‘టీనేజ్‌లో తీసుకున్న ఆ సాహసోపేతమైన నిర్ణయం సరైనదేనా’ అని సుందరం తనలోతాను చాలాసార్లు తర్కించుకున్నాడు. కానీ ముమ్మాటికీ తాను తీసుకున్న ఆ నిర్ణయం సరైనదే అని అతడికి పదేపదే అనిపించింది.సుందరంతోబాటు అతడి పెద్దమ్మ, పెదనాన్న ఆ గదిలో టీవీ ముందు కూర్చుని వార్తల కోసం ఆత్రుతగా నిరీక్షిస్తున్నారు. డెబ్భైఏళ్ళు దాటిన సుందరం పెద్దమ్మ లేచివెళ్లి అందరికీ కాఫీ తెచ్చిచ్చింది. పక్కింటి శీను లోనికివస్తూ ‘‘నీకా అవార్డు కచ్చితంగా వస్తుందిలే సుందరం మామయ్యా’’ అన్నాడు.‘‘కూర్చో శీనూ, నువ్వు న్యూస్‌ చూడు’’ అన్నాడు సుందరం.‘‘లేదు మావయ్యా, లగేజీ సర్దుకోవాలి. ట్రైనుకు టైమౌతోంది’ అన్నాడు శీను.సుందరం జ్ఞాపకాల పుటల్లో ముప్ఫైఐదేళ్ళు వెనక్కి వెళ్లాడు.ఫఫఫచెరుకుపల్లె గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు సుందరం. తండ్రి వ్యవసాయ కూలీ. సుందరం పదవతరగతిలో ఉండగానే తండ్రి మరణించాడు. సుందరం తల్లి చంద్రమ్మ కొడుకు భవిష్యత్తు గురించి బెంగ పెట్టుకుంది.‘‘నీకేమీ దిగులు అవసరంలేదు. నీ కొడుకును పట్నం తీసుకెళ్లి చదివించి ఇంజనీరును చేస్తాను. నా కూతురును ఇచ్చి పెళ్లిచేసి ఇల్లరికం తెచ్చుకుంటా’’ చుట్టపు చూపుగా వచ్చిన చంద్రమ్మ అన్న ఓబులేసు అన్నాడు.

సుందరానికి మామయ్యతో వెళ్లడం ఇష్టంలేదు. సుందరం చదువులో సగటు విద్యార్థి. కానీ ఆటలపోటీల్లో బాగా రాణించేవాడు. కబడ్డీ, వాలీబాల్‌ టీములకు స్కూల్లో అతనే కెప్టెను. నాలుగైదుమైళ్ల దూరం సునాయాసంగా పరిగెత్తేవాడు.‘‘నువ్వు ఆటల్లో బాగా రాణించగలవు. నీకీ రంగంలో ఉజ్వల భవిష్యత్తు ఉంది. నా మాటవిని సర్కారువారి స్పోర్ట్స్‌ స్కూల్లో జాయిన్‌కా సుందరం. వాళ్లే నిన్ను చదివించి, ఆటల్లో కూడా తర్ఫీదు ఇస్తారు. తిండీ, హాస్టలు ఖర్చులు గవర్నమెంటే కట్టుకొంటుంది. స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగంకూడా తెచ్చుకోవచ్చు’’ అన్నాడు వాళ్ల స్కూలు పీటీ మాస్టారు రంగనాథం. చదువుకుంటే ఉద్యోగం వస్తుంది. ఆటలు ఆడితే ఏమొస్తుంది? ఈ ఆటలపిచ్చి మానుకో. బుద్ధిగా మామయ్యతోవెళ్లి టౌన్లో చదువుకో’’ అని ఆ ఊర్లో చాలామంది సుందరానికి హితవు చెప్పారు. తల్లి చంద్రమ్మ ‘‘నీ ఇష్టం బాబూ’’ అంది.