‘‘కనబడుట లేదు... మిస్సింగ్‌.. పతానై.. వై?’’ ఇన్‌స్పెక్టర్‌ ఫేస్‌ని క్వశ్చన్‌ మార్క్‌గా పెట్టి ప్రశ్నించాడు దివాకరాన్ని కొరకొరా చూస్తూ.‘‘వై? అంటే నేనేం చెప్పను... అయినా మా అబ్బాయి కనిపించక నేనేడుస్తుంటే మీ క్వశ్చన్లేమిటి?’’ దివాకరం పళ్ళు పటపట కొరికి అన్నాడు.‘‘ఏంటీ... వేరుశనక్కాయలు తింటున్నారా?’’ పళ్ళు పటపటని అపార్థం చేసుకొని అడిగాడు ఇన్‌స్పెక్టర్‌. వెంటనే దివాకరం భార్య దీప ఇన్‌స్పెక్టర్‌ వైపు సీరియస్‌గా చూసింది.‘‘స్సరేస్సరేగ్గానీ... ఇంతకీ మీ అబ్బాయి ఎప్పటినుంచి కనిపించడం లేదు?’’ అడిగాడు ఇన్‌స్పెక్టర్‌ చెవిలో గుబిలిని అగ్గిపుల్లతో తీసుకుంటూ. ఆ దృశ్యం చూసిన దీప ‘‘ఛీ... యాక్‌’’ అంటే, దివాకరం ‘‘ఛీ... యాక్‌..’’ అన్నాడు.ఇన్‌స్పెక్టర్‌ తన గుబిలి ప్రోగ్రామ్‌ ఆపి... గంభీరంగా మొహంపెట్టి ‘‘చెప్పండి... మీ అబ్బాయి ఎప్పట్నుంచి కనిపించడం లేదు?’’ అడిగాడు.

‘‘ఇవ్వాళ ఉదయం ఎనిమిది గంటల అయిదు నిమిషాల నుంచి...’’ దివాకరం చెప్పాడు.‘‘లవ్‌ ఎఫయిరేమో.. కనుక్కున్నారా? ఐ మీన్‌ మీ అబ్బాయికి అమ్మాయిలతో ‘ఝనక్‌ ఝనక్‌ పాయల్‌ బాజై’... లాంటిదేమైనా..?’’‘‘ఇ..న్స్‌..పె..క్ట..ర్‌..’’ ఒక్కో అక్షరాన్ని అరమీటర్‌ సాగదీస్తూ, గొంతును యిరగదీసి అరిచాడు.వెంటనే ఇన్‌స్పెక్టర్‌ వీపు చరుచుకున్నాడు. టైప్‌ రైటర్‌మీద తలపెట్టి నిద్రపోతున్న రైటర్‌ ఉలిక్కిపడి లేచి సెల్యూట్‌ చేశాడు.‘‘అదేమిటయ్యా.... అంత సౌండిచ్చావ్‌... మా ఆవిడ కూడా ఇంత గట్టిగా అరిచి చావలేదు... ఇపడు నేనేమన్నానని?’’‘‘మా వాడికి లవ్‌ ఎఫయిరా? మూడున్నరేళ్ళ నా కొడుక్కి లవ్‌ ఎఫయిరా? హవ్వ... హవ్వవ్వ.. హవ్వవ్వవ్వ..’’ అన్నాడు దివాకరం.‘‘నేనూ హవ్వ హవ్వవ్వ హవ్వవ్వ’’ అంది దీప.ఇన్‌స్పెక్టర్‌ నాలిక్కరుచుకున్నాడు. వెంటనే దాన్ని కవర్‌ చేసుకుంటూ ‘‘మీ వాడికి శత్రువులెవరైనా వున్నారా?’’ అనడిగాడు.‘‘వున్నారు’’ చెప్పాడు దివాకరం.‘‘ఎవరు?’’ అడిగాడు ఇన్‌స్పెక్టర్‌.‘‘జార్జిబుష్‌... ముషారఫ్‌.. బిన్‌లాడెన్‌’’ దివాకరం చెప్పాడు.‘‘వ్వా..ట్‌..ట్‌..ట్‌’’‘‘యస్‌. వాళ్ళే మావాడికి పరమ శత్రువులు’’ కచ్చగా చెప్పాడు.తన మిస్టేక్‌ ఏమిటో... స్టిక్‌తో మోకాలి మీద కొట్టుకున్నాక తెలిసింది ఇన్‌స్పెక్టర్‌కి.్‌్‌్‌‘‘మరి మీవాడు ఎందుకు కనిపించకుండా పోయినట్టు?’’ ఇన్‌స్పెక్టర్‌ తెలుగు డైలీ సీరియల్స్‌లో స్వగతంగా మాట్లాడుకునే పాత్రల్లా గొణుక్కున్నాడు.‘‘అదే అర్థంగాక, బట్టతల గోక్కుని నేను, రేగుపళ్ళ వడియాలు తింటూ మా ఆవిడ బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాం’’ దివాకరం అన్నాడు.