కాలింగ్‌ బెల్‌ శబ్దం వినబడుతూనే ఉలికిపాటుకి గురైంది తులసమ్మ. అన్నం తిని అలా నడుం వాలుస్తూనే నిద్రలోకి జారుకొంది. కునుకుపట్టి పది నిమిషాలు గడిచిందో లేదో నిద్రా భంగమైంది. దివాన్‌కాట్‌ మీద నుంచి చివాల్న లేచి కూచుంది. ఈ వేళప్పుడు ఎవరై వుంటారు? తలుపులు తీయాలా, వద్దా?వచ్చిన మనిషెవరో, ఏం పనిమీదొచ్చారో, ఎవరికోసం వచ్చారో తెలుసు కోకుండా తొందరపడి తలుపులు బార్లా తెరవొద్దని కావేరి హెచ్చరించిన విషయం గుర్తొచ్చింది. ఆ మధ్య దగ్గర్లోనే ఒక ఇంట్లో ఒంటరిగా వున్న ముసలావిడ అమాయకంగా తలుపు తెరవటంతో, దొంగలు మీద పడి కాళ్లూ, చేతులు కట్టిపడేసి ఇల్లంతా దోచుకుపోయిన విషయం చెప్పి తగిన జాగ్రత్తలో వుండాలన్నది.కాలింగ్‌ బెల్‌ వుండుండి అదేపనిగా మోగుతుంటే గుండెలో దడ మొదలైంది. మెల్లగా తలుపు దగ్గరకు నడిచింది. తలుపు తెరవకుండా బయటవున్న వ్యక్తిని చూచే అవకాశం లేదు.‘‘ఎవరూ?’’ అంటూ గట్టిగా అరిచింది.‘‘కొరియర్‌... కొరియరండీ!’’ సమాధానం వచ్చింది బయటినుంచి.ఆ మాటకర్థం ఆమెకు తెలియదు.‘‘ఇంట్లో మా వాళ్లెవరూ లేరు. సాయంత్రాని కొస్తారు. అప్పుడు రండి’’ లోపల్నుండే గట్టిగా అరిచి చెప్పింది.‘‘రాజేష్‌గారి పేర పార్శిలమ్మా! ఇచ్చిపోతాను. మీరున్నారుగా తీసుకోవచ్చు’’ బయటి నుండి కొరియర్‌ కేకలు.అతని మాటలు వినిపిస్తున్నా తలుపులు తీసే ధైర్యం మాత్రం తులసమ్మకు లేదు. 

తనలాంటి వాళ్లను మాయ చెయ్యటానికి ఏదో వంక చెప్పొచ్చు. ఎందుకొచ్చిన తలనొప్పి?‘‘ఇంట్లో మా అబ్బాయి లేడు. సాయంత్రం రమ్మంటున్నాగా!’’ అంటూ కేకలు పెట్టింది.బయటన్న వ్యక్తి ఏదో అస్పష్టంగా గొణుక్కుంటూ వెళ్లాడు. అతను మళ్లీ పిలవకపోవటంతో వెళ్లిపోతుంటాడనుకొని వెనుదిరిగింది. మధ్యాహ్నం ముద్ద నోట్లో పడుతూనే ఒక గంట నిద్రపోగలిగితే మనసుకు హాయిగా వుంటుంది. ఏ మాత్రం నిద్ర చెడినా రోజంతా ఎంతో బడలికగా, చిరాగ్గా అనిపిస్తుంది.తిరిగి నడుం వాల్చి పది నిమిషాలైందో లేదో మళ్లీ కాలింగ్‌ బెల్‌ మోగింది. ఉలిక్కిపడి లేచింది. తలుపు దగ్గరకు నడుస్తూ ‘‘ఎవరదీ?’’ అంటూ కేకేసింది.‘‘నేనమ్మా! మీ పక్కింట్లో వుండే సుధాకర్‌ని. ఒకసారి తలుపు తియ్యండి’’ పరిచయమైన గొంతు వినిపించింది.తెలిసిన మనిషే! భయం లేదనుకొంటూ తలుపు గడియతీసింది. సుధాకర్‌తో పాటు చంకన బ్యాగ్‌తో ఒక యువకుడు నిలబడుతున్నాడు.‘‘ఇతను కొరియర్‌ మనిషమ్మా! రాజేష్‌కి ఏదో పార్శిల్‌ వచ్చిందట. మీరు తలుపు తియ్యటం లేదని నా దగ్గరకు వచ్చి వాపోయాడు. సంతకం పెట్టి తీసుకోండి’’ అంటూ విషయం చెప్పాడు.‘‘అవన్నీ నాకేం తెలుసండీ! మనిషెవరో తెలుసుకోకుండా తలుపు తియ్యా లంటే భయంగా వుంది’’ సంజాయిషీ చెప్తూనే కొరియర్‌ తీసుకుంది.మళ్లీ రావాల్సిన పని తప్పించినందుకు కొరియరతను థాంక్స్‌ చెప్పి హడావిడిగా వెళ్లిపోయాడు.