అసలు నిన్న సాయంకాలం బీచ్‌రోడ్డులో మా అబ్బాయి కారు బ్రేక్‌ డౌన్‌ అవకపోతే ఈ జ్ఞాప కాలూ, ఈ ఆలోచనలూ నన్ను ఇలా బాధ పెట్టేవే కాదు. మా వాడి కారు ఆగిపోయిన చోట ఉన్న బెంచీ మీద నా వయసు వాళ్లే అయిన నలుగురు వృద్ధులు కనపడే వారు కాదు కదా!వాళ్ల బెంచీకీ, మా అబ్బాయి నన్ను కూర్చోబెట్టిన చోటికి ఎక్కువ దూరం లేదు. అందుచేత సముద్రపు కెరటాల హోరు ఆ కబుర్లని నా దాకా రాకుండా ఆపలేక పోయింది.ఏం కబర్లు, అవీ! వంకాయల ధరలు పెరిగిపోయాయి. అంచేత, ఇల్లాళ్లు గోల పెడుతున్నారు. పెట్రోలు, డీసెల్‌ ధరలు పెరిగిపోయాయి. అంచేత ఆటోవాళ్లు రేట్లు పెంచేశారు. కందిపప్పు, బియ్యం, రిఫైన్డ్‌ ఆయిల్‌ కొంతమందికి తక్కువ ధరలకి ఇచ్చేస్తున్నారట. ఇలా టీవీలో చూసినవి, న్యూస్‌పేపర్లో చదివినవి కలిపి ‘ధరల పెరుగుదల’ అని ఒక ఉపన్యాసం తయారుచేసేడు ఒకాయన.

వాటిన్నింటినీ అంత ఇదిగా తీసుకోకూడదు. ఎందుకంటే, పెన్షన్లు కూడా పెరుగుతున్నాయి కదా! ఒక్కొక్క పే రివిజన్‌ కమీషన్‌ వచ్చినప్పుడు ఒక్కొక్క రకంగా పెన్షన్లు పెరుగుతున్నాయి. అంతే కాదు, ఇప్పుడు రాబోతున్న కొత్త పే కమీషన్‌ ఉద్యోగస్థుల జీతాలు ఏకంగా నలభై శాతం పెంచ మంటున్నారు. దానికి అనుగుణంగా పెన్షన్లు కూడా పెరుగుతాయి - అని, ఎవరెవరికి ఎంత పెరుగుతుందో రాసి ఉన్న చిట్టా జేబులోంచి తీసేడు ఇంకొక ఆయన.ప్రపంచ దేశాల మధ్య అణు ఒప్పందాలు ఏమిటి? వాటిని తూ.చ. తప్పకుండా అమలు పరిస్తే ఎంత ప్రమాదం జరుగుతుంది - అని ఒకాయన తీవ్రమైన చర్చ పెట్టాడు.ఎన్నో కారణాల వల్ల ద్రవ్యోల్బణం ఏర్పడిందని, దాని వల్ల ధరల పెరుగుదల సామాన్య ప్రజల్ని అట్టే బాధ పడకుండా కాస్తోందని ఇంకొక ఆయన సిద్ధాంతం చేసేడు.పెద్దపెద్ద దేశాలు, పెద్దపెద్ద యంత్రాలని తయారు చేయకుండా చిన్న చిన్న దేశాలకి ఆ పనులు వదిలేసి ఆలోచనా రంగం మీద మాత్రం పెత్తనం చేస్తున్నాయని అందులో ఒకాయన సోదాహరణంగా  అబ్బాయి ఏదో వర్క్‌షాపుకి వెళ్లి మెకానిక్‌ని తీసుకొచ్చి కారు బాగు చేయించే దాకా ఆ న్యూస్‌ పేపర్లు అలా వింటూనే ఉన్నాను.

ఆ టీవి విశ్లేషణల్ని అలా వింటూనే ఉన్నాను.ఇంటికి వచ్చాక కూడా ఆ కబుర్లు నా చెవుల్లో తెల్లవార్లూ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి.ఎందుకు, ఈ వృద్ధాప్యం? పూర్వం - అంటే దేశానికి స్వాతంత్య్రం వచ్చేవరకు - దేశంలో వృద్ధులు 10 శాతం నుండి 12 శాతం వరకే ఉండేవారట. ఇప్పుడు వైద్యరంగంలో సాధించిన అభివృద్ధి కారణంగా మరణాలు తగ్గిపోయి వయో వృద్ధుల సంఖ్య బాగా పెరిగిందట. శతాబ్దాల నుండి మనకు తెలియకుండా మనల్ని బాధిస్తున్న వ్యాధులు వాటికవే పేర్లు పెట్టుకుని 20వ శతాబ్దపు రెండవ అర్ధభాగంలో ప్రజల పరిజ్ఞానం లోకి వచ్చాయి. ఈ మధ్యకాలంలో మాన వుడికి మృత్యువును తెచ్చిపెట్టే ఈ వ్యాధులన్నిటికీ ఔషధాల ద్వారా చికిత్స జరుగుతోంది. అలా కుదరకపోతే శస్త్రచికిత్స వచ్చిపడింది. అసలు ఇదేమీ కొత్తకాదు. ‘అంగవ్రాతమునన్‌ చికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి శేషాంగ శ్రేణికి రక్ష’ చేసే పద్ధతి పురాణకాలం నాడే ఉంది. ఇదంతా ఇలా ఉండగా శాస్త్రంలోగాని, పూర్వానుభవంలో గాని చెప్పని రకరకాల సిండ్రోములకి నివారణ లొచ్చాయి. మొత్తం మీద ఇవాళ కాళ్ల నొప్పులతోనే కాక, గుండెనొప్పి కారణంగా కూడా ఎవరో గాని చచ్చిపోవడం లేదు. ఇలా వయోవృద్ధులు ఇటు కుటుంబాలకి భోజన భాజనాది ఖర్చుల వల్లను, అటు ప్రభుత్వానికి పెన్షన్‌ చెల్లింపుల ఖర్చు వల్లను బాధాకరమైన సామాజిక భారంగా స్థిరపడి ఉన్నారు.