సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్లో బి.1 డిస్‌ప్లే బోర్డుకెదురుగా కూర్చున్నాం. ‘‘మరి కొన్ని నిముషాలలో...’’ అనౌన్స్‌మెంట్‌ తర్వాత రాజకోట్‌ ఎక్స్‌ప్రెస్‌ వచ్చింది.అంతే! ఎక్కే వాళ్ళు, ఎక్కించే వాళ్ళు, పోర్టర్లు, వెండర్లతో బోగి రద్దీగుంది. ఎలాగో మా కూపే లోకి ఏడుగురం చేరాం. ఓ గుజరాతి జంట ప్లస్‌ రెండేళ్ళ బాబు, ఓ హిందీ తల్లి... కూతురు, ఓ పంజాబి కుర్రోడు, మా ఆవిడ శారద... నేను సర్దుకు కూర్చున్నాం. ఇక ఎనిమిదో శాల్తీ రావాల్సుంది.కొలువు దిగిన ఆర్నెల్లకు గాని సూరత్‌లో నున్న కొడుకు దగ్గరికెళ్ళటానికి కుదర్లేదు.‘‘ఇప్పటికి అబ్బాయి దగ్గరి కెళ్తున్న నమ్మకం కల్గిందండీ!’’ ఉన్నట్లుండి శారదంది.‘‘అదేంటీ?’’ నేనాశ్చర్యంగా చూసా.‘‘అవునండీ! ఓ సారి పెద్దమ్మాయి మరిది పెళ్ళని ఆగాం! ఇంకోసారి చిన్నమ్మాయి గృహప్రవేశమని ఆగాం! ఈ సారేగా ఏ అడ్డూ... లేంది!’’‘‘అంత ఆత్రమెందుకు లేవోయ్‌! వెళ్ళగానే మనమరాళ్ళతో ఆడుకుందువుగాని!’’‘‘ఆడుకోటానికి నేనేమన్నా చిన్న పిల్లనా!’’‘‘కాకుంటే ఆడిస్తావులే! అంతేగా తేడా!’’ నేనవ్వా. ఆమె శ్రుతి కల్పింది.కాస్త స్థిమిత పడ్డాక తోటి ప్రయాణీకుల వైపు చూసా.గుజరాతి అబ్బాయికి ముప్ఫై, అమ్మాయికి ఇరువై ఐదేళ్ళుండొచ్చు. ఇద్దరు బంగారు రంగులో మేడ్‌ఫర్‌ ఈచదర్‌ లాగున్నారు. వాళ్ళబాబు బొద్దుగా, ముద్దుగున్నాడు. హిందీ పెద్దమెకు యాభై ఏళ్ళుంటాయి. సన్నగా, నీరసంగుంది. టీనేజ్‌ దాటిన ఆమె కూతురు మిడ్డీ, స్కర్ట్‌లో మిసమిసగుంది. పంజాబి అబ్బాయి ఆమెను దొంగ చూపులు చూస్తూ మేగజైన్‌ తిరగేస్తున్నాడు.‘‘శారదా...అటు చూడు! ఆ బిడ్డ అచ్చు తెలుగమ్మాయిలా లేదూ!’’ అక్కడ తెలుగెవరికి తెలియదని గుజరాతి అమ్మాయిని గురించి పెద్దగానే అన్నా.

‘‘అవునండోయ్‌... బాగానే గమనించారే! కాకుంటే చీరే..గుజరాతి స్టయిల్‌! అదే మన కట్టయితే...తెలుగుతనం ఉట్టి పడదూ!’’‘‘అది సరేగాని...నాకెందుకో ఆమె తెలుగమ్మాయే అనిపిస్తోంది! ఓ సారి కదపరాదు!’’‘‘నిజమే సుమి...అడిగి చూస్తా!’’పిల్లవాడి అల్లర్ని గురించి భ ర్తతో వాదిస్తోందా అమ్మాయి. అతనామెతో ఏదో చెప్పిబాబును బుజ్జగిస్తోన్నాడు. వాడు మారాం చేస్తూ ముద్దులొలుకుతున్నాడు.‘‘ఏమమ్మాయ్‌....హైద్రాబాదులో మీరెక్కడుంటారు?’’ శారద గొంతు సవరించుకుని అడిగింది.‘‘క్యాఁ?...క్యా పూచ్‌ రహీఁ?’’ ఆమె ముఖం చిట్లించింది.‘‘లాభం లేదు! ఆమె గుజరాతీనే!’’ అని నిర్దారించుకుని, ‘‘తుమ్‌ సిటి మే కహాఁరహతే?’’ నాకు తెలిసిన హిందీలో కలుగ చేసుకున్నా. ‘‘హమ్‌ ఇధర్‌కే నహీఁ! రాజమండ్రిసే వదోదర జా రహీఁ!’’ ఆమె భర్త జవాబు చెప్పాడు.‘‘నామ్‌ క్యా హై? డైలాగ్‌ పొడిగించా.‘‘మేరా నామ్‌ కిరణ్‌! మేరా బీవి...పద్మజ! లడకా...చరణ్‌!’’ నాకింకో ఛాన్స్‌ లేకుండా ముగించాడు.‘‘ఓహోఁ! గుడ్‌!’’ ఇక హిందీలో కష్టపడ్లేక నోరు మూసుకున్నా.‘‘తెలుగు నేల నుంటూ....తెలుగు రాదా!’’ శారద బుగ్గలు తెగ నొక్కేసుకుంటోంది.