నల్లమట్టిని జల్లెడ పడితే దిగిన రేగడిలాటి చీకటి. సన్నని గాలి శబ్దం. ఇంతలో నాలికతో కలిసి రెండు పెదాలనీ తాకుతూ వచ్చే ఈల మోత. సన్నగా మొదలై పాటగా మెలికలు తిరిగి గది చీకటితో చుట్టుకుంటోంది. కిర్ర్‌ర్ర్‌ .. అంటూ తలుపు తెరుచుకున్న చప్పుడు. అడుగుల మోత ... వినీ వినపడని మెత్తని నడక. బయట తెల్లటి పలచటి వెన్నెల ... తలుపంత వెడల్పుతో. వాకిలి దాకా వెళ్లి ఒక చూపు వెనక్కి పారచూసిందామె. తర్వాత కొద్దిగా ఒంగి తలుపు మూసింది. తలుపు సందులో నుంచి వెన్నెల సన్నటి గాడిలా మారింది. మెత్తని అడుగులు దూరమయి ... ఈల ఆగిపోయింది.అమ్మని ఇంకా గట్టిగా పట్టుకుని పడుకున్నా. మెలకువతో ఉందో, నిద్రపోయిందో గాని మెల్లగా నా చేతుల్ని విడిపించుకుని అటు తిరిగింది.నాకు అన్నీ గుర్తుకొస్తున్నాయి మెల్లమెల్లగా....ఫఫఫరూపా అత్తయ్య కారు రాగానే అమ్మ లేచి గబగబా ఎదురెల్లి తీసుకొచ్చింది. నాన్న చిరునవ్వుతో ‘‘బాగున్నారమ్మా?’’ అని పలకరిస్తూ పేషంట్ల వైపు తిరిగి ఓ అరగంట ఆగమన్నాడు. ఆ మాట విన్న అత్తయ్య వెంటనే ‘‘ముందు వాళ్లని చూసి పంపండి, నేను రెండు గంటలుంటాను’’ అంది.

అమ్మ అత్తయ్య చేతిని తన చేతిలోకి తీసుకుంటూ ‘‘చెప్పండి రూపా, ఏంటి విశేషాలు?’’ అంది.‘‘ఒంట్లో బాగోలేదు. తల తిరిగినట్టుగా ఉంటోంది’’.‘‘రక్తపోటు ఎక్కువగా ఉందేమో. సమయానికి భోజనం, మందులు వాడాలి మరి’’.చిన్నగా నవ్వి ‘‘మనసు గాయాలకి పూతలేమైనా ఉన్నయ్యా?’’ అంది అత్తయ్య.‘‘ఉంది. కాలమనే మలాం. దానంతట అదే రాసుకుని బాధని తగ్గిచ్చుకుంటుంది’’ అని, కొనసాగింపుగా ‘‘విక్రమ్‌ని క్షమించలేరా రూపా’’ అంది అమ్మ.‘‘ఇది జడ్జిని అడగాల్సిన ప్రశ్న. తీర్పు ఇచ్చింది ఆయన. అన్యాయం చేసింది అతను. నింద నామీదా? రాచరికంలో ఎవరి జీవితాలు వాళ్లకుంటయ్యి. ఆడది మాత్రం సేద తీరకూడదా?’’‘‘తలచుకుంటే జైలుకెళ్లి పలకరించొచ్చు. కొద్దిగానయినా పశ్చాత్తాప పడతాడేమో, ఎంతయినా భర్త. అందులోనూ రాజకుటుంబీకుడు. జీవిత ఖైదులో ఉన్నాడు కదా .. మీరు తలచుకుంటే ..’’ మధ్యలోనే ఆపింది అమ్మ.