సాహితికి మేనేజర్ని నమిలి మింగేయాలన్నంత కోపం వచ్చింది.సాయంత్రం అయిదు గంటలప్పుడు బల్లమీది కాగితాలన్నీ సర్దేసి, హాండ్‌ బ్యాగు భుజాన తగిలించుకుంటుండగా మేనేజరుగారు పిలుస్తున్నా రంటూ వచ్చాడు అటెండర్‌ వాసు.నీరసంగా అడుగులు వేస్తూ ఆయన గది దగ్గరకు వెళ్ళి స్ర్పింగ్‌ డోర్‌ తెరచుకుని లోపలికి అడుగు పెట్టింది సాహితి.‘‘మీ కోసం ఇప్పుడే చేసిన వేడి సమోసా, కాఫీ తెప్పించాను. ముందు టిఫిన్‌ తినేసి ఒక అరగంట కూర్చుని ఈ పని పూర్తిచేసి వెళ్ళాలి’’ అన్నాడు. మోహనకృష్ణ కొన్ని కాగితాలు ముందుకు జరుపుతూ.‘చక్కనమ్మ చిక్కినా అందమే’ అన్నట్టు ఉదయం నుండి పని చేసి అలసి పోయి వున్నా అందంగా వుంది సాహితి. చుడీదార్‌లో మరింత ఆకర్షణీయంగా కనబడుతోంది. కొత్తగా ఉద్యోగంలో చేరింది గనుక తనకి ఎదురు చెప్పదన్న ధీమా వుంది మోహన కృష్ణకి.ఏదో ఒక కారణంతో ఆఫీసు పని సమయం అయిపోయాక ఆమెను ఇంటికి పోనీయకుండా ఆపేస్తున్నాడు అతను. అందరూ వెళ్ళిపోయాక అటెండరు బయట కూర్చుంటాడు. ముసలి సూపరింటెండెంటు మాత్రం ఏదో బ్రహ్మరాత రాస్తుంటాడు. పక్కనే టపాకాయ పేల్చినా అతనికి వినబడదు.సాహితిని తన గదిలోకి పిలిచి పని ఒప్పగించి, ఆ పని పూర్తి చేయనివ్వ కుండా ఆమెతో కబుర్లు చెబుతాడు మానేజరు. అవీ చెత్తకబుర్లు.‘‘ఈ డ్రెస్‌ మీకు మరీ బిగుతైనట్టుంది. అదో అందమనుకోండి.

సన్నగా రివటలా వుండే వాళ్ళకన్నా కండపట్టి నేవళంగా వుండే ఆడవాళ్ళలోనే స్త్రీత్వం అందంగా కనబడుతుంది’’ వంటి వెకిలి మాటలు విసురుతాడు. అతని ఆట కట్టించడమెలాగో సాహితికి తోచడం లేదు.‘‘ఏమిటాలోచిస్తున్నారు? టిఫిన్‌ చల్లారిపోతుంది. మీతోబాటు తిందా మని నేను కాచుకుని కూర్చున్నాను. రండి’’ అన్నాడు ఆమె నడుము వంపు మీద దృష్టి నిలిపి. ఆ రోజు చీరెలో వుంది సాహితి.‘‘నాకు సమోసా అంటే అలర్జీ. ఇందాకే కాఫీ తాగాను’’ అనేసి పేపర్లు తీసుకుని తన బల్ల దగ్గరికి వచ్చి కూర్చుంది.కాసేపయ్యాక తను కూడా బయటకువచ్చి ఆమె ఎదురుగా వున్న కుర్చీలో కూర్చున్నాడు మేనేజరు.‘‘నేను రెండ్రోజులు సెలవుపెట్టి ఊరు వెడుతున్నా. పెళ్ళాన్ని చూడకుండా నెల దాటిందంటే బండి మొండికేస్తుంది. ఇంకా వయసులో వున్నాను కదా... ఈ రకం బాధ నీకు ఇంకా అనుభవంలోకి రాలేదేమో...’’ విలాసంగా నవ్వుతూ ఒక గొప్పవిషయం గురించి చెప్తున్నట్టుగా చెప్పాడు మోహనకృష్ణ.సాహితి ముఖం ఎరుపెక్కింది. మనసులోనే ‘ఛీ’ అనుకుంది. నలభై అయిదేళ్ళు దాటుతున్న మనిషి. ఇద్దరు ఆడపిల్లల తండ్రి, మరొక పెళ్ళి కాని ఆడపిల్లతో మాట్లాడే తీరు ఇదేనా? అని దులిపేయాలనిపించిం దామెకు.