‘‘పోతే పోనీ. నాకేంటి? నేను మొగోడిని! ఎలాగైనా బతికేస్తాను. మొగుణ్ణి వదిలి అదెలా బతుకుద్ది?’’ తాయారు వెళ్ళిపోయిన రోజున సత్తిబాబు బీడీ ముట్టిచ్చి నిర్లక్ష్యంగా పొగ ఒదులుతూ అనుకున్నాడు.కానీ ఎన్ని రోజులు గడిచినా తాయారు జాడ లేకపోయేప్పటికి సత్తిబాబుకి గుబులు మొదలైంది.పైకప్పు నుండి తాటాకు నుసి కిందపడి బర్రెల పాకంతా చీదరగా ఉంది. కుడితి తొట్టి వంచి పెడితే అశుభం అంటారు. కాని చాలా రోజులుగా అది అలానే ఉంది. ఇల్లంతా దుమ్ము. పట్టె మంచం మీద దుప్పటీ దిండూ మాసిపోయి ఉన్నాయి. వంటిల్లు ఖాళీగా ఉంది. టివిలో పాటలు మోగి చాన్నాళ్ళయ్యింది. పైనంతా బూజు. తాయారు ఇంటి దగ్గర ఉండుంటే ఇల్లు ఇలాగుండేది కాదు!రెండిళ్ళవతల చేతి బోరుంది. చచ్చీచెడీ రెండు బక్కెట్లు కొట్టుకొచ్చాడు. ఒక్క బక్కెట్టు నిండటానికే రెండు పెద్ద పండగలు నడిచినంత కాలం పట్టినట్టనిపించింది. 

తాయారు ఉండుంటే ఎలా చేసుద్దో తెలీదు గానీ తొట్లకి తొట్లు నింపి అవతల పారేసేది! పేస్టు అయిపోయి ఇప్పటికి నాలుగు నాళ్ళు. తాయారుండుంటే సందు చివర వెంకటేశు కొట్టుకెళ్ళి పళ్ళపొడి పొట్లమైనా తెచ్చి ఉండేది. ఇప్పుడు తనే వెళ్ళి తెచ్చుకోవాలి. తెచ్చుకోవచ్చు. కానీ తను వెళ్ళలేకపోతున్నాడు. ఎక్కడికీ వెళ్ళలేకపోతున్నాడు. ఎందుకు?వేప పుల్ల పళ్ళ కింద నలుగుతోంది. రాత్రి జరిగిన సంగతి గుర్తొచ్చింది. పెళ్ళికి పిలిస్తేనే కదా వెళ్ళాడు!‘‘పెళ్ళికొడుకూ, పెళ్ళికూతురూ ఇటొచ్చి పెద్దోళ్ళ కాళ్ళకి దణ్ణం పెట్టండి’’ పంతులు కేకేశాడు.

కొత్త దంపతులు వరుసపెట్టి అందరి కాళ్ళకీ మొక్కారు. తన దగ్గరకీ వచ్చారు. వచ్చాక పెళ్ళికూతురు శ్రీలత తనొంక ఎగాదిగా చూసింది. తరువాత కాస్త దూరంగా ఉన్న అమ్మ, నాన్నలొంక చూసింది. తిరిగి వాళ్ళు ఆ పిల్ల వంక అయోమయంగా చూశారు. చివరికి మొక్కీమొక్కనట్టుగా మొక్కి గబగబా పక్కకి జరిగిపోయింది. ఆలోచిస్తే అది పెద్ద సంగతి కాదు. కానీ రాత్రి నుండీ అదే విషయం మాటిమాటికీ గుర్తుకొస్తోంది. ఒక్కసారి దిగులైపోతోంది.‘‘పెళ్ళిళ్ళల్లో కాళ్ళు మొక్కిచ్చుకోను నేనింక పనికిరానా?!’’ సత్తిబాబుని ఈ ఆలోచన వదలడమే లేదు.