దరూ దెబ్బలాడుకుంటున్నారేమోనని చూడటానికి కూడా భయం వేసింది. ఒక్క నిమిషం అందరూ ఫ్రీజ్‌ అయినట్టు నిశ్శబ్దం. ఆ తర్వాత వాళ్లిద్దరూ నవ్వులు. అప్పుడు చూశాను ఆశ్చర్యంగా వాళ్లవంక. ఇక మొదలయిందిరా నాయనా విజయవాడ వరకూ వాళ్ల దెబ్బల ప్రహసనం. ఇద్దరూ ఏదో మాట్లాడుకోవడం, ఆయన వెకిలిగా నవ్వడం - ఆ నవ్విన అరక్షణంలోనే ఆమెను ఫాట్‌మని ఎక్కడ పడితే అక్కడ చరిచి కొట్టడం (కొట్టడం అంటే మామూలుగా, సరదాగా కాదు తట్లు తేలేంత గట్టిగా) ఇద్దరూ కాసేపు నవ్వులు.