అంజయ్య నగర్‌లో, ఆ రేకుల ఇంట్లో, ఆ ఇంటి ఇల్లాలు దేకి, ఆమె కొడుకు సురేష్‌ విచారాగ్రస్తులై వున్నారు. ఇంటి యజమాని రామారావు మాత్రం ముభావంగా వున్నాడు. కరంట్‌ బల్బు శక్తి కోసం ఎదురుచూస్తూ వుంటే కిరసనాయిలు బుడ్డి గుడ్డిగా వెలుగుతోంది.శక్తి వుడిగిపోయిన దానిలా దేవకి గోడకి ఆనుకుని వున్నది. ఆమె ముఖం వాడిపోయి, ఆపలిపోయి వుంది. అప్పుడే ప్రయాణం చేసి వచ్చినందున అలసటగా వుంది.‘‘నా తమ్ముళ్ళు అంత మోసం చేస్తారనుకోలేదు బావా!’’గొణునగుతున్నట్టుగా అన్నది దేవకి.‘‘ఎన్నిసార్లు అంటావు ఆ మాట. ఇక చాల్లే’’. విసుగ్గా అన్నాడు రామారావు.జరిగిన దానికి అతనికీ బాధగానే వుంది. కానీ ఇంటికి యజమాని అయిన తను ధైర్యం కోల్పోతే ఎలా? అందుకే శివుడు గరళాన్ని గొంతులోనే దాచుకున్నట్టుగా, అతను విషాదాన్ని భరిస్తున్నాడు.‘‘ఇప్పుడెట్టా బావా? సురేష్‌ కాలేజీలో ఎట్టా చేరాలె? ఎంత ఆశతో వున్నాడో కదా? వాడి చదువు ఆగిపోవాల్సిందేనా?’’ దేవకి కంఠం వణికింది. ఆమెకు దుఃఖం ఆగడం లేదు. వెక్కెక్కి ఏడవడం మొదలుపెట్టింది. ‘‘ఎందుకే ఏడుస్తావు? నువ్వనుకున్నట్టు జరగలేదు. జరగదని తేలిపోయింది. ఏడ్చి మొత్తుకున్నందువల్ల లాభం ఏంటి?’’ అని భార్యని మందలించాడు రామారావు.కొన్ని గంటలముందే ఆమె తమ్ముళ్ళ చేతిలో దారుణంగా మోసపోయి, రక్తసంబంధం కూడా డబ్బు ముందు వెల వెల పోవలసిందే అనే దారుణమైన అనుభవాన్ని మూటగట్టుకుని వచ్చింది. 

ఆ దెబ్బ నుంచి ఆమె తేరుకోలేకపోతోంది.తమ్ముళ్ళు ఇట్లా మారిపోతారని తెలిసివుంటే, వూహించగలిగి వుంటే, తండ్రి బతికివున్నప్పుడే జాగ్రత్త పడి వుండేది. రక్త సంబంధాన్ని మించిన అనుబంధం లేదనుకుంది. అనుమానించలేకపోయింది. మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాల మీద ఆధారపడతాయనే సూత్రం ఆమెకు ఎవరూ బోధించలేదు.ఇరవై రెండేళ్ళ క్రితం దేవకి రామారావుల వివాహం జరిగింది. అతను దూరపు చుట్టమే. వరసకి బావ అవుతాడు. హైదరాబాదులోని ఒక ఫ్యాక్టరీలో ఫిట్టర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి ఆస్తి అంటూ ఏమీ లేకపోయినా ఉద్యోగం ఉంది, భార్యను బతికించుకుంటాడనే భరోసాతో దేవకినిచ్చి పెళ్ళి చేశాడు ఆమె తండ్రి. పల్లెటూళ్ళో పాతిక ఎకరాలున్న కుటుంబంలో యిచ్చినా కూతురు సుఖపడేది ఏముంది? ఇంటి పని, గొడ్లకు చాకిరీ, పొలంలో మట్టి పిసక్కా తప్పదు. ఉద్యోగం వున్న వాడికి యిస్తే నగరంలో సుఖపడుతుంది అనుకున్నాడు.దేవకి పెళ్ళయిన ఆర్నెల్లకే ఆమె తల్లి జబ్బు చేసి చనిపోయింది. ఆమెకు ముగ్గురు తమ్ముళ్ళు మైనర్లు. తండ్రిని ఒప్పించి చిన్న తమ్ముళ్ళు ఇద్దరినీ తన దగ్గరకు తెచ్చుకుని సాకింది. చదువులు చెప్పించింది. పెద్ద తమ్ముడు వూళ్ళోనే తండ్రికి చేదోడుగా వుండిపోయాడు. తర్వాత ఆమె ఇద్దరు తమ్ముళ్ళూ వుద్యోగాలు సంపాదించుకుని, పెళ్ళిళ్ళు చేసుకుని ఎటువాళ్ళటు వెళ్ళిపోయారు.