అతనింకా రాలేదు!చీకటి-చీకటి పనులకు చీటీ యిచ్చేవేళ.ఎక్కడో విజిల్‌ ఊదుతో అతనూ, అతని కోసం నిరీక్ష స్తూ నేనూ-తప్ప, కాలనీ మొత్తం ‘మొద్దునిద్ర’ పోతోంది.పర్యావరణంలోని ప్రశాంతతను భంగపరుస్తూ- కాలనీ చివరి వీధిలో వీధికుక్కలు మొరుగుతున్నాయి. ఒకటో, రెండో కాదు, చాలా కుక్కలు... చాలా సేపటి నుంచి!వరండాలో పచార్లు చేస్తూ, అపడపడు కరంటు స్తంభం వేపూ, పక్కింటి వేపు చూస్తు న్నాను. ఆ సమయంలో- నే రాస్తున్న కథా యితివృత్తం చుట్టూ తిరగాల్సిన నా ఆలోచనలు, తిరుగుతున్నాయి. అతనొస్తే ఇవ్వడానికి చల్లని నీళ్లు తెచ్చి ఉంచాను. ప్లాస్క్‌లో టీ కూడా అతని కోసమే!సెల్‌లో సమయం ఒకటింబావు చూపుతుంది. సాధారణంగా అతనొచ్చే సమయం దాటి అరగంట పైగా అయింది అయినా - కరంటు స్తంభాన్ని లాఠీతో కొట్టడం వల్ల వచ్చే ‘టక్‌..టక్‌...’ శబ్దం గానీ, నిద్ర పోతున్నవాళ్లు ఉలిక్కిపడిలేచి, ఓ సారి యింటి పరిసరాల్ని గమనించుకొనేలా చేసే ‘విజిల్‌’ శబ్దంగానీ విన్పించలేదు. పక్కిటి ‘లాబ్రెడార్‌’ కూడా మొరగడం లేదు. ఇవన్నీ అతని రాకడకు సూచనలు! అతనింకా రాలేదు!నిజానికి అతను రానంతలో నాకు జరిగే నష్టం ఏదీ లేదు. 

మహా అయితే నేనత న్ని ఓ నమూనా పాత్రగా స్వీకరించి, అతని జీవితంలోకి తొంగి చూస్తూ ‘రాస్తున్న కథ’ ఆగి పోవచ్చు! పోకపోనూ వచ్చు! అయితే సౌష్టవమూ, లోతూ కలిగిన ఒక ‘మంచి కథ’గా తెలుసుకునేందుకు గత పక్షం రోజులుగా అనేక ప్రశ్నలతో విసిగిస్తూ- అతని ‘అంతరంగాన్ని’చాలా వరకు ‘రికార్డ్‌’ చేయగలి గినా, కథ ముగింపు కుత్రిమంగా ఉండకుండా ఉండేందుకు, అతనొస్తే అడగడానికి ఐదారు ప్రశ్నలు రాసి ఉంచుకొన్నాను. కాని ఒక ధైర్యం కూడా ఉంది. నా ‘అనుభవ ప్రపంచం’ నా కలానికి బలాన్నిస్తుందనే ధైర్యం!కాని ప్రస్తుతం కథ కాదు సమస్య-మానవీకర ణ !ప్రపంచీకరణ ప్రభావాల్లో, ప్రలోభాల్లో మంచీ చెడులు వదిలేసి, పతనీకరణ వేపు పయనిస్తున్న మన ధోరణులు, ప్రశాంతమైన భద్రజీవన రీతిని కాదని, ‘తాత్కాలికానందానుభూతుల ఉద్వేగాల’ ఒరవడిలో ఉరక లేస్తున్న మన వైఖరులు, వ్యక్తుల మధ్య వికసించాల్సిన ఆత్మీయతాను రాగాల్ని లాగేసుకుంటున్న వస్తు వ్యామోహాలు, రక్త సంబం ధీకులతో కూడా ఆర్థిక లావాదేవీలే ప్రముఖమై- మమతలకు మసిపూస్తున్న మన ఆలోచనా రీతీ... వీటన్నిటినీ - పెద్దల వొరవడి మీద అపరిమిత గౌరవ, నమ్మకాలతో..నిజాయితీ, నిబద్ధతలే అర్హతలుగా సాగే అతని జీవనయానం నా అనుభవ ప్రపంచాన్నీ తలక్రిందులు చేస్తుందనే ‘భయంతో’ మరిన్ని వివరణల కోసం అతని జాడ లేక పోవ డంతో కలిగిన చిరాకు అలా చావనీ... అంతకు మించి మానవీకరణకు మలినం అంటినట్లుగా- అదో రకమైన బాధతో కూడిన భావోద్వేగం!