‘‘విశ్వం .... నాయనా విశ్వం -రామ్మా! పొద్దుపోయిందికదరా!! ఇంకా ఎక్కడ తిరుగుతున్నావూ. ఇంటికి రావూ - వచ్చేయమ్మా! ఇంకా అక్కడక్కడా తిరుగుతూ అన్నన్ని మాటలు అనిపించుకొంటుంటే నా మనసు ఊరుకొంటుందా చెప్పూ. నేను బాధ పడనూ. నాకు దుఃఖం రాదూ - అదిగో తాతగారు.... నీ కిష్టమైన తాతగారు నీ కోసం పక్కపరిచారురా. తెల్లదుప్పటి నీకిష్టం కదూ - రా చూడు - మంచం నిండా పరిచారు.బోల్డు కథలూ - కబుర్లూ చెబుతారు. ఈవేళ పేపర్లో ఏం రాశారు తాతా అని మరిమరీ వార్తలు చెప్పించుకుంటావు కదమ్మా - నీవంటికి మందురాస్తూ తాతగారు కథలు చెప్తోంటే మధ్య మధ్య తాతగారు కథను ఆపితే ఎంతగోల చేస్తావనీ - నీకెంత గుర్తురా!! నా తండ్రీ, అన్నీ జ్ఞాపకమే నా చిట్టి తండ్రికి.బతికీ మాటలు పడ్డావు తండ్రీ -చనిపోయీ పడాలా అంతంత మాటలు-’’గుమ్మంలో లాంతరు వెలుగులో గోడకు చేరబడి వింటున్న రామ్మూర్తి గారు కళ్లంబట బొటబొట నీళ్లు కారుతోంటే భుజం మీది తుండుతో కళ్లొత్తుకున్నారు.‘‘నాయనా! విశ్వం నువ్వునాటిన బీరపాదు ఇవాళ రెండు పూలు పూసింది రోయ్‌ - తడికమీద గాలికి ఊగుతోంది చూడు. - రావూ విశ్వం! నాకన్న తండ్రి నువ్వు పిలుస్తావే - సీతప్పా సీతప్పా అని - అది వచ్చిందిరా - అదంటే నీకిష్టం కదూ. 

పాలకోసం బంతి మొక్కల మధ్య కూచుని చూస్తోందిరా. నాయనా విశ్వం...’’‘‘రుక్మిణీ - రుక్కూ - ఇక నీ మాటలు నేను వినలేనే! ఎంత ప్రేమే!! వాడి మీద. ఆ భగవంతుడు ఎంతదుర్మార్గుడే - నీ చేతుల్లోంచి లాక్కొని దుఃఖాన్ని మిగిల్చాడా!’’ సన్నగా అంటూ రామ్మూర్తిగారు దుఃఖాన్ని దిగమింగుతూ తుండుతో కళ్లొత్తుకున్నారు.అది ఆ వూరిలో కొత్తగా వెలుస్తున్న వీధి, చిమ్మచీకటి - అక్కడోకటి, ఇక్కడొకటి మునిసిపల్‌ లైట్లు వెలుగుతున్నాయి - ఇంకా రోడ్డు వెయ్య లేదు సరిగా - మట్టి పోశారేమో - వర్షానికి బురదబురదగా దారంతా చిత్తడి చిత్తడిగా ఉంది.వీధిలో జనసంచారం లేదు.రుక్మిణీ కళ్లొత్తుకొని వెదురు తలుపు దగ్గరగా వేసి ఇనుపచువ్వ తగిలించి గుమ్మంలోకి వచ్చింది.‘‘నేను వాడ్ని మరచిపోలేక పోతున్నానండీ! కూరగాయలమ్మే గంగమ్మ ఎంతెంత మాటలందనీ - వీడు దెయ్యమయ్యాడా - దారంట పోయే వాళ్లను భయపెడుతున్నాడా!!’’నిస్సత్తువుగా రామ్మూర్తిగారు చేరబడి ఉన్న గోడకే చేరబడి పోయింది.‘‘లోకులు పలుగాకులు, ఎవరికనిచెప్తాం. అంతా వాడికర్మ’’ రామ్మూర్తి గారు రుక్మిణీ చేతులు తన చేతుల్లోకి తీసుకున్నారు. లాంతరు వెలుగులో ఆమె తడిసిన కనురెప్పలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కంఠం ముడిమీద చిన్నమెత్తు బంగారంతో ఉన్న కుత్తిగంటు ఊపిరి తీస్తున్నప్పుడల్లా కదులు తోంది.